OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!

Congress

Congress

తెలంగాణలో ప్రస్తుతం ఫ్రంటల్‌ పైరవీలు పెరిగిపోతున్నాయా? కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు, ముఖ్యులు ఎవరికీ తెలియకుండా…. చాపకింద నీరులా మోసాలు, వసూళ్ళ దందా యధేచ్చగా జరిగిపోతోందా? ఏకంగా మంత్రుల పేర్లు, వాళ్ళతో దిగిన ఫోటోలే పెట్టుబడిగా…. కొందరు దగుల్బాజీలు యాపారం మొదలెట్టేశారా? ఆ చెద పురుగులు పార్టీ పునాదుల్నే ధ్వంసం చేస్తున్నాయా? ఇంతకీ ఏంటా ఫ్రంటల్‌ పైరవీలు? పార్టీని, ప్రభుత్వాన్ని ఏ రూపంలో భ్రష్టుపట్టిస్తున్నాయి? పదేళ్ల గ్యాప్‌ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ‘ప్రజా ప్రభుత్వం’ పేరిట పాలన నడుస్తోంది. అటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇటు హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే… పార్టీలోని కొందరు అనుబంధ సంఘాల నేతలు మాత్రం…. బాగా తేడాగా వ్యవహరిస్తున్నారట. వాళ్ళ చర్యలతో ప్రజా ప్రభుత్వం బద్నాం అవుతోందన్న ఆందోళన కాంగ్రెస్‌ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. పార్టీ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్స్‌లో వివిధ రకాల పోస్టుల్లో ఉంటూ… తామేదో మంత్రులకు అత్యంత ఆప్తులమంటూ కలరింగ్ ఇస్తూ, అమాయక జనాన్ని నిలువునా ముంచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మోసాల వెనుక పక్కా ప్లానింగ్‌ కూడా ఉంటోందట. ఇలాంటి పైరవీ బ్యాచ్‌… సచివాలయంలోని మంత్రుల లాబీల్లోనో, చాంబర్లలోనో దిగిన ఫోటోలను ముందు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తారు. ఆ బిల్డప్‌తో మేం చాలా ‘పవర్‌ఫుల్’ అని అవతలి వాళ్ళను నమ్మిస్తారు. ఒకసారి నమ్మకం కుదిరాక అసలు సిసలు బకరా ప్లాన్‌ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ రేట్లు ఫిక్స్ చేస్తారు. అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్ వంటి పోస్టుల పేరుతో ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు గుంజుతున్నట్టు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు… కనీసం తమ పిల్లలైనా బాగుపడతారన్న ఉద్దేశ్యంతో తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ కంత్రీగాళ్ళకు సమర్పించుకుంటున్నారు. తీరా డబ్బులు చేతికి అందాక సదరు లీడర్స్‌ కమ్‌ బిల్డప్‌ బాబాయ్‌లు ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్నారట.

ఎలాగోలా…. వాళ్ళ అడ్రస్‌ కనుక్కుని వెళ్ళి నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారట. ఇలాంటి వ్యవహారాలు నిత్యకృత్యంగా మారిపోయాయన్నది తెలంగాణ పొలిటికల్‌ టాక్‌. ఈ దందా కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నెట్‌వర్క్ నడుస్తున్నట్లు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్న ఓ నాయక్…, ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహేష్ చెంచు అనే వ్యక్తిని మోసం చేయడంతో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే లీడర్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ జాబ్‌ కోసం ఓ జంట దగ్గర భారీగా మనీ గుంజినట్టు తెలుస్తోంది. మరోవైపు, ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయిస్తానంటూ ఇదే తరహా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్ల బాగోతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. బాధితులు కొందరు సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ లో ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం గాంధీ భవన్‌లో కూడా ఈ వసూళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో,,, పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, ఇలాంటి దందాలకు పాల్పడుతున్న లీడర్ల చిట్టా ఇప్పుడు పెద్దల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. నానా కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే… ఇలాంటి కొద్దిమంది పైరవీకారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని క్షేత్రస్థాయిలో ఆవేదన వ్యక్తం అవుతోంది. ఏకంగా… మంత్రుల పేర్లు వాడుకుంటూ, సెక్రటేరియట్ కేంద్రంగా సాగుతున్న ఈ మోసాలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే… పేదల్లో ప్రభుత్వం మీద, పార్టీ మీద నమ్మకం సడలుతుందన్న హెచ్చరికలు సైతం పెరుగుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే… ఇలాంటి ‘చేతివాటం’ బ్యాచ్‌ పార్టీ పునాదులకే ఎసరు పెడుతున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్స్‌ వాపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం, పోలీసులు సీరియస్‌గా యాక్షన్ తీసుకుని, ఈ ‘ఫ్రంటల్’ పైరవీకారులకు చెక్ పెడతారా? లేక కాంగ్రెస్ మార్క్ ‘గ్రూపు రాజకీయాల’ వెనుక ఈ దందాలు ఇలాగే సాగుతాయా? అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

×
×
Ad