OTR : తిరుపతిలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ మార్చేసిందా?

Tirupati

Tirupati

టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్‌ని మార్చడం సంస్థాగత మార్పా…? లేక భవిష్యత్‌ రాజకీయ కోణమా? సీనియర్‌ లీడర్‌ని పక్కకు పెట్టి యువ నాయకత్వానికి పగ్గాలు ఇప్పగించడం వెనక భారీ వ్యూహం ఉందా? అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? స్థానిక పరిస్థితులు ఏంటి? టెంపుల్ సిటీ తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ పెద్దలకు అత్యంత సెంటిమెంట్‌ ఉన్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, ఆ పార్టీ తరపున ఆరిణి శ్రీనివాసులు 60 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలవడం అప్పటి పరిణామాలు. అయితే… మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా…. ఇటీవల లోకల్‌ వైసీపీ కూడా దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి స్థానికంగా ఏ చిన్న ఇష్యూ దొరికినా వదలకుండా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమల సెంటిమెంట్‌తో ముడిపడ్డ అంశాలను లేవనెత్తుతుండటం ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. గోశాల వివాదం నుండి మొదలుపెట్టి మొన్నటి భూముల దందా వరకు ఏదో ఒక సమస్యతో తిరుపతి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్‌ అటెన్షన్‌లోకి వస్తోంది. కానీ… ప్రతిపక్షం దూకుడుకు తగ్గట్టు స్థానిక టీడీపీ నాయకులు గట్టి కౌంటర్స్‌ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. అందుకే గేమ్‌ ప్లాన్‌ మార్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్‌గా సుగుణమ్మను తప్పించి జేబీ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిండం ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ సంస్థాగత మార్పులో భాగంగానే కొత్త ఇన్ఛార్జ్‌ని నియమించామని అధిష్టానం చెబుతున్నా…అసలు కారణం మాత్రం విపక్షానికి చెక్‌ పెట్టడమేనన్నది లోకల్‌ టాక్‌. అయితే ఇదే సమయంలో ఇన్నాళ్లు తిరుపతి టీడీపీ బాధ్యతలు చూసిన సుగుణమ్మను పక్కన పెట్టడం కూడా చిన్న విషయం కాదంటున్నారు తమ్ముళ్లు. స్థానిక రాజకీయాల్లో ఆమె కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సుగుణమ్మతో పాటు భర్త వెంకటరమణ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అదే సమయంలో విస్తృత పరిచయాలు ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నప్పుడు కూడా బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. అధిష్ఠానం నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చినా అప్రమత్తం అవకుండా ఆమె నిర్లక్ష్యం వహించారని, దాని ఫలితమే ఈ మార్పు అని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

క్షేత్రస్థాయిలో పార్టీని ఆశించిన స్థాయిలో యాక్టివ్ చేయలేకపోయారనే అభిప్రాయం బలపడటంతో…., సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నాసరే… సుగుణమ్మ కుటుంబం చేజేతులా ఇన్చార్జ్‌ పదవిని పోగొట్టుకుందనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే సంస్థాగత బలం, ఆర్థిక సామర్థ్యం, వయసు ఉన్న జేబీ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారన్నది టీడీపీ ఇన్నర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు బలమైన అనుచరవర్గం ఉండటం జేబీకి కలిసివచ్చిన అంశమని అంటున్నారు. పైగా జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యప్రసాద్ కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపింది. ​ఇంతవరకు బాగానే ఉన్నా… జేబీకి అసలు సినిమా ముందుందనే మాటలు సైతమ వినిపిస్తున్నాయి. ఒకవైపు బలంగా ఉన్న విపక్ష నాయకులు, మరోవైపు టీడీపీలో ఉన్న పాత, కొత్త వర్గాల మధ్య సమన్వయం ఆయనకు కత్తిమీద సామేనని అంటున్నారు. జేబీ శ్రీనివాస్‌ నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు సుగుణమ్మ, దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి సీనియర్స్‌. దీంతో… అలాంటి వాళ్ళందర్నీ కలుపుకుని పోవడం అంత తేలికైన విషయం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విపక్షానికి గట్టిగా చెక్‌ పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే పార్టీ పెద్దలు ఆయన్ని రంగంలోకి దించారు కాబట్టి అదే అసలైన సవాల్‌ అన్నది స్థానిక విశ్లేషణ. అదే సమయంలో ఇన్ఛార్జ్‌ మారీ మారగానే… వైసీపీ కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది. ఒక రౌడీకి టీడీపీ ఇన్చార్జ్‌ పదవి ఇచ్చారని, అలాంటి వాళ్ళను మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా యుద్ధం మొదలుపెట్టింది వైసీపీ. అందుకు జేబీ అనుచరులు కూడా గట్టిగా రిప్లయ్‌ ఇస్తున్నారు. మా నాయకుడు ఇలా వచ్చాడో లేదో… అప్పుడే వాళ్ళు పోస్ట్‌లు పెడుతున్నారంటే భయం ఉన్నట్టేకదా అంటూ లాజిక్‌ లాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తిరుపతి రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.