OTR : ఆ టీడీపీ ఎమ్మెల్యేకు, కాపు నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతుందా..?

ఆ టీడీపీ ఎమ్మెల్యే ఏదో… అనుకుంటే… నియోజకవర్గంలో ఇంకేదో జరిగిపోతోందా? ప్రతిపక్షమే కాదు… చివరికి సొంత పార్టీలోని ఓ సామాజిక వర్గం నేతలకు, ఆయనకు మధ్య అనుకోని గ్యాప్‌ పెరిగిపోతోందా? గెలుపునకు కీలకమైన ఓటర్ల కులాన్ని ఎమ్మెల్యే దూరం చేసుకుంటున్నారా? లేక ఆయనకు సంబంధం లేకుండానే ఎక్కడో.. ఏదో… తేడా కొడుతోందా? ఎవరా శాసనసభ్యుడు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ… 2004 నుంచి ఇక్కడ పార్టీ ప్రయాణం పడుతూ లేస్తూ కొనసాగుతోంది. ఇక 2009లో పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ అయింది. 2004 నుంచి ఇప్పటి వరకూ ఆరు సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు రెండు విడతలు మాత్రమే గెలిచారు. అయితే.. ఆ రెండు విడతల్లో కూడా.. కూటమిగా జట్టుకట్టడం వల్లేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే 2009 పునర్విభజనలో గుంటూరు రూరల్ మండలం ప్రత్తిపాడు నియోజకవర్గంలో కలవడం టీడీపీకి ప్లస్‌ అయిందన్న విశ్లేషణలున్నాయి. ఈ మండలంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఆ ఓటర్లు దగ్గరైనప్పుడు గెలుపు, దూరమైనప్పుడు ఓటమి ఎదురయ్యాయని అంటారు. ఇందుకు 2019 ఎన్నికల్నే ఉదాహరణగా చెబుతుంటారు విశ్లేషకులు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్దిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు 26వేలకుపైగా ఓట్లు పడ్డాయి. అప్పుడు గెలిచిన వైసీపీ అభ్యర్థికి టీడీపీ మీద 7వేల400ఓట్ల ఆధిక్యం వచ్చింది.

అదే… ఆ ఎన్నికల్లో గనుక టీడీపీ, జనసేన గనుక జట్టు కట్టి ఉంటే… తేలిగ్గా గెలిచేవారని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక 2024లో కలిసి నడవడం ప్లస్‌ అయినా… ప్రస్తుతం ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులుకు, స్థానికకాపు సామాజికవర్గం నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మూడు నెలల క్రితం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో జరిగిన గొడవ సంచలనం రేపింది. అనుకోకుండా జరిగిన ఘటనలో కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన యువకుల మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారి కులం రంగు పులుముకుంది. కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడిపై కమ్మ సామాజికవర్గం యువకులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అయితే… దాడికి పాల్పడిన వారిని కేసునుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నించారని కాపు నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చెయ్యాలంటూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దగ్గరికి వచ్చి ఆందోళన చేశారు కూడా. అయితే…. రెండు వర్గాల వారు కావాల్సినవారే కావడంతో ఎమ్మెల్యే కామ్‌గా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై కాపుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఇక పది రోజుల క్రితం గుంటూరు రూరల్ మండం గోరంట్ల చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేత, డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు వెళ్ళారు. నీటి ట్యాంకర్లను గ్రామస్థులతో కలిసి అడ్డుకున్నారు. తర్వాత మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారాయన. అయితే అక్రమంగా నీటిని తరలించేవారికి మద్దతుగా మరో నేత కార్పొరేషన్ అధికారులకు ఫోన్ చేసినట్లు తెలుసుకున్న హరిబాబు గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే రామాంజనేయులు వద్దకు వెళ్లారు.

కానీ… అక్కడ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయట.నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలే తప్ప… ఇలా అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయడం ఏంటంటూ హరిబాబును ఎమ్మెల్యే నిలదీశారట. నీకు నాయకుల వద్ద పలుకుబడి ఉందని ఇలా హడావుడి చెయ్యడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డట్టు తెలిసింది. దీంతో డీసీఎంస్ ఛైర్మన్ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారని సమాచారం. నాది కూడా గోరంట్లేనని అంటూ…గత ఎన్నికల్లో గోరంట్లలో మీ గెలుపుకోసం పనిచేశానని గుర్తుచేశారట. నా ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకుని ప్రశ్నించడం కూడా తప్పా అని ఎమ్మెల్యే రామాంజనేయులు మీదే రివర్స్‌ అయినట్టు తెలిసింది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే గోరంట్లలో ఆక్రమణలున్నాయంటూ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జనసేనకు చెందిన వ్యక్తి స్థలంలో గోడ కూల్చేశారు. ఈ వ్యవహారం వెనుక కూడా రాజకీయ కోణం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గోరంట్లలో అక్రమ నీటి తరలింపు వ్యవహారమే ఇందుకు కారణన్న టాక్ కూడా వినిపిస్తోంది. అక్రమ నీటి తరలింపు అడ్డుకున్న జీడీఎంస్ ఛైర్మన్ హరిబాబు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. గోడ కూల్చివేత ఘటనలో జనసేనకు చెందిన వ్యక్తి బాధితుడు. ఇలా తరచూ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలతో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు. అదే జరిగితే మళ్లీ ప్రత్తిపాడులో టీడీపీకి కష్టకాలం తప్పదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.