స్థానిక ఎన్నికల సాక్షిగా కూటమి పార్టీల మధ్య కొత్త కోణాలు బయటపడుతున్నాయా? ఒకవైపు టీడీపీ, జనసేన రెండిటిలో అంతర్గత విభేదాలు, మరోవైపు రెండు పార్టీల మధ్య సమన్వ లోపం లాంటివి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయా? సొంత పార్టీ నాయకుల మీదే అగ్ర నేతలు అసహనం వ్యక్తం చేయడం, వార్నింగ్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? లోకల్ బాడీస్…. కూటమి వర్గాలకు చెప్పకనే చెప్పిన సందేశం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. అయితే… ఇదే సందర్భంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత, ఓట్ల బదలాయింపు లాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. మున్సిపల్, పరిషత్తు ఎన్నికల్లో కూటమి నేతలు సమన్వయంతో పని చేశారు. అడపా దడపా మినహా ఓట్ ట్రాన్స్‌ఫర్ విషయంలో కూడా పెద్ద తేడాలు కనిపించలేదు. అంతవరకు బాగానే ఉందని అనుకున్నా… అసలు సమస్య ఆ తర్వాతే మొదలైందని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా… టీడీపీ, జనసేన నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ల ఎన్నిక, మేయర్, ఛైర్మన్ ప్రమాణ స్వీకారాల టైంలో బయట పడ్డాయని చెప్పుకుంటున్నారు. అలాగే… నంద్యాల, నెల్లూరు లాంటి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కడం ఇబ్బందిగా మారిందట. నెల్లూరులో ప్రమాణ స్వీకారం కార్యక్రమం మధ్యలోనే మంత్రి ఆనం అలిగి బయటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లాలో టీడీపీలో చేరిన పిల్లి అనంతలక్ష్మికి జడ్పీ వైస్ చైర్మన్ పదవి నచ్చలేదట. ఆ సంగతి ముందే చెప్పాల్సిందని అంటూ ఆమె కూడా అలిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరు ఎమ్మెల్యే,విజయవాడ ఎంపీ మధ్య విభేదాలు, నంద్యాల ఎంపీ శబరి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య తేడాలు….ఇలా రకరకాల అంశాల గురించిన డిస్కషన్స్ టీడీపీ వర్గాల్లోనే జరుగుతున్నాయి.
వీటిపై స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సీరియస్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. ఇటు విజయవాడ మేయర్‌గా జనసేన నుంచి గెలిచిన వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి లోకల్ టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవకపోవడంతో పొలిటికల్ అటెన్షన్ పెరిగిపోయింది. దీని గురించి రెండు పార్టీల్లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే…. ప్రమాణ స్వీకార ఆహ్వానం విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడం కారణంగానే… ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌రావు, ఇతర టీడీపీ నేతలు అలిగినట్టు చెప్పుకుంటున్నారు. వేర్వేరు కారణాలతో రాలేకపోయినట్టు ఎమ్మెల్యేల కార్యాలయ వర్గాలు చెబుతున్నా….అసలు విషయం మాత్రం ప్రోటోకాల్ వివాదమేనన్నది పొలిటికల్ టాక్. అదే సమయంలో అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. బోండా ఉమా తన కుమారుడికి మేయర్ సీటు అడిగి భంగపడ్డ సంగతి తెలిసిందే. అటు గద్దె రామ్మోహన్ కూడా సన్నిహితుడి కోసం డిప్యూటీ మేయర్ అడిగారని…వర్కౌట్ అవకపోవడంతో డుమ్మా కొట్టారన్నది ఇంకో వెర్షన్. ఈ పరిస్థితుల్లో… గతం ఎలా ఉన్నా…. ఈ సారి మాత్రం గ్రూప్ తగాదాల విషంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా సీరియస్‌గా ఉన్నారట. తేడాలు జరిగిన చోట్ల ఇక యాక్షన్ ఉంటుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక జనసేనలోనూ అంతర్గత విభేదాలు బయట పడ్డాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలోనే రెబెల్స్ బరిలో దిగారు. రైల్వే కోడూర్ జనసేన ఎమ్మెల్యే పై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆయన ఇతర పార్టీల వారికి ఎలా మద్దతిస్తారంటూ ఫైరవుతున్నట్టు సమాచారం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతి వాతావరణం కూటమి వర్గాల్లో డిస్ట్రబెన్స్ సృష్టించినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు ఒకే పార్టీలోని వర్గపోరు, మరోవైపు రెండు పార్టీ మధ్య సమన్వయలోపం లాంటివి ఇలాగే ఉంటే… ముందు ముందు సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ నుంచి.

