OTR : తీవ్ర వివాదాస్పదంగా బుచ్చయ్య చౌదరి అనుచరుడి కుమారుడు

Tdp

Tdp

ఆ టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే సీటు కిందికి నమ్మినవాళ్ళే నీళ్ళు తెస్తున్నారా? ప్రధాన అనుచరుడి కుటుంబం ఏకంగా సమాంతర వ్యవస్థనే నడుపుతోందా? పేరుకు అనుచరుడి కొడుకైనా… నియోజకవర్గంలో షాడోలా ఓ యువ నేత పెత్తనం చెలాయిస్తున్నాడా? సదరు లీడర్‌ చేయని దందా అంటూ లేదన్న ఆరోపణల్లో నిజమెంత? అన్నిటికీ మించి రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేనంటూ ప్రచారం చేసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధాన అనుచరుడి కొడుకు వ్యవహారం నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదం అవుతోంది. 50 ఏళ్ల పైబడ్డ రాజకీయ అనుభవం, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డున్న బుచ్చయ్యకు ఇది మింగుడు పడని పరిణామం అంటున్నారు పరిశీలకులు. సిటీ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు గోరంట్లకు ప్రధాన అనుచరుడు. ఆయన కొడుకు బాబీ వ్యవహార శైలిపై ఇప్పుడు సొంత పార్టీతో పాటు కూటమి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవహారాల్లో జోక్యం.. సెటిల్మెంట్లు.. భూవివాదాలు.. ఇసుక దందాలు.. దాడుల ఆరోపణలు.. ఇలా వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అంతేనా…. ఏకంగా పెద్దాయనకే ఎర్త్‌ పెడుతున్నారా అన్న డౌట్‌ వచ్చేలా…భవిష్యత్ ఎమ్మెల్యేని నేనే అంటూ బాబీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పోలీస్ బదిలీల్లో భారీగా ముడుపులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. తనకు కావాల్సిన ఆఫీసర్స్‌ని పోస్టింగ్స్‌ వేయించుకుని పోలీస్ స్టేషన్స్‌లో అజమాయిషీ చెలాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే…ఎమ్మెల్యేను ప్రక్కన పెట్టి తానే అప్ కమింగ్ ఎమ్మెల్యేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో పాటు షాడో శాసనసభ్యుడిలా వ్యవహరిస్తున్నారన్నది బాబీ మీద పార్టీ వర్గాల ప్రధాన అభియోగం. తనకు ఎవరైనా అడ్డం తిరిగితే… అనుచరులతో కలిసి ఇళ్ల పై దాడులు చేస్తున్నారని చెబుతున్నారు.

ఇటీవల మాజీ హోం మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వెంకట రామదాసుతోపాటు ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, ఆ విడియోలు బయటకు రావడంతో పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. విషయం తెలుసుకున్న కాపు సంఘాల ఐక్యవేదిక హరిరామ జోగయ్య కుటుంబానికి మద్దతుగా నిలవడంతో కథ అడ్డం తిరిగింది. వ్యవహారం టీడీపీ అధిష్టానం దాకా వెళ్ళిందట. అలాగే… రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక మృతి ఘటన కూడా ఈ రాజకీయ చర్చలో ప్రస్తావనకు వస్తోంది. ఈ కేసు నిందితులకు వాసిరెడ్డి బాబీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఘటన జరిగినప్పుడు నిందితులకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలున్నాయి. అలాగే… రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి గ్రామపంచాయతీ పరిధిలో తెనాలికి చెందిన ఓ మహిళకు సంబంధించిన పది సెంట్ల స్థలం విషయంలోనూ బాబీపై ఆరోపణలు వచ్చాయి. అది టీడీపీ పెద్దల దృష్టికి వెళ్లడంతో.. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకున్నారట. ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంప్ వ్యవహారంలోనూ బాబీ వర్గానికి వాటాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ద్వారా రోజు వారీ ముడుపులు వసూలు చేస్తున్నారన్నారని, అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రధాన అనుచరుడి కొడుకు చేస్తున్న వ్యవహారాలు రివర్స్‌ అవుతూ…ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇమేజ్ దెబ్బ తింటోందన్నది లోకల్‌ టాక్‌. వాసిరెడ్డి బాబీ… నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సమాంతరంగా ఎదుగుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేగాని, పార్టీ పెద్దలు గాని వెంటనే జోక్యం చేసుకోకుంటే…మొత్తంగా రాజమండ్రి రూరల్‌లో టీడీపీనే డ్యామేడ్‌ అవుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.