Site icon NTV Telugu

Off The Record : 20 నెలలుగా సుడా పాలక మండలి లేక పడకేసిన అభివృద్ధి

Suda

Suda

ఆశావహులు ఆవురావురుమంటున్నా… ఆ పోస్ట్‌ 20 నెలల నుంచి ఎందుకు ఖాళీగా ఉంది? ఒక ముఖ్య నాయకుడి ప్రధాన అనుచరుడికే ఇవ్వమని మరో ముఖ్య నేత ప్రతిపాదించారు. పెద్దగా వివాదాలేం లేవు. అయినా భర్తీలో ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోంది తెలంగాణ ప్రభుత్వం? పైకి కనిపించకుండా ముందరి కాళ్ళకు బంధాలు పడుతున్నాయా? ఏదా పోస్ట్‌? నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఖమ్మం జిల్లాలో స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ…సుడా పరిధి చాలా ఉంది. కామేపల్లి, ఏన్కూర్, కారేపల్లి మండలాలు మినహా… మిగిలిన 17 మండలాల్ని సుడా పరిధిలోకి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్‌ఎస్‌ హయాంలో ఖమ్మం నగరంతో పాటు పాలేరు, వైరా, మధిర మండలాల్లోని కొన్ని గ్రామాలను కలిపితే…కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ లిమిట్స్‌ భారీగా పెరిగాయి. ఇప్పుడు దాదాపు ఒక లోక్‌సభ నియోజకవర్గమంత పరిధిలో ఉంది సుడా.

 

అంతటి ప్రాముఖ్యత ఉన్న సంస్థకు 20 నెలలుగా పాలక మండలి లేక ఊసూరుమంటోంది. అభివృద్ధి పనుల విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. 2020లో సుడా ఛైర్మన్‌గా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అనుచరుడు విజయ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారాక 2023 డిసెంబర్ 10న సుడా పాలక వర్గాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఇక భర్తీ సంగతి మర్చి పోయారా అన్నట్టుగా ఉంది వ్యవహారం. మొదట్నుంటి ఖమ్మం ఎమ్మెల్యే ఎవ్వరు ఉంటే వాళ్ళ అనుచరులకే స్తంభాద్రి అర్బన్‌డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆధిపత్యం ఉండేది. అయితే… ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పాత కాంగ్రెస్ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారట.

అందుకే… సుడా చైర్మన్ గా ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌కు ఛైర్మన్‌ పోస్ట్‌ ఇవ్వాలని ప్రతిపాదించారు. దుర్గా ప్రసాద్ కూడా కాంగ్రెస్ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. అయితే… ఇక్కడే ఓ కొత్త సమస్య వచ్చిందట. త్వరలో డీసీసీ అధ్యక్షులను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో…ఆ ఎంపిక ఎంతవరకు కరెక్ట్‌ అన్న చర్చ మొదలైందట పార్టీ వర్గాల్లో. దుర్గా ప్రసాద్ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడు కూడా. అటు భట్టి దుర్గాప్రసాద్‌కు మరోసారి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. తన ముఖ్య అనుచరుడు డీసీసీ అధ్యక్షుడుగా ఉంటే… జిల్లా పార్టీ అంతా తన చేతుల్లోనే ఉంటుందన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో ఒకరికి ఒకటే పదవి అన్న నినాదం బలంగా ఉన్న క్రమంలో… దుర్గాప్రసాద్‌కు డీసీసీ, సుడా సుడా చైర్మన్ పదవులు రెండిటినీ ఇవ్వకపోవచ్చన్న అనుమానాలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో… తన ముఖ్య అనుచరుడికి సుడా ఛైర్మన్‌ పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న సస్పెన్స్‌ ఉంది పార్టీ వర్గాల్లో. ఒకవేళ దుర్గా ప్రసాద్‌కు కాకుంటే… సాదు రమేష్ రెడ్డికి తుమ్మల లేఖ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. రమేష్ రెడ్డి గత ఏడెనిమిదేళ్ళుగా…తుమ్మల వెంట ఉంటున్నారు. ఆయన సామాజిక వర్గం నేతలు పొంగులేటి, కందాల ఉపేందర్ రెడ్డి జిల్లాలో కీలకంగా ఉన్నా… సాదు మాత్రం తుమ్మల వెంటే నడుస్తున్నారు. అందుకే… ఫస్ట్‌ ప్రయారిటీ దుర్గాప్రసాద్‌కు, ఆ తర్వాత మాత్రం సాదు ప్రసాద్‌కే ఇవ్వవచ్చని భావిస్తున్నారు. సరే… ఎవరికైనా ఇవ్వండిగానీ…. ముందు పాలక మండలిని నియమించి అభివృద్ధి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోమంటున్నారు ఈ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలు.

 

Exit mobile version