ఆ ఐపీఎస్ ఆఫీసర్ బదిలీ వెనక చాలా పెద్ద తతంగమే నడిచిందా? ఆయన్ని తప్పించడానికి ఓ వర్గం గట్టిగా లాబీయింగ్ చేసిందా? ఆయన పెడుతున్న వరుస కేసులతో ఏకమైన వాళ్ళంతా…. ప్రభుత్వ పెద్దల మీద వత్తిడి తెచ్చారా? స్వలాభం కోసం సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న బడా లాబీ బదిలీ వెనక ఉందా? ఎవరా ఆఫీసర్? బయట జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? తెలంగాణలో 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు పోలీసు శాఖలోనే కాకుండా… ఇప్పుడు పొలిటికల్‌గా కూడా చర్చనీయాంశం అయ్యాయి. మిగతా ట్రాన్స్ఫర్స్ అన్నీ ఒక ఎత్తయితే… పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర స్థానచలనాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాయట పొలిటికల్ సర్కిల్స్. స్టీఫెన్ ట్రాన్స్ఫర్ వెనక పరిపాలనా పరమైన వ్యవహారానికి మించింది ఇంకేదో ఉందన్నది ఎక్కువ మంది డౌట్ అట. రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాలు, భారీ బకాయిల వసూళ్లు, ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలపై దర్యాప్తు వేగవంతమవుతున్న టైంలో జరిగిన ఈ బదిలీ అనేక సందేహాలను రేపుతోందట. రాష్ట్రంలో రైస్ మిల్లుల వ్యాపారం ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావవంతమైన వర్గాలతో ముడిపడి ఉందనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. మిల్లర్ల సంఘాల ద్వారా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపడం, తమ సమస్యలను రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం సాధారణమే. అయితే మిల్లర్ల CMR అక్రమాలపై చర్యలు తీసుకుంటున్న సమయంలో స్టీఫెన్ రవీంద్ర బదిలీ కావడంతో… లాబీయింగ్ చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. మిల్లర్లపై చర్యలు ఇలాగే… కొనసాగితే తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని భావించిన కొన్ని బడా వ్యాపార వర్గాలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించాయా? ఉన్నతాధికారి మీద అత్యున్నత స్థాయిలో ఫిర్యాదులు చేశాయా? దాని ఫలితంగానే సివిల్ సప్లయ్స్ నుంచి స్టీఫెన్‌ను తప్పించారా అన్న చర్చలు పెరిగిపోతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలతో సన్నిహిత సంబంధాలున్న మిల్లర్లు ఈ బదిలీ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా? అంటూ రకరకాలుగా గుసగుసలు పెరిగిపోతున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో స్టీఫెన్ రవీంద్ర పాత్ర కీలకంగా నిలిచింది. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం బకాయిల వసూళ్లతో పాటు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వాళ్ళపై చర్యలు తీసుకునేలా ఆయన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ విజిలెన్స్ తనిఖీలు, భౌతిక నిల్వల పరిశీలన, నోటీసులు, క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలతో మిల్లింగ్ వర్గాల్లో ఒక రకమైన కంగారు మొదలైందట. ముఖ్యంగా సన్నరకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని, ఎఫ్‌సీఐకి తక్కువ ధర కలిగిన దొడ్డు రకం బియ్యం సరఫరా చేశారన్న ఆరోపణలపై సీఐడీ రంగంలోకి దిగింది. అక్టోబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మూడు కేసుల్లో 14 మంది మిల్లర్లను అరెస్టు చేయడంతో ఆ వర్గం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఎపిసోడ్లో దీన్ని అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 మిల్లుల నుంచి దాదాపు 3వేల385 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యం సరఫరా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇక బోనస్ చెల్లింపుల రూపంలో ప్రభుత్వానికి సుమారు కోటి 69 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ కేసులు ఇంకా దర్యాప్తులో ఉండగానే పౌరసరఫరాల శాఖ కమిషనర్ బదిలీ అవడం చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లో… ఇప్పటివరకు తీసుకున్న చర్యలు కొనసాగుతాయా? బకాయిల వసూళ్ల విషయంలో గతంలో ఉన్న వేగం ఇక మీదట కూడా ఉంటుందా? అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇదే స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందా? అన్నవి ప్రస్తుతానికి సమాధానాల్లేని ప్రశ్నలేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

