OTR : సిక్కోలు రాజకీయాల్లో గుండ పేరు లేకుండా చేయాలనుకుంటున్నారా ?

Td[

Td[

సిక్కోలు పాలిటిక్స్‌లో సీనియర్ లీడర్‌. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా…. ఒక్క అవినీతి మరక అంటలేదు. పైగా సొంత భూములు అమ్మి రాజకీయం చేశారని చెప్పుకుంటారు. బతికినంత కాలం పసుపు జెండా తప్ప మరోటి తెలియని ఆ నేత విగ్రహం పెట్టడాన్ని ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారా? అమెరికా నుంచి వచ్చిన వారసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారా? పెద్దాయన విగ్రహం పెడితే వాళ్ళకేంటి నష్టం? ఎవరా సైకిల్‌ సైంధవులు? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోట. దాన్ని అలా తయారు చేయడంలో ఆ మధ్య చనిపోయిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ పాత్ర చాలా ఉందని పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి. బతికినంత కాలం టీడీపీ తప్ప మరో పార్టీ వైపు చూడలేదాయన. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి కూడా పనిచేశారు. అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి కూడా ఒకసారి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ… కొన్ని ఈక్వేషన్స్‌తో గత ఎన్నికల్లో గుండ ఫ్యామిలీకి టికెట్ దక్కలేదు. తర్వాత కూడా పార్టీనే నమ్ముకొని, పల్లెత్తు మాట అనకుండా ఉంది గుండ ఫ్యామిలీ. అప్పల సూర్యనారాయణ కుమారులు ఇద్దరూ అమెరికాలో ఉండడంతో… ఎలాంటి గ్రూప్ పాలిటిక్స్‌ లేకుండా సిక్కోలు టీడీపీ నడచిపోతోంది.

 

ఐతే తాజా పరిణామాలు మాత్రం పార్టీలో వర్గపోరుకు తెరలేపేట్టు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. నాడు మాజీ మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఇక ఇటీవల ఆయన కుమారులు, అభిమానులు టౌన్‌లో రెండు చోట్ల ఆయన విగ్రహాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నది కూడా తమ పార్టీనే కావడంతో ఇక ఇబ్బందులేం ఉండబోవని భావించారట. అనుమతుల కోసం అధికారులు, జిల్లా మంత్రులను కలిసి ఒకే అనిపించుకున్నారు కూడా. విగ్రహాలు తెప్పించి ఒకదాన్ని శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్‌లో పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడే ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ ప్రక్కనే అప్పలసూర్యనారాయణ స్టాట్యూ కోసం బేస్‌మెంట్‌ నిర్మించారు. అయితే మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించడం పొలిటికల్ రచ్చకు దారి తీస్తోంది. ఉన్నంతకాలం పార్టీనే శ్వాసగా బతికిన నాయకుడి విగ్రహం పెడతామని ఆయన వారుసులు ముందుకు వస్తే…ఎందుకు అడ్డుపడుతున్నారంటూ కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే…. ఇక సిక్కోలు రాజకీయంలో గుండ ఫ్యామిలీ ప్రస్తావన లేకుండా చేయాలనుకుంటున్నారా అని కూడా ఘాటుగా అడుగుతున్నారు. పార్టీలోని ఒకవర్గం నాయకులు తెర వెనుక అధికారులతో జరిపిన మంతనాలతోనే కూలగొట్టారంటూ మొదలైన ప్రచారం చినికి చినికి గాలివానగా మారుతోంది.

మరోవైపు పెరుగుతున్న నిరసన స్వరాలతో ఉలిక్కిపడ్డ అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టు తెలిసింది. పార్టీలో ఉన్నన్నాళ్ళు అధిష్టానం గీసిన గీత దాటని, నిజాయితీగా రాజకీయాలు చేసిన దివంగత నేత విగ్రహాలకు సొంత పార్టీ నాయకులే అడ్డు చెప్పడం ఏంటో అర్ధం కావడంలేదన్న చర్చ శ్రీకాకుళం టీడీపీలో జరుగుతోంది. ఆయన ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి చాలా ఆఫర్లు వచ్చినా తిరస్కరించడమేగాక… నా ఆఖరు శ్వాస వరకు టీడీపీలోనే అన్న గుండ విగ్రహం విషయంలో సొంత పార్టీ నేతలే సైంధవుల్లా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అధికారులు ముందు అనుమతి ఇచ్చి తర్వాత ఎవరి ప్రోద్బలంతో పిల్లర్లు ధ్వంసం చేయించారో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గుండ అప్పల సూర్యనారాయణను రాజకీయాల్లో అజాత శత్రువుగా చెప్పుకుంటారు. ప్రతిపక్ష నేతలు కూడా ఆయన్ని ఏమీ ఆనబోరంటేనే అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు గుండ ఫ్యామిలీ అభిమానులు. అలాంటి పేరున్న అమరుడి విషయంలో అసూయ రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులు ఎవరోనంటూ రకరకాల చర్చలు సైతం నడుస్తున్నాయి. అటు విగ్రహం పెట్టడానికి అమెరికా నుంచి వచ్చిన అప్పల సూర్యనారాయణ వారసులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిశారట.

 

విషయాన్ని వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి…. జిల్లా కలెక్టర్‌ను కలసి ట్రాఫిక్‌కు అడ్డలేకుండా..ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా విగ్రహం పెడతామని అనుమతులు తీసుకున్నారు. ఆ మేరకే…. ఏడు రోడ్ల కూడలి దగ్గర 80 ఫీట్ రోడ్డులో అరసవల్లి జంక్షన్ వైపు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ… దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టు మున్సిపల్‌ అధికారులు అడ్డుపడ్డారు. ఇక్కడే చాలా మందిని ఒక ప్రాధమిక ప్రశ్న వేధిస్తోంది. నగరంలో చాలా విగ్రహాలున్నాయి. అప్పుడెప్పుడూ రాని అభ్యంతరాలు గుండ విగ్రహం విషయంలోనే ఎందుకు వస్తున్నాయంటూ సమాధానం కోసం వెదుకుతున్నారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన గురువుకే ఇక్కడి నేతలు కొందరు పంగనామాలు పెడుతున్నారంటూ చర్చించుకుంటున్నారు కూడా. బహుశా అప్పల సూర్యనారాయణ కొడుకుల్లో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే… తమ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కొందరు భయపడుతుండవచ్చన్న వాదనలు సైతం ఉన్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా…. జిల్లాకు చెందిన పార్టీ పెద్దలుగాని, అటు అధిష్టానంగాని ఒక్క మాట మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గుండ కుటుంబ అభిమానులు. ఇది ఇలాగే కొనసాగితే… శ్రీకాకుళం టీడీపీలో గ్రూప్స్‌ ఖాయమని హెచ్చరిస్తున్నారు.