Site icon NTV Telugu

Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

Shailajanath

Shailajanath

ఎప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన జరగకపోదా.. తనకు పోటీ చేసే అవకాశం రాకపోదా అన్న ఆలోచన ఆ నేత మదిలో ఉంది. ఆ నేత విషయంలో నిజంగానే కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు తనతో పాటు తన భార్యకు కూడా అవకాశం కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. టికెట్ వస్తుందా రాదా అన్న ఆలోచన దగ్గర నుంచి కచ్చితంగా మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ గ్యారెంటీ అన్న ధీమా ఆ నేతలో కనిపిస్తుందట. ఈసారి టికెట్ భార్యకు వస్తుందా లేదా ఆ భర్తను వరించనుందా..? ఇంతకీ ఎవరు ఆ దంపతులు…?

నియోజకవర్గాల పునర్విభజన కొందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంటే…మరికొందరిలో కొత్త ఆందోళనలతో అలజడీ రేపుతోంది. ఇన్ని రోజులు కట్టుకున్న కోటకు బీటలువారుతుందా అనే టెన్షన్ వెంటాడుతోంది. అనంతపురం జిల్లాలో జొన్నలగడ్డ దంపతుల కథ కూడా అలానే వుంది. శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాల లెక్కలు, సమీకరణాల లెక్కల్లో మునిగిపోయారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు ఆలూరు సాంబశివారెడ్డి. శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కావడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా నాడు ఆమె ఓటమిపాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో పద్మావతి గెలిచారు. మొదట ఆమెకి మంత్రి పదవి కూడా వరిస్తుందని అంతా భావించారు. కానీ కొన్ని కారణాలు, సమీకరణలతో అది దూరమైంది. అయితే, భర్త సాంబశివారెడ్డికి వైసీపీ హయాంలో కీలకమైన పదవులు దక్కాయి. క్యాబినెట్ ర్యాంకు హోదాలో కలిగిన పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో రెండుసార్లు వరుసగా పదవులు వచ్చాయి. జగన్‌కు సన్నిహితుడని క్యాడర్‌ కూడా గొప్పగా చెప్పుకునేవారు. కానీ 2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం షాకిచ్చింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ జొన్నలగడ్డ పద్మావతికి కనీసం టికెట్ సాధించుకోలేకపోవడం చర్చనీయాంశమైంది.

జగన్‌కు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ జొన్నలగడ్డ పద్మావతి కి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. దీంతో అధిష్టానం పెద్దలు కూడా పునరాలోచించారు. కానీ సాంబశివారెడ్డిని ఏమాత్రం పక్కన పెట్టకుండా ఒక అభ్యర్థిని చూడాలని ఆయనకే బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులుకి టికెట్ ఇచ్చారు. ఆ ప్రయోగం 2024 ఎన్నికల్లో బెడిసి కొట్టింది…ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు శైలజానాథ్ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు శింగనమలలో మంచిపట్టు ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో ఆయనకే శింగనమల టికెట్ కన్ఫర్మ్ అని డిస్కషన్ జరుగుతోంది. అప్పుడేమో టికెట్ రాలేదు…ఇప్పుడేమో శైలజానాథ్‌ రూపంలో జొన్నలగడ్డ దంపతుల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి సమయంలో నియోజకవర్గాల పునర్విభజన వారిలో కొత్త ఆశలే కాదు….కొత్త టెన్షన్‌తోనూ పరేషాన్ తీవ్రమవుతోంది.

సాంబశివారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎంత ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కూడా ఆయనకు ఉంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శింగనమల కూడా చీలిపోయే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. శింగనమల యధావిధిగా ఎస్సీ రిజర్వ్ అయితే అక్కడ శైలజానాథ్ పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదే క్రమంలో చీలిపోయిన నియోజకవర్గంలో తనకు అవకాశం ఉంటుందా అనే ఆశ సాంబశివారెడ్డిలో ఉంది. దీంతోపాటు మహిళలకు 33% రిజర్వేషన్లను అంశం దంపతుల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోందని భావిస్తోంది. ప్రస్తుతం చూస్తున్న లెక్కల ప్రకారం అనంతపురం జిల్లాలో కనీసం మూడు స్థానాలు లేదా నాలుగు స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. తనకు టికెట్ రాని పక్షంలో కచ్చితంగా మహిళా కోటాలో తన భార్యకు ఎక్కడో ఒకచోట ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని సాంబశివారెడ్డి లెక్కలేస్తున్నారు. మరి ఈ ఈక్వేషన్స్ ఎంతవరకు పని చేస్తాయి…ఇద్దరిలో ఒకరికి టికెట్ వస్తుందా…లేదంటే రకరకాల సమీకరణలతో మళ్లీ 2024 తరహాలోనే మొండి చెయ్యి తప్పదా అన్న ప్రశ్నకు రానున్న కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version