Site icon NTV Telugu

Off The Record : వైసీపీ పొలిటికల్ దంపతులు ప్లాన్ ప్రకారం వదిలేస్తున్నారా?

Ycp

Ycp

ఆ పొలిటికల్‌ కపుల్‌ తమ పాత బేస్‌ని ప్లాన్‌ ప్రకారం వదిలేస్తున్నారా? తమ రాజకీయ ఉనికి కోసం కొత్త అదే పార్టీలో కొత్త ప్లాట్‌ఫామ్‌ని వెదుక్కుంటున్నారా? మేడమ్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో వైసీపీ తరపున మరో నేత యాక్టివ్‌ అవడమే దీనికి సంకేతమా? ఏదా నియోజకవర్గం? ఒకచోట తగ్గిస్తూ… మరోచోట హైప్‌ ఇస్తున్న ఆ దంపతులు ఎవరు? వైసీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లోకి వచ్చారు సాంబశివారెడ్డి. అయితే… సొంత నియోజకవర్గం శింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో తాను నేరుగా పోటీ చేయడానికి కుదరలేదు. అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన భార్య జొన్నలగడ్డ పద్మావతిని పొలిటికల్ తెర మీదికి తీసుకువచ్చారాయన. ఆమెను ముందుపెట్టి తతంగమంతా వెనక నుంచి ఆయనే నడిపిస్తుంటారన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. 2014 ఎన్నికల్లో పోటీచేసిన పద్మావతి ఓడిపోయారు. అయినా… పట్టు వదలకుండా… నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ పనిచేయడంతోపాటు జగన్‌ వేవ్‌ కలిసి రావడంతో… 2019లో అసెంబ్లీ మెట్లు ఎక్కారు జొన్నలగడ్డ.

 

ఆ ఎన్నికల్లో జగన్ తర్వాత ఆ స్థాయి మెజార్టీతో గెలిచారామె. ఐదేళ్ళ అధికారంలో… ఎమ్మెల్యేగా పద్మావతి మీద చెప్పుకోతగ్గ వ్యతిరేకత రాకున్నా…. కుటుంబ పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు మాత్రం ఓ రేంజ్‌లో వచ్చాయి. ఇక అది పెరిగి పెరిగి… 2024 ఎన్నికల నాటికి తిరుగుబాటుగా మారిపోయింది. నియోజకవర్గంలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకంగా మారడంతో ఈసారి పద్మావతికి టికెట్ నిరాకరించారు వైసీపీ అధ్యక్షుడు. కానీ… సాంబశివారెడ్డి చెప్పిన వాళ్ళకేనంటూ ఇక్కడో బంపరాఫర్‌ మాత్రం ఇచ్చారు. దీంతో తనకు అనుకూలంగా ఉండే సామాన్య కుటుంబానికి చెందిన వీరాంజనేయులుకు టికెట్ ఇప్పించుకున్నారాయన. ఇది పార్టీలోచాలా మందికి నచ్చలేదు. అయినప్పటికీ జగన్ మాత్రం సాంబ వైపే మొగ్గు చూపారు. ఫైనల్‌గా ఎన్నికల్లో ఓటమి మాత్రం తప్పలేదు.

ఇక అప్పటి నుంచి నియోజకవర్గ రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే. సాంబశివారెడ్డి పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నా… ఆయన కూడా శింగనమలతో టచ్‌ మీ నాట్‌ అంటున్నారట. ఇర ఇదే సమయంలో మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి జంప్‌ అయ్యారు. ఆయన యాక్టివ్‌ అవుతూ…. మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ దూరం జరగడంపై కేడర్‌లో రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే మొదటి నుంచి సాంబ శివారెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి కూడా ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పార్టీ పదవులు దక్కాయి. కేసుల కార‌ణంగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో… ఆయన స్థానంలో ఆలూరు సాంబశివారెడ్డిని నియమించారు జగన్‌. వాస్తవంగా చెవిరెడ్డికి జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి స్థానాన్ని సాంబశివారెడ్డికి ఇచ్చారు. దాంతో పాటు పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా నియమించారు. ఆ రెండూ చాలవన్నట్టు తాజాగా మరో కీలకమైన పదవి…… స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమించారు.

 

వాస్తవంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు ఎప్పుడూ ఇన్ని పదవులు వచ్చిన నేత మరెవరూ లేరని అంటారు. 2019 నుంచి 24 మధ్య జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పదవితో సంబంధం లేకుండా… పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా సాంబశివారెడ్డికి అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం పూర్తైన వెంటనే ఏపీ విద్యా శాఖ సలహాదారు పదవి దక్కింది. వీటన్నిటినీ కలగిపి చూస్తుంటే… సాంబశివారెడ్డి దంపతులు ఇక శింగనమలకు గుడ్‌బై చెప్పేసి స్టేట్‌లెవల్‌ పాలిటిక్స్‌, పోస్ట్‌ల మీద దృష్టిపెడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version