ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్ పడిందా? తాత్కాలికంగానైనా… ఆ పుస్తకాన్ని ఫోల్డ్ చేసి పక్కపడేస్తే బెటరని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? బయటి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా అలాగే వచ్చిందా? అధికార పార్టీ ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తోంది? అంటే… రెడ్‌బుక్ టార్గెట్ పూర్తయిందా? లేక అంతకు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? టీడీపీ పెద్దలు ఎందుకు పునరాలోచనలో పడ్డారు?
రెడ్‌బుక్….. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్ని ఓ ఊపు ఊపేసిన సబ్జెక్ట్. అప్పట్లో ఆ పేరే ఒక పొలిటికల్ సంచలనం అయింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ లీడర్స్, కేడర్‌ని విపరీతంగా వేధిస్తోందని, అలా చేసిన వాళ్లందరి పేర్లు నోట్ చేసుకుంటున్నానంటూ… రెడ్‌బుక్ చూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. అందరి బాకీలు వడ్డీతో సహా తీర్చేస్తామని కూడా అప్పట్లో చెప్పారాయన. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినాసరే… రెడ్‌బుక్ పేరు మోత మోగిపోతోంది. లోకేష్ అందులో నిజంగానే పేర్లు రాసుకున్నారా? ముందు చెప్పినట్టుగానే… తాము పవర్‌లోకి వచ్చాక నాడు నోట్ చేసుకున్నవాళ్ళ పని పడుతున్నారా అన్న సంగతి పక్కనబెడితే… ఇప్పుడు టీడీపీకంటే… వైసీపీ వాళ్ళ నోటి నుంచి ఆ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రతిపక్ష నాయకుల్ని విచ్చలవిడిగా అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. వాటి డోస్ కాస్త పెరుగుతున్న క్రమంలో… కేవలం చట్టాన్ని ఉల్లంఘించిన వారికోసమే రెడ్‌బుక్ అని కూడా క్లారిటీ ఇచ్చేశారు మంత్రి లోకేష్. అయినాసరే… వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి… రెడ్‌బుక్ రాజ్యాంగం అన్న పదాన్ని వాడుతూనే ఉన్నారు. ఆ పేరుతో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడిపిస్తున్నారంటూ విస్తృత ప్రచారం చేస్తోంది ఫ్యాన్ పార్టీ. అటు టీడీపీ కూడా మొదట్లో ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్నా… మెల్లిగా ఇది ఎక్కడో తేడా కొడుతున్నట్టు గ్రహించిందట. అందుకే రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్ వేస్తేనే మంచిదని అనుకుంటున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దీని గురించి తరచూ ప్రస్తావించిన లోకేష్….ఈ మధ్య కాలంలో తన ప్రసంగాల్లో ఎక్కడా ఆ పదాన్ని వాడటంలేదు. దీంతో ఇక ఆయన దాన్ని పక్కన పెట్టినట్టు అర్ధమవుతోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
అయినదానికి, కానిదానికి ఆ పేరు వాడటం వల్ల నష్టం జరగడం మొదలైనట్టు గ్రహించిందట టీడీపీ అధిష్టానం. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో… శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నా… సరిగా చెప్పుకోలేకపోతున్నామని, అదే సమయంలో పాత తప్పులకు సంబంధించి ఎవరన్నా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేస్తే… వాళ్ళు రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే రెడ్‌బుక్‌ని కొన్నాళ్ళు క్లోజ్ చేసి ఉంచాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పదే పదే… రెడ్ బుక్ రెడ్‌బుక్ అంటే… జనంలో కూడా నెగెటివ్ ఫీలింగ్స్ పెరుగుతున్నాయన్న ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చిందట.
ఏ కారణంతో ప్రతిపక్ష నేతల అరెస్ట్ జరిగినా…. అది రెడ్‌బుక్ ప్రకారమేనన్న ఫీలింగ్ ప్రజల్లో వచ్చిందని, ఇది మరింత పెరిగితే… పార్టీకి ఇబ్బంది కావచ్చన్న హెచ్చరికలు కూడా రావడంతో…. ఇక కొన్నాళ్లు ఆ పదాన్నే పలక కూడదని పార్టీ నేతలు డిసైడైనట్టు సమాచారం. టీడీపీ వర్గాలతో పాటు కొంత మంది మంత్రులు, అధికారుల్లో కూడా దీని మీద చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ఒకటికి పది సార్లు ఆ మాట మాట్లాడ్డం వల్ల జనంలో నెగెటివ్ ఫీలింగ్ కలుగుతోందని భావిస్తున్నాయట టీడీపీ వర్గాలు. అందుకే కొన్నాళ్ళు దాన్ని పక్కన పడేసి కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే జనంలో చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్నది పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయంగా చెబుతున్నారు. కానీ… ఆ అభిప్రాయాన్ని ధైర్యంగా ఎవరూ బయటికి చెప్పలేకపోతున్నారట. అదే సమయంలో లోకేష్ కూడా… ఆ ప్రస్తావన తగ్గించేయడంతో… అంతా మన మంచికే అనుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులు, నేతల అభిప్రాయాలను గమనిస్తుంటే…. తాత్కాలికంగానైనా… రెడ్‌బుక్‌ను ఫోల్డ్‌చేసి పక్కన పెట్టారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.
