OTR : ఢిల్లీ బాట పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Congress

Congress

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో ఈసారైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందా? జిల్లా ఎమ్మెల్యేలు పలువురు ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కుతోంది అందుకేనా? ప్రస్తుతం ఎవరెవరు సీరియస్‌ ట్రయల్స్‌లో ఉన్నారు? వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి? విస్తరణలో సామాజిక సమీకరణాలు కాకుండా…. సీనియారిటీ, సిన్సియారిటీ ప్రాతిపదికన ఛాన్స్‌ ఇవ్వాలన్న వాళ్ళ విన్నపాల్ని అధిష్టానం పట్టించుకుంటుందా? ఎవరా ఎమ్మెల్యేలు? వాళ్ళ ఆవేదన ఏంటి?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పడుతున్నారు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నడుమ ఆశావహులంతా అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తమకు న్యాయం చేయాలన్నది వాళ్ళ డిమాండ్‌. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున పార్టీ సీనియర్లకు న్యాయం చేయడంతోపాటు, సిన్సియర్‌గా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీని కలిశారు. కేబినెట్‌ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యే. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున తనకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరారు రామ్మోహన్ రెడ్డి.

×
×
Ad

గతంలో రంగారెడ్డి జిల్లా తరపున ముగ్గురు నుంచి ఆరుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహించేవారంటూ గుర్తు చేశారు పరిగి శాసనసభ్యుడు. తమ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీతోనే ఉందని, తాను బూత్ స్థాయి నుంచి పని చేసినట్లు గుర్తు చేశారు రామ్మోహన్‌రెడ్డి. నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం తప్ప… తనకు వేరే టార్గెట్స్‌ ఏవీ లేవన్నది ఆయన మాట. మరోవైపు మేలో అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూడా ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారట. తాను తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన విషయాన్ని రాహుల్‌గాంధీకి వివరించారు గడ్డం ప్రసాద్‌కుమార్‌. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను మంత్రిగా పనిచేశానంటూ తన ఎక్స్‌పీరియెన్స్‌ను చెప్పారట స్పీకర్‌.

తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటానని ప్రసాద్‌కుమార్‌ రాహుల్‌గాంధీకి వివరించినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. దళిత వర్గాల నుంచి వచ్చిన తనకు స్పీకర్‌ పదవి ఇచ్చారని, అయితే, మంత్రిగా ప్రజలకు నేరుగా సేవలందించాలన్నదే తన కోరిక అని చెప్పినట్టు తెలిసింది. రాబోయే రెండేళ్ళు పార్టీకి అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో తనలాంటివారి అనుభవాన్ని పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకోవాలని, తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ రకంగా… పరిగి, వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఎవరి రేంజ్‌లో వారు సీరియస్‌గా ట్రయల్స్‌ వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చల నడుమ ఈసారైనా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా ఆన్న చర్చలైతే ఉధృతంగా జరుగుతున్నాయి.