ఆయుధాల్ని అవసరం వచ్చినప్పుడే వాడాలి….. లేదంటే అవే ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాలుగా మారుతాయన్నది యుద్ధ నీతి. రాజకీయ యుద్ధం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇప్పుడా నియోజకవర్గంలో అదే పరిస్థితి కనిపిస్తోందట. ఎమ్మెల్యే కుటుంబం పంతాలకు పోయి అసలు నాయకుడు లేకుండానే ప్రత్యర్థి పార్టీని లైమ్ లైట్‌లో ఉండేలా చేస్తున్నారు. ఏదా నియోజకవర్గం? అక్కడి పరిస్థితి వైసీపీకి అస్త్రంగా మారుతోందా? పొలిటికల్ పబ్లిసిటీ కావాలన్నా, నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఫోకస్ అవ్వాలన్నా….. అదేమంత చిన్న విషయం కాదు. ఎంత చేసినా… ఏం చేశారన్నట్టే ఉంటాయి చూపులు. ప్రత్యర్థి పార్టీలపై పోరాడుతున్నా.. బీభత్సమైన ఇష్యూస్ అయితే తప్ప… పెద్దగా జనానికి ఎక్కవు. కానీ… తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి .. గడిచిన 14 నెలలుగా రాష్ట్రంలో ఏ నేతకు లభించనంత పబ్లిసిటీ ఉత్తిపుణ్యానికే వస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అందుకు ప్రధాన కారణం… వరుసగా జరుగుతున్న ఘటనలేనని అంటున్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయాలకంటే వ్యక్తిగత పంతాలు, పట్టింపులే ఎక్కువ అని చెప్పుకుంటారు. ఆధిపత్యం కోసం రెండు కుటుంబాలు ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు జేసీ కుటుంబం హవానే నడిచింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. తాడిపత్రిలో మాత్రం జేసీ బ్రదర్సే గెలిచేవారు. ఆ కుటుంబం టీడీపీలోకి వెళ్లినా.. 2014ఎన్నికల్లో విజయం వారినే వరించింది. కానీ 2019లో మాత్రం ఫేట్ తిరగబడింది. జేసీ ప్రత్యర్థి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు. అంతకు మించి అసలా కుటుంబం కలలో కూడా ఉహించని విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్ళారు. అదీకూడా అలా వెళ్ళి ఇలా బెయిల్ మీద బయటికి రావడం కాదు. ఏకంగా 54రోజులు జైల్లోనే ఉన్నారు. వాళ్ళ పదుల కొద్దీ కేసులు పెట్టారు.
ప్రభాకర్‌రెడ్డి అనుచరులంతా ఊళ్లు విడిచి పోయే పరిస్థితి వచ్చింది. చివరకు పెద్దారెడ్డి స్వయంగా జేసీ ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇలాంటి అనేక పరిణామాలు ఇద్దరి మధ్య శతృత్వాన్ని మరింత పెంచాయి. ఇక 2024ఎన్నికల్లో జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పటి నుంచి జేసీకి గుడ్ టైం, పెద్దారెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నది రాజకీయ వర్గాల మాట. కానీ గత 14నెలలుగా జరుగుతున్న పరిణామాలు … వ్యవహారాలు సాగదీతలగా కొనసాగుతున్నాయా అన్న అభిప్రాయం బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన గొడవల క్రమంలో ఇటు జేసీ, అటు పెద్దారెడ్డి కుటుంబాలను తాడిపత్రిలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించింది కోర్ట్. ఫలితాల తర్వాత ఇరువురికి ఆంక్షలు సడలించింది. దీంతో ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు ఎమ్మెల్యే అస్మిత్ కూడా తాడిపత్రిలోనే ఉంటున్నారు. కానీ పెద్దారెడ్డికి మాత్రం టౌన్‌లోకి రాకుండా నో ఏంట్రీ బోర్డు పెట్టేశారు ప్రభాకర్‌రెడ్డి. గత 14నెలలుగా ఊళ్ళోకి రావడానికి పెద్దారెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు ఆపుతున్నారు. ఒకవేళ వచ్చినా… పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో పోలీసులు పెద్దారెడ్డి వస్తే మళ్లీ రణరంగం అవుతుందని ఆపుతున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై మళ్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈసారి పోలీసులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. దాని మీద మళ్లీ కోర్టుకు వెళ్లారు పోలీసులు. ఇక లాభం లేదనుకుని ఈసారి డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకు వెళ్లారు పెద్దారెడ్డి.
సుప్రీం కోర్టు కూడా ఒక వ్యక్తిని, అందునా ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిని నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని పోలీస్ ప్రొటెక్షన్ తో తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… వాస్తవంగా తాడిపత్రి వైసీపీలో చాలా మంది యాక్టివ్‌గా లేరు. కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడా పెద్దగా ఫోకస్ కావడం లేదు. కానీ పెద్దారెడ్డి అంశం మాత్రం ప్రతి వారం పది రోజుల్లో ఒక్కసారైనా రాష్ట్రంలో ఒక సంచనలనం అవుతోంది. ఆయన్ని తాడిపత్రిలోకి రానివ్వడం లేదనే చర్చను రాష్ట్రమంతా చర్చ జరిగేలా చేస్తోంది వైసీపీ. దీంతో ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని రాష్ట్రం మొత్తానికి ఆపాదించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో… తాడిపత్రిని చూస్తే అర్ధమవుతుందని అంటూ…చర్చ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెద్ద ఎత్తున జనంలోకి వెళ్తున్న వైసీపీ పెద్దారెడ్డి అంశాన్ని కూడా బలంగా ప్రస్తావిస్తూ ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలనుకున్నట్టు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.
