Site icon NTV Telugu

Off The Record : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పై సీఎం కు మంత్రి ఫిర్యాదు ?

Konda

Konda

తెలంగాణ సర్కార్‌లోని ఓ కీలకమైన విభాగంలో ఏం జరుగుతోందో సదరు మంత్రికి కూడా తెలియడం లేదా? ఆ డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులు మంత్రిని డోంట్‌ కేర్‌ అంటున్నారా? మేటర్‌ ముదిరి బంతి ముఖ్యమంత్రి కోర్ట్‌కు చేరిందా? స్వయంగా చీఫ్‌ సెక్రెటరీ పర్యవేక్షించాల్సిన ఆ విభాగం ఇతర అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందా? ఏ శాఖలో జరుగుతోందా తతంగం? ఎవరా మంత్రి? కాలుష్య నియంత్రణ మండలి. అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వ విభాగం. ఈ విభాగం సక్రమంగా ఉండి, బాధ్యతాయుతంగా పని చేస్తేనే… ప్రజలు ఆరోగ్యంగా ఉండ గలిగేది. అంత ప్రాముఖ్యత ఉన్న డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతోందో… సంబంధిత మంత్రి కొండా సురేఖకు అస్సలు తెలియడం లేదట. ఇంకా చెప్పాలంటే… అసలా డిపార్ట్‌మెంట్‌ తన పరిధిలోనే ఉందా లేదా అన్న అనుమానం మంత్రికి కలుగుతోందన్నది సెక్రటేరియెట్‌లో వినిపిస్తున్న గుసగుస. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి మాటంటే… పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఉన్నతాధికారులకు లెక్కే ఉండటం లేదని చెప్పుకుంటున్నారు.

మంత్రి ఆదేశాలంటే లెక్కలేనితనంతోపాటు… ఆమె ఇస్తున్న సిఫారసు లేఖల్ని సైతం చెత్త బుట్టకే పరిమితం చేస్తున్నారట ఆఫీసర్స్‌. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో… ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… సీఎస్ అనుమతితో పాటు బోర్డులో చర్చ తప్పనిసరి. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు జరుగుతాయి. కానీ…. అసలు పీసీబీలో ఏం జరుగుతోందో కూడా ఆ శాఖ మంత్రికి నివేదించే అధికారులే కరవయ్యారట. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి మంత్రి సూచనలు, సలహాలు ఇచ్చినా… ఇప్పటి వరకు ఒక్కదాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదని సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది. పీసీబీ చైర్మన్‌గా ఉన్న సీఎస్ రోజు వారీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటం కారణంగా… బోర్డు సమావేశాలకు హాజరవడం లేదని తెలుస్తోంది. బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికి మూడు సార్లు విన్నవించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోలేదని సమాచారం. వేరే కీలకమైన మీటింగ్స్‌లో సీఎస్ బిజీగా ఉంటూ పీసీబీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

దీంతో కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నీరుగారుతోందన్న చర్చ జరుగుతోంది. పీసీబీ ఫైల్స్ కూడా మంత్రికి పంపడం లేదని… సెక్రటేరియట్ లో నిర్వహించే సమీక్ష సమావేశాలకు అధికారులు మొక్కుబడిగా హాజరవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నిర్వహించే సమీక్షలకు అధికారులు కనీస సమాచారం లేకుండా వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తర్వాత ఫాలోఅప్‌ యాక్షన్‌ సంబంధించి కూడా కొండా సురేఖ కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదట. పీసీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీఎంవో రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.

 

Exit mobile version