Site icon NTV Telugu

Off The Record : ఒంగోలు మెప్మాలో కోట్ల రూపాయల కుంభకోణం, మీరంటే మీరే దొంగలంటూ రెండు వర్గాల ఆరోపణలు

Mepma

Mepma

మహిళల సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్‌ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్ళించుకున్న దోపిడీ గాళ్ళకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాల్ని పెంచుతోందా? ముఖ్య నేతలు ఇద్దరూ సీరియస్‌గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే… అసలు గోల్‌మాల్‌ గాళ్ళు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగ‌స్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవ‌హారం ఇప్పుడు స్టేట్‌ టాపిక్‌ అయ్యింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ రాష్ట్రంలో చాలా చోట్ల అక్రమాలకు కేరాఫ్‌ అయినా… ఒంగోలులో అంతకు మించి అన్నట్టుగా ఉందట వ్యవహారం. బోగస్‌ గ్రూపులతో పొదుపు మహిళల పేరుతో కోట్ల రూపాయ‌లు దోపిడీ వ్యవహారం బ‌య‌ట‌కు రావ‌టం, ఆఫీస్‌లోని ఆర్పీలు, సీవోలు, కొందరు సిబ్బంది స‌హా రాజ‌కీయ నేత‌ల ప్రమేయం బయటికి రావడం కలకలం రేపుతోంది. విచారణ మొదలై మేటర్‌ టీడీపీ కేంద్ర కార్యాల‌యం దాకా చేరడంతో… స్థానిక నాయకుల్లో వ‌ణుకు మొద‌లైంద‌ని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో మెప్మా స్వయం సహాయక సంఘాల గ్రూపులు ఉన్నాయి. అయితే… ఒక్క ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోనే.. 200కు పైగా బోగస్‌ గ్రూపులు ఉన్నట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక్కో గ్రూపునకు 10 నుంచి 20ల‌క్షల చొప్పున దాదాపు 20 కోట్ల లోన్స్‌ తీసుకున్నారట. 2025 ఆగస్టుకు ముందు వరకు గ్రూపులు మాన్యువల్‌గా ఉండేవి. ఆగస్టులో మొత్తం ఆన్‌లైన్‌ అయింది. అయితే… ఆగస్టుకు ముందే బోగస్‌ గ్రూపుల ద్వారా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలిసింది. వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను ఆసరా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్దన్‌కు స‌న్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఈ వ్యవహారాలు నడిపించాలన్న ఆరోపణలున్నాయి. దాంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే… మేటర్‌ని సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ జరిపించమని అధికారుల్ని ఆదేశించారు. అయితే… అందులో ఒక ట్విస్ట్‌ ఇప్పుడు రచ్చకు కారణం అవుతోంది. విచారణను 2022 నుంచి మొద‌లు పెట్టాల‌ని చెప్పడంపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ‌ర్గం అభ్యంత‌రం చెబుతోంది. అవినీతి జ‌రిగింది ఇప్పుడైతే….. విచార‌ణ 2022 నుంచి ఎందుకన్నది వాళ్ళ క్వశ్చన్‌. అదంతా వ్యవహారాన్ని డైవర్ట్‌ చేసేందుకేనన్నది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడే వ్యవహారం మొత్తం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. బోగస్ గ్రూప్స్‌ పేరుతో తీసుకున్న లోన్స్‌ ఎక్కువగా పీడీసీసీ బ్యాంక్ నుంచే ఉన్నాయి. కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ అయితే… రాజకీయంగా ప్రభావితం చేయవచ్చన్న ఉద్దేశ్యంతోనే ఆ రూట్‌ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే దామచర్ల సన్నిహితుడే అటు ఆర్పీల నుంచి ఇటు బ్యాంక్‌ అధికారులు వ‌ర‌కూ అంద‌రినీ మ్యానేజ్ చేసి లోన్లు తీసుకుని త‌న ఖాతాల‌కు మ‌ళ్లించుకున్నార‌న్నది ప్రధాన ఆరోపణ.అయితే విచార‌ణను 2022 నుంచి మొద‌లు పెట్టమనడం ద్వారా… రాజకీయంగా…. జ‌న‌సేన‌లో ఉన్న మాజీమంత్రి బాలినేనికి కూడా ఈ వ్యవ‌హారాన్ని చుట్టే ప్రయ‌త్నం చేస్తున్నారంటూ ఫైరవుతోంది ఆ వర్గం. దీనికి సంబంధించిన రచ్చ పెరగడంతో… అవినీతిపై దృష్టి సారించిన జిల్లా క‌లెక్టర్ రాజాబాబు…. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ చైర్మన్‌గా విచారణ కమిటీని నియమించారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మ‌రోవైపు మెప్మా మిషన్‌ డైరెక్టర్ బి.సునీల్‌కుమార్‌రెడ్డి కూడా ఒంగోలు బాగోతంపై రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారులతో మరో కమిటీని నియమించారు. వీటి సంగతి అలా ఉంచితే… అవినీతికి మీరు కార‌ణమంటే మీరేనంటూ దామ‌చ‌ర్ల, బాలినేని వర్గాలు దుమ్మెత్తి పోసుకోవడం మొదలైపోయింది. సీరియస్‌గా దర్యాప్తు చేసి దోషుల్ని అరెస్ట్‌ చేయమని ఇద్దరు నేతలు సీరియస్‌గా కోరడంతో… అసలు దొంగలు ఎవరన్న చర్చ మొదలైంది. 2022 నుంచి విచార‌ణ జరిపితే… అప్పుడు ఇదే త‌ర‌హాలో జ‌రిగిన భారీ అవినీతి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఎమ్మెల్యే వర్గం మాట్లాడ్డంపై బాలినేని తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారట. వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్ళి నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించమని బాలినేని కోరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ వ్యవ‌హారం టీడీపీ సెంట్రల్ ఆఫీస్ వ‌ర‌కూ వెళ్లింద‌ట‌.ముఖ్యంగా మ‌హిళ‌లకు సంబంధించిన స్కీమ్‌ కావడంతో… పార్టీకి కూడా డ్యామేజ్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నందున విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అటు ఈ వ్యవ‌హారంలో కీలకంగా వ్యవ‌హ‌రించిన ఓ ప్రధాన అధికారి కూడా తాను ఆ శాఖ మంత్రి తాలూకా అంటూ…. విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పవ‌ద్దని మ‌హిళ‌ల‌ను బెదిరిస్తున్నట్లు స‌మాచారం. ఆ సంగతి ఎలాఉన్నా…. ఒంగోలులో ఏం జ‌రిగినా బాలినేని వ‌ర్సెస్ దామ‌చ‌ర్లలా మారిపోవ‌డంపై కూటమి కేడర్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మెప్మాలో అస‌లు దొంగ‌లు ఎవ‌రు?ఈ మొత్తం ఎపిసోడ్‌లో కింగ్ పిన్ ఎవ‌రు? దర్యాప్తులో అస‌లు నిందితులు బ‌య‌ట‌కు వ‌స్తారా.. లేక మ‌సిపూసి మారేడు కాయ చేస్తారా? ఎమ్మెల్యే, మాజీ మంత్రి సంబంధాలు ఏ టర్న్‌ తీసుకోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version