బంధువులదేముంది రుతువుల్లాంటి వారు….. వస్తారు, పోతారు.. కానీ… వారసులు మాత్రం చెట్లలాంటి వారు. వస్తే పాతుకుపోతారన్న సినిమా డైలాగ్‌ని గుర్తుకు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లాలో. అక్కడ రాజకీయ వారసులు చేస్తున్న హంగామా అలా ఉందట. ప్రతి ప్రధాన పార్టీ తరపున పొలిటికల్ తెరంగేట్రం చేయడానికి వారసులంతా మూకుమ్మడిగా ఉవ్విళ్ళూరుతున్న ఆ ఉమ్మడి జిల్లా ఏది? అక్కడ ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్ని తమ వారసులకు అప్రంటీస్‌లా వాడుకోవాలని అన్ని పార్టీల సీనియర్స్ భావిస్తుండటంతో… పోటీ బాగా పెరిగిపోతున్నట్టు సమచారం. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో రెండు జడ్పీ ఛైర్మన్ స్ధానాలు ఉండగా, నిజామాబాద్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక కామారెడ్డి జడ్పీ జనరల్ కోటాలో ఉంది. ఇది కలిసి రావడంతో…. పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నట్టు సమాచారం. గతంలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలు, ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న వారి వారసులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాని నేతలు ఇప్పుడు తమ కొడుకులు, కోడళ్ళు జీవిత భాగస్వామిని రంగంలోకి దింపాలని తెగ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ మహిళ కోటాలో ఉన్న నిజామాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కోసం కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఒక్క ఛాన్స్ అంటున్నారట. అలాగే… బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ తన భార్య సుహాసినిని పోటీలో దింపాలనుకుంటున్నారట. అటు బీఆర్ఎస్ నుంచి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కోడలి విపంచిని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్… తన భార్య దివ్య పోటీలో ఉంటారనే సంకేతాలు ఇస్తున్నారు. పార్టీలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోందట.
ఇలా మూడు ప్రధాన పార్టీల నుంచి కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానాల మీద వత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. జిల్లాలో 31 జడ్పీ స్థానాలు ఉండగా… కోటగిరి, మాక్లూర్, మెండోరా, మోర్తాడ్, మోస్రా, ఎర్గట్ల బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. దాంతో ఈ సీట్లకే డిమాండ్ పెరిగిపోయింది. ఇక కామారెడ్డి జిల్లాలోనూ వారసుల పోటీకి పోటీ ఎక్కువగానే ఉంది. ఇది జనరల్ కావడంతో…దీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు కన్నేశారట. కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తన భార్య మంజులారెడ్డిని ఛైర్మన్ అభ్యర్ధిగా రెడీ చేస్తున్నట్టు సమాచారం. పోటీగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి…తన కుమారుడు భాస్కర్ రెడ్డిని బరిలో దింపాలని అనుకుంటున్నారట. బీర్కూర్ జడ్పీటీసీగా పోటీ చేయించి.. ఛైర్మన్ సీట్లో… కూర్చోబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట పోచారం. బీఆర్ఎస్ తరపున కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ కుమారుడు శశాంక్ పేరు తెరపైకి వస్తోంది. ఆయన కూడా… కొద్ది రోజుల నుంచి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో 25 జడ్పీ సీట్లు ఉండగా.. బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్, తాడ్వాయి జడ్పీటీసీలు జనరల్‌లో ఉన్నాయి. ఈ మండలాల నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన వాళ్ళే ఛైర్మన్ రేసులో ఉంటారు. బీజేపీ అభ్యర్ధుల కోసం ఇంకా గాలింపు ప్రోగ్రామ్ నడుస్తూనే ఉందట. మొత్తం మీద ఇలా…. నేతల వారసులు పోటీకి సై అంటే సై అంటున్నా…. అందరిదీ ఒక్కటే డౌట్. రేపు కోర్ట్ తీర్పు ఎలా ఉంటుందోనని. ఆ ఒక్కటీ క్లారిటీ వచ్చేస్తే… ఇక దుమ్ము దులపడానికి రాజకీయ వారసులు రెడీగా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో.
