OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ

Nallimerla

Nallimerla

అక్కడ కూటమి పొత్తు ధర్మం బీటలు వారుతోందా? టీడీపీ, జనసేన మధ్య కోల్డ్‌వార్‌ గట్టిగా జరుగుతోందా? జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటోందా? తేడా వస్తే నేను ఇండిపెండెంట్‌ని అవుతానంటూ తెలుగుదేశం నేత హెచ్చరిస్తోంది ఎక్కడ? అందుకు జనసేన రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమిలో స్థానిక ఎన్నికల చిచ్చు రగులుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి గట్టిగా పనిచేసిన జనసేన, టీడీపీ నేతల మధ్య ఇప్పుడు పదవుల పంచాయతీ మొదలైందట. నెల్లిమర్ల నగర పంచాయతీలో..మొత్తం 23 వార్డులు ఉన్నాయి. రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. అందుకే దీని మీద టీడీపీ, జనసేన రెండూ దృష్టి పెట్టాయి. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి జనసేనకు చెందిన నాయకురాలు. అందుకే.. నగర పంచాయతీ ఛైర్మన్‌ పోస్ట్‌ తమకే కావాలన్నది గ్లాస్‌ నేతల మాట. అదే ఊపులో… చైర్మన్ రేసులో ఉన్నారంటూ ఆ పార్టీ లీడర్స్‌ పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోందంటున్నారు. టీడీపీ నెల్లిమర్ల అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. కానీ… ఎమ్మెల్యే మాత్రం తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికే చైర్మన్ పదవి ఇప్పించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ బలం కంటే వ్యక్తిగత సమీకరణలకే ప్రాధాన్యత ఇస్తున్నారట ఆమె. రాజకీయాల్లో పదవి చిన్నదైనా.. దాని చుట్టూ ఉండే లెక్కలు మాత్రం పెద్దవే. చైర్మన్ అంటే కేవలం ఒక పదవి కాదు. నగర పంచాయతీలో రాజకీయ ఆధిపత్యానికి కేంద్ర బిందువు. అందుకే ఆశావహులంతా చైర్మన్ పీఠం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది. తమ ఎమ్మెల్యే బలంతో చైర్మన్ పదవిని సాధించాలని జనసేన భావిస్తుండగా… టీడీపీ మాత్రం నగర పంచాయతీలో తమకున్న రాజకీయ బలాన్ని చూపించాలనుకుంటోందట. ఇదే అసలు కోల్డ్‌వార్‌కు కారణమవుతోందని అంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవేళ చైర్మన్ పదవి జనసేనకు ఖరారైతే.. అప్పలనాయుడు టీడీపీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోరన్న టాక్ నడుస్తోంది.

అనుచరులతో కలిసి ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకల్‌ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. అదే జరిగితే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా కూటమిలోని మరో పార్టీకి చెందిన నేతే పోటీలో ఉంటారు. అంత సీన్‌ వస్తే.. స్థానిక రాజకీయ సమీకరణలు కూడా ఒక్కసారిగా మారిపోతాయి. ఇప్పటివరకు కలిసి నడిచిన నేతలు.. పదవి దగ్గరికి వచ్చేసరికి విడిపోతే.. అది కేవలం చైర్మన్ ఎన్నికకే పరిమితం అవుతుందా? లేక భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందా.. అన్నదే ఇప్పుడు చర్చ. నెల్లిమర్లలో రాజకీయ సమీకరణాలు బయటకు కనిపిస్తున్న దానికంటే భిన్నంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కూటమి మొత్తం ఒకటే అయినా.. స్థానికంగా నాయకుల లెక్కలు మాత్రం వేర్వేరుగా ఉండొచ్చంటున్నారు. పదవుల విషయంలో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటే…. కూటమి ధర్మానికి పరీక్ష తప్పదు. ఎమ్మెల్యే బలంతో ఛైర్మన్‌ పదవి కోసం జనసేన ముందడుగు వేస్తే..టీడీపీ వెనక్కి తగ్గుతుందా.. లేక తన ప్రాబల్యాన్ని చాటేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. లెంక అప్పలనాయుడు నిజంగానే ఇండిపెండెంట్ బాట పడతారా.. లేక చివరి నిమిషంలో ఏదైనా రాజీ ఫార్ములా బయటకు వస్తుందా.. అన్ సందేహాలు సైతం ఉన్నాయి. నెల్లిమర్లలో జరుగుతున్న సీన్‌ మిగతా చోట్లకు కూడా విస్తరిస్తే కూటమి పొత్తు ధర్మం ఏమవుతుంది? పార్టీల అధిష్టానాలు ఎలా రియాక్ట్‌ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది చైర్మన్ కుర్చీ కోసం సాగుతున్న సాధారణ రాజకీయ పంచాయతీనా.. లేక కూటమిలో ఆధిపత్య పోరా అన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. చైర్మన్ పీఠం చుట్టూ నెల్లిమర్లలో మొదలైన ఈ రాజకీయ వేడి.. రాబోయే రోజుల్లో కూటమి బంధాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నదే బిగ్‌ క్వశ్చన్‌. కుర్చీ కోసం కుస్తీ.. కూటమిలో కోల్డ్‌వార్..తెర వెనుక ఎత్తులు.. పైఎత్తులు.. ఇదే ఇప్పుడు నెల్లిమర్ల రాజకీయ ముఖచిత్రం.