ఒకరు మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరిదీ తెలుగుదేశం పార్టీనే. కానీ… ఆధిపత్య పోరులో ఆరితేరిపోయారు. ఇన్నాళ్లు సాగిన కోల్డ్ వార్ కాస్తా… ఇప్పుడు ఓపెనైపోయి రోడ్డెక్కే దాకా వచ్చింది. మేటర్ ముఖ్యమంత్రి కోర్ట్‌కు కూడా చేరిందట. ఎవరా ఇద్దరు నాయకులు? ఉన్నట్టుండి రోడ్డెక్కాల్సిన అవసరం ఏం వచ్చింది? ఫిర్యాదుల పెట్టె సంగతేంటి? తెలుగుదేశం పార్టీలో 365డేస్ కేరాఫ్ కాంట్రవర్శీ నంద్యాల. పార్టీ అధికారంలో ఉన్నా…. లేకున్నా, ఎన్నికలు జరిగినా… జరగకున్నా, పోలింగ్‌కు ముందైనా…ఆ తర్వాతైనా, ఎప్పుడూ ఏదో ఒక రచ్చ అవుతూనే ఉంటుంది ఇక్కడ. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా నాలుగు గ్రూపులు ఉండటంతో… జిల్లా టీడీపీలో తన్నులాటలు సర్వ సాధారణమైపోయాయి. ఇక్కడ పార్టీలో ఐక్యత అన్న మాట వినిపించి దశాబ్దాలు గడిచిపోయాయి. టీడీపీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మంత్రి ఫరూక్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి, మాజీ ఆర్టీసీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి… ఇలా నలుగురు నాలుగు గ్రూపులుగా విడిపోయారు. నంద్యాల నాదని ఒకరంటే…ఇది నా అడ్డా అని మరొకరంటారు. టికెట్ నాకేనని ఒకరు ప్రచారం చేసుకుంటే.., అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడింది నేను… నాకే కావాలని మరొకరంటారు. ఇది మా నియోజకవర్గం, మీకేం పని అని ఒకరంటే..నాకు రాష్ట్రస్థాయి పదవి ఉంది, నేను ఎక్కడైనా తిరుగుతానని కౌంటర్ ఇస్తారు ఇంకొకరు. ఇలా ఎవరికి వాకే తగ్గేదే అన్నట్టు మాట్లాడుతూ…వేడి కాస్త చల్లారుతోందని అనుకున్నప్పుడల్లా.. కాస్త పెట్రోల్ చల్లుతుంటారు. ఇక చిన్న చితకా గొడవల గురించి మాట్లాడే పనేలేదు.
ఈ పరిస్థితుల్లో… తాజాగా మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మధ్య కొత్త వివాదం మొదలైంది. ఆటోనగర్ ప్లాట్ల పంచాయితీ హాట్ టాపిక్ అయింది. నంద్యాల ఆటోనగర్‌లో ప్లాట్ల కేటాయింపు అక్రమాలు జరిగాయంటూ… ముందు జిల్లా కలెక్టర్‌కు, ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు బ్రహ్మానందరెడ్డి. అందుకు మంత్రి ఫరూక్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడంతో… కాక పెరిగింది. అసలు ఆటోనగర్ కోసం భూములు ఇచ్చినప్పుడు నువ్వు రాజకీయాల్లో లేవంటూ… మాజీ ఎమ్మెల్యేకి చురకలేశారు మంత్రి. నంద్యాలలోని 950 మంది ఆటోమొబైల్ రంగ కార్మికుల కోసం 1995లో ప్లాట్లు కేటాయించారు. అప్పటి ఎంపీ భూమా నాగిరెడ్డి, మంత్రి ఫరూక్ సారధ్యంలో షాపులు, షెడ్స్ నిర్మాణం కోసం ఉడుమాలపురం దగ్గర భూమి ఇచ్చారు. తర్వాత సీఎం చంద్రబాబు పేరుతో ఆటోనగర్ ఏర్పడింది. అయితే…. భూ కేటాయింపు సక్రమంగా జరగలేదంటూ వివాదాలు తలెత్తాయి. కొందరు కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు స్థలాలను అక్రమించారన్న ఆరోపణలున్నాయి. 2017 ఉప ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించి, ఎన్నికల తర్వాత నిలిపివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు, లీడర్లు ఈ స్థలాలుకొని , మళ్ళీ అగ్రిమెంట్స్‌పై అమ్ముకున్నారు. ఇప్పుడిక ఆటోనగర్ కమిటీ , గత కమిటీ ప్రతినిధులు రెండుగా చీలిపోయి ఫరూక్ , భూమా వర్గాల్లో కొనసాగుతున్నారట. ఈ పరిస్థితుల్లో…నంద్యాల ఆటోనగర్ స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే భూమా.
నిబంధనలు ఉల్లంఘించి అనర్హులకు ప్లాట్లు కట్టబెట్టారన్నది బ్రహ్మానందరెడ్డి అభ్యంతరం. దీని మాటున దాదాపు వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారాయన. ఇక ఇదే ఊపులో… బ్రహ్మానందరెడ్డి.. సీఎం చంద్రబాబును కలిసి ఆటోనగర్ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడం పొలిటికల్ హీట్ పెంచింది. మరోవైపు కలెక్టర్ రాజకుమారి స్పందించి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసి క్లారిటీతో రావాలని అధికారులను ఆదేశించారు. అయితే… లోకల్‌గా వ్యవహారాలు ఎలా ఉన్నా…. భూమా వెళ్లి నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడం మంత్రి ఫరూక్‌కు ఆగ్రహం తెప్పించిందట. ఆటోనగర్ విషయంలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారాయన. ఓవైపు వంద కోట్ల కుంభకోణమని బ్రహ్మానందరెడ్డి ఆరోపిస్తుంటే…. మరోవైపు ఆటోనగర్ అభివృద్ధికి 10 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెబుతున్నారు మంత్రి. ఈ పరిస్థితుల్లో… అభివృద్ధి మాటలు నెగ్గుతాయా? లేక అవినీతి ఆరోపణలదే పైచేయి అవుతుందా అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు నంద్యాల జనం.
