Site icon NTV Telugu

Off The Record : అత్త కోడళ్ళ మధ్య అండర్‎స్టాండింగ్ పాలిటిక్స్..?

Dk Aruna

Dk Aruna

అత్తాకోడళ్ళ మధ్య అండర్‌స్టాండింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయన్న ఆరోపణల్లో నిజమెంత? అక్కడ గ్రామాల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ పట్టణానికి వచ్చేసరికి ఎందుకు చతికిలపడిపోయింది? లోపం ఎక్కడ జరిగింది? తేడా ఎక్కడ కొట్టింది? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఎవరు త్యాగాలు చేశారు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కథ, కమామీషు? భిన్న సాంప్రదాయాలకు నెలవైన నారాయణపేట నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపించారు. కానీ…లోక్‌సభ ఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు లీడ్ ఇచ్చి గెలుపులో కీలకమయ్యారు. ఇక గల్లీపోరైన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను ఎక్కువ సంఖ్యలో గెలిపించి మున్సిపల్‌కు వచ్చేసరికి కమలం గుర్తుకే జై కొట్టారు. సీఎం సొంత ఇలాఖా అయిన నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ గెలిచింది.

నిజాం కాలంలోనే ఏర్పడిన నారాయణ పేట బల్దియాలో జనసంఘ్ టైం నుంచే బీజేపీ బలంగా ఉంది. అయినాసరే….ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమలదళం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అభ్యర్దుల ఎంపిక మొదలు , ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ఎంపీ డీకే అరుణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సింపుల్‌గా ఉగ్గాని బజ్జీతో ఎన్నికలు జరిగిపోయే నారాయణలో ఈ సారి వామ్మో… ఇంత కాస్లీ ఎన్నికల్ని మేమెప్పుడూ చూడలేదన్నట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే…. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని ఎన్నికల ముందు చేరిన మాజీ వైస్ చైర్మన్ హరినారాయణ భార్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం లాంటివి కాంగ్రెస్‌కు మైనస్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే ఇంటింటి ప్రచారం కాకుండా కార్నర్ మీటింగ్స్‌కే పరిమితం అవడం, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం లాంటివి మున్సిపాలిటీ అధికార పార్టీ చేజారడానికి కారణమయ్యాయన్నది పరిశీలకుల మాట.

మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పర్ణికరెడ్డి బీజేపీ ఎంపీ డీకే అరుణకు స్వయానా మేన కోడలు. అందుకే…అసెంబ్లీ ఎన్నికల వేళ పర్ణికా రెడ్డి గెలుపునకు డికే అరుణ ఇంటర్నల్ గా సహకరించారన్న గుసగుసలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ క్రమంలోనే… ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడుకు ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ బిజెపి నుంచి బరిలో నిలిచి 4500 ఓట్ల మెజార్టితో గెలుపొందారు డికే అరుణ. ఒక్క నారాయణపేట పట్టణంలోనే 4వేల300 పై చిలుకు ఓట్ల లీడ్ డీకే అరుణకు రావడంతో… మేనత్త కళ్ళలో ఆనందం కోసం పర్ణికారెడ్డి పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో మంచి ఫలితాలే సాధించిన కాంగ్రెస్‌… పట్టణానికి వచ్చేసరికి చతికిలపడటం వెనకున్న సీక్రెట్‌ ఏంటని ఆరా తీస్తున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. సీఎం ఇలాఖాలో మున్సిపాలిటీ చేజారడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులు… వార్డుల్లో ఎందుకు గెలవలేక పోయాం, ఆర్దిక వనరుల వినియోగం ఎంత మేర జరిగింది , ఫలితాల తరువాత మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేందుకు వ్యూహాత్మకంగా ఎందుకు ఆపరేట్ చేయలేకపోయాం లాంటి అంశాలపై పోస్ట్‌మార్టం చేస్తున్నారట. మొత్తం మీద నారాయణ పేట మున్సిపాలిటీలో అండర్ స్టాండింగ్ పాలిటిక్స్‌తో ఎవరికి మేలు జరిగిందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.

Exit mobile version