ఆ ఎమ్మెల్యే కావాలని అన్నారా? లేక కాకతాళీయంగా అన్నారా? అదీఇదీ కాకుండా… విపరీతమైన ఫ్రస్ట్రేషన్ విచక్షణ మర్చిపోయారా? ఓటేసినంత మాత్రాన ఇంటికొచ్చి కడగమంటారా అని జనాన్ని తిట్టేంతలా ఎందుకు దిగజారిపోయారాయన? క్లౌడ్ బస్ట్ టైంలో ఆయనెందుకు బరస్ట్ అయ్యారు? ఎవరా శాసనసభ్యుడు? ఏంటాయన ఫ్రస్ట్రేషన్ కహానీ? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రజల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా అవి తెలంగాణ బీజేపీని కూడా షేక్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న టైంలో.. వరద, బురదతో నానా తిప్పలు పడుతున్న జనం సాయం అడిగితే ఎమ్మెల్యే విచక్ష లేకుండా అంతలేసి మాటలు అంటారా అంటూ చర్చ జరుగుతోంది. రేపు స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం కనీసం కామారెడ్డి నియోజకవర్గంలోనైనాసరే… పార్టీ మీద పడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. వరదల్లో సర్వస్వం కోల్పోయి.. ప్రజలు కష్టాల్లో ఉంటే.. ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్ర వివాదస్పద వాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని, మీ బాత్రూంకొచ్చి కడగమంటారా అంటూ ఆయన తీవ్ర అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు ఇటు లోకల్ కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకులు సైతం ఎమ్మెల్యే వాఖ్యలను తప్పు పడుతున్నారు. కాటిపల్లి.. కామారెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే.. ఎమ్మెల్యేగా చేతనైతే సాయం చేయాలిగానీ… బాధలో ఉన్నావాళ్ళని చులకన చేసి ఎలా మాట్లాడుతారంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఇటు వరద బాధితులు సైతం ఎమ్మెల్యే వాఖ్యలపై షాకయ్యారట. ఎన్నికల్లో నెత్తిన పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళని కాదని ఈయన్ని గెలిపిస్తే… ఇప్పుడిలా మేం బాధలో ఉంటే విచక్షణ లేకుండా మాట్లాడతారా అంటూ ఫైరైపోతున్నారట. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే…..
సాధారణంగా… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు కామారెడ్డి ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంతవరకు బాగానే ఉన్నా… తాజాగా కామారెడ్డిని కుదిపేసిన వరదల విషయమై ఆయన ఆఫ్ ద రికార్డ్‌లో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలే కలకలం రేపుతున్నాయి. నిన్నటిదాకా ఏ సోషల్ మీడియా అయితే ఆయన్ని హీరోలా ప్రొజెక్ట్ చేసిందో… ఇప్పుడు అదే సోషల్ మీడియా… రమణారెడ్డిన ఎత్తి వరద బురదలోవేసేసింది. సర్వం కోల్పోయిన బాధితులు కడుపు కాలుతూ సాయం కోసం ఎదురు చూస్తుంటే… వాళ్ళ ఆక్రందనలు ఈయనగారికి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయా అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు కామారెడ్డి గ్రూప్స్‌లో. నేను వరద బాధిత ప్రాంతాలన్నిటిలో పర్యటించానుగానీ… ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంటున్నా… దాన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. అసలు వరదలు రావడానికి కారణం జనమేనని, ఆక్రమణల వల్లే పరిస్థితి ఇంతలా దిగజారిందని అంటున్న క్రమంలోనే వివాదాస్పదంగా మాట్లాడారాయన. మీరు ఓటు వేసినందుకు నేనొచ్చి … కడగాలంటే కుదరదనమే వివాదానికి మూల కారణం. ఆయన ఉద్దేశ్యం ఏదైనా… చెప్పాలనుకున్నదేమైనా… చెప్పిన విధానం మాత్రం దారుణంగా ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో. ప్రజల్ని తప్పు బట్టేలా ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. వరద బాధితులపై ఎమ్మెల్యే అనుచిత వాఖ్యలు.. పార్టీకి తలనొప్పిగా మారాయంటున్నారు. ఆ వివాదాస్పద వాఖ్యలపై సదరు ఎమ్మెల్యే మళ్లీ స్పందిస్తారా… లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
