Site icon NTV Telugu

Off The Record : ఆ నియోజకవర్గంలో దానం నాగేందర్ కు ఎదురు గాలి విస్తుందా?

Danam

Danam

అంతన్నాడింతన్నాడు…… ఆఖరికి వస్తే… అందరిలో ఒకడయ్యాడు. పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ప్లేట్‌ ఫిరాయించారా? ఆయన మాటల మార్పు వెనకున్న మర్మం ఏంటి? బస్తీమే సవాల్‌, బైపోల్‌కు రెడీ అంటూ గతంలో తొడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పిల్లిమొగ్గలేస్తున్నారన్నది నిజమేనా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటా ఫిరాయింపి కథ? పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి పొలిటికల్‌గా చర్చనీయాంశమవుతోంది. నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ గతంలో మీడియా ముందే ప్రకటించేశారాయన. నాకేం భయం, ఉన్నది ఉన్నట్టు చెప్తానంటూ భారీ స్టేట్మెంట్స్‌ కూడా ఇచ్చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అంటూ జరిగితే….కచ్చితంగా గెలిచి తీరుతానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. అనర్హత వేటు పడటం కంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు పోవడమే బెటర్ అన్న ఆలోచన కూడా చేశారు ఎమ్మెల్యే.

అప్పుడు అన్ని మాటలు మాట్లాడి, ఇన్ని రకాల ఆలోచనలు చేసిన దానం…. తీరా తాను ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం నేను పార్టీ మారలేదు, వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్‌కు వెళ్ళానని చెప్పారు. అనర్హత పిటిషన్స్‌ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలంతా విచారణలో దాదాపుగా ఇదే వాదన వినిపించారు. మేమేం పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటూ… ఎవరికి సంబంధించిన ఆధారాలను వాళ్ళు స్పీకర్‌ ముందు పెట్టారు. వాళ్ళందరిదీ ఒక ఎత్తయితే… దానంది మరో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. స్పీకర్ నోటీసులు ఇచ్చేంతవరకు దానం నాగేందర్ కామెంట్స్‌ ఒక తీరుగా ఉంటే… నోటీసులు అందుకున్నాక ఆయన కూడా… అందరిలో ఒకరిగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానం నాగేందర్‌ తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు అన్న మాటల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో ఏం రాశారో మా అడ్వకేట్‌కే తెలుసునంటూ… నాకేం తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. విచారణ కోసం స్పీకర్‌ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నాగేందర్ ఇలా కామెంట్స్‌ కాస్త గందరగోళాన్ని పెంచింది.

దీనికి సంబంధించి వాదనలు మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించిన స్పీకర్‌ ఫిర్యాదుదారులకు కూడా షెడ్యూల్ పంపించారు. ఇదే సందర్బంలో… వ్యక్తిగతంగా హాజరవ్వాలని తనకేం నోటీసులు ఇవ్వలేదంటూ దానం చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటో అంతు చిక్కటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. ఎమ్మెల్యే ఒక్కోసారి ఒక్కో రకమైన స్టేట్మెంట్‌ ఇవ్వడం చూస్తుంటే… అనర్హత వేటు నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే చర్చ కూడా జరుగుతోంది. రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తానని మొదట్లో చెప్పుకొచ్చిన దానం…. ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లను ఇవ్వడం వెనకున్న కారణాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది.

 

నియోజకవర్గంలో దానం నాగేందర్‌కు ఎదురుగాలి వీస్తోందా? ఉప ఎన్నిక జరిగితే ఇబ్బంది తప్పదని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి కొందరిలో. ఈ పరిస్థితుల్లో…. శుక్రవారం స్పీకర్ పేషీలో జరిగే విచారణకి దానం నాగేందర్ హాజరవుతారా..? లేదంటే ఆయన తరపున అడ్వకేట్ అటెండ్‌ అవుతారా..? ఫిర్యాదుదారుల నుంచి వచ్చే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ… లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎపిసోడ్‌ని ఆయన ఎలా కవర్‌ చేసుకుంటారన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.

Exit mobile version