పాలకొల్లు నియోజకవర్గం..ఈ అసెంబ్లీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో కీలక పదవిలో కొనసాగుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. తిరుగులేని నాయకుడిగా పేరున్న ఆ మంత్రి నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి రాగం తీస్తున్నారట. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నేతలను కాదని పక్కవారికి పాలకొల్లు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని కేటాయించే ప్రయత్నాలపై భగ్గుమంటున్నారట నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కర్నేని రోజా రమణి ఇప్పుడు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్నారట. ఇందుకు మొదట్లో మంత్రి నుంచి హామీ దక్కినప్పటికీ చివరి నిమిషంలో కుదరదు అని తేల్చారట. తమని కాదని వేరే వారికి సీటు కేటాయిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఎన్నికల నామినేషన్ వేశారు. మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ తమ గళాన్ని గట్టిగానే వినిపించారట. పార్టీకి పనిచేయని వారిని తీసుకొచ్చి, పదవులు ఇచ్చి మమ్మల్ని ఏడిపిస్తున్నారంటూ మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆవేదనతో తిరిగి వెళ్లిపోయారు. రెబల్స్ గానూ బరిలోకి దిగడం హాట్ టాపికయ్యింది.
చైర్మన్ పదవి కేటాయించకపోవడానికి మంత్రి నిమ్మల చెప్పే కారణాలు మరోరకంగా ఉన్నాయట. పార్టీ అభివృద్ధికి కష్టపడినా….కీలక సమయాల్లో పార్టీ మాట వినలేదంటున్నారట. కొన్ని సందర్భాల్లో పార్టీపై వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏమాత్రం సహించలేది తెగేసి చెప్పారట. సోషల్ మీడియాలో ఏకంగా తనపై దుష్ప్రచారం చేయించారని కూడా అసహనం వ్యక్తం చేశారట నిమ్మల. చైర్ పర్సన్ పీఠం ఇస్తే…పార్టీ పరువును బజారుకీడుస్తారని అన్నారట. ఈ పరిస్థితుల్లో మీకు సీటు ఇవ్వలేకపోతున్నాం…..స్టేట్ పదవుల్లో ఏదో ఒకటి ఇస్తామని అన్నారట. దీంతో రోజా రమణి వర్గం రగిలిపోతోంది. చైర్ పర్సన్ ఎన్నికల్లో రెబెల్గానైనా బరిలోకి దిగుతామని తెగేసి చెప్పడంతో రామానాయుడు వర్గం రగిలిపోతోందట. మంత్రిగా వుండి కూడా తన మాట చెల్లుబాటు కావడంలేదని అసహనంగా వున్నారట. మరి చైర్పర్సన్ ఎన్నిక సమయంలో ఏం జరుగుతుందో….రెబెల్స్ ను ఎలా బుజ్జగిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

