ఆ జిల్లాలో బీజేపీకి బడా నేతలున్నా….మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కరవయ్యారా..? రా… రమ్మని పిలుస్తున్నా ఎవ్వరూ అటువైపు చూడ్డం లేదా? అందుకే పక్క పార్టీల్లో అసంతృప్తులవైపు చూస్తున్నారా? ఎక్కడ జరుగుతోందలా? కాషాయ పార్టీకి ఎందుకా కష్టం వచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి ఒక ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు రఘునందన్ రావు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో పార్టీ బలపడుతుందని అంతా అనుకున్నారు. కానీ…. ఇప్పుడు బలం సంగతి తర్వాత….అసలు ఉనికి ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట చాలామందికి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది నామమాత్రపు ఫలితాలే. ఆ సమయంలో నాయకత్వ తీరుపై కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తమను ఎవరూ పట్టించుకోలేదని, ఎలాంటి సహకారం అందించలేదనేది కోపంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలో మరోసారి నాయకత్వ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా…ఇందులో మెజార్టీ మున్సిపాలిటీల్లో కమలం పార్టీకి అభ్యర్థులు కరవైనట్టు చెప్పుకుంటున్నారు.
ఆయా టౌన్స్‌లో పార్టీని పట్టించుకునే లీడర్స్ ఎవరూ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించి వార్డుల్లో ప్రచారం చేస్తుంటే… బీజేపీ మాత్రం అభ్యర్థులుగా ఎవరు దొరుకుతారా అన్న వెదుక్కోవాల్సి రావడమే అసలు విషాదం అన్న మాటలు వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో. అయితే ఈ అభ్యర్థుల వేట వెనుక ఓ వెరైటీ స్ట్రాటజీ ఉందని అంటున్నారు బీజేపీ లీడర్స్. కాంగ్రెస్, BRS టికెట్స్ ఆశించి భంగపడ్డ వారిని కాషాయ పార్టీ… రా…. రమ్మని పిలిచి రెడ్ కార్పెట్ వేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండి టికెట్ రాని వారు మా పార్టీలో చేరండి. మీ వార్డుల నుంచి పోటీ చేయండి. గెలవండి అంటూ బంపరాఫర్స్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. సిట్టింగ్ ఎంపీ ఉన్న చోట ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నది కార్యకర్తల క్వశ్చన్. అటు ఎంపీ రఘునందన్ రావు తన పరిధిలోని మున్సిపాలిటీల్లో తిరుగుతూ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నా… ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం కారణంగా…కేడర్‌లో నమ్మకం పెరగడం లేదంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాజేశ్వర్ దేశ్ పాండే ఉండగా ఆయనకి అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేదు.
దీంతో ఆయన BRSలో చేరి తిరిగి లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం దేశ్‌పాండేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. అందుకే ఆయన కూడా ఆచి తూచి అడుగులేస్తున్నట్టు సమాచారం. ఇక జహీరాబాద్, ఆందోల్, పటాన్ చెరులో పార్టీని పట్టించుకునే వారు లేరు. మెదక్, నర్సాపూర్‌లోనూ సేమ్ సీన్. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక తన సొంత నియోజకవర్గం కావడంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు అక్కడే స్పెషల్ ఫోకస్ పెట్టారట ఎంపీ రఘునందన్‌రావు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పట్టించుకుని మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టి పని చేస్తేనే కాస్తో కూస్తో ఉనికి చాటుకోగలమని, లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవన్నది కేడర్ వాయిస్. ఏవో కొన్ని కౌన్సిలర్ స్థానాలు గెలిచి…. అదే పదివేలని సర్దుకుంటారా..? లేక ఉమ్మడి జిల్లా మీద పట్టు బిగిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
