తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తయితే… అక్కడ మరో ఎత్తుగా పరిస్థితి మారుతోందా? ఆ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కత్తులు దూస్తున్నాయా? ఓ సీనియర్ మంత్రికి కాంగ్రెస్ స్పెషల్‌గా బాధ్యతలు అప్పగించడం వెనక వ్యూహం ఏంటి? ఏదా మున్సిపల్ కార్పొరేషన్? ఎందుకంత స్పెషల్? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం వేసే ఎత్తుగడలు ఒక ఎత్తయితే… నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను చాలా ప్రత్యేకంగా చూస్తోందట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో.. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం గెలిచి సత్తా చాటాల్సిన అనివార్యత ఉందంటున్నారు. అందుకు తగ్గట్టే నిజామాబాద్‌లో గెలుపు బాధ్యతను ఆయనే తీసుకుని పావులు కదుపుతున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచార వ్యూహాన్ని ఆయనే ఖరారు చేస్తున్నారట. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్‌తో పాటు ఇటు సీఎం రేవంత్ సైతం నిజామాబాద్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట.
ఆ క్రమంలోనే…. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని సైతం రంగంలోకి దించినట్టు తెలిసింది. ప్రభుత్వం, పీసీసీ చీఫ్, ఉత్తమ్ వేర్వేరుగా సర్వే టీంలను రంగంలోకి దించి సమాచారం సేకరిస్తున్నారట. గెలుపు గుర్రాల కోసం ఎవరికి వారు మూడు రకాల సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించి.. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యవహారిస్తున్నారు. వోవరాల్‌గా నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్ని కూడా హస్తగతం చేసుకునే దిశగా ప్లానింగ్ సిద్ధమవుతోంది. ఐతే కార్పొరేషన్‌లో బీజేపీ బలంగా ఉండటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు. మొత్తం 60 డివిజన్స్‌కుగాను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచింది. దాంతో… ఇప్పుడు మేయర్ పీఠం అంత ఈజీనా అన్న సందేహాలు సైతం ఉన్నాయి కొందరికి. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నట్టు చెబుతున్నా….ఈ సారి చాలామంది సిట్టింగ్‌లకు ఆ పార్టీ టిక్కెట్లు నిరాకరించబోతున్నట్టు సమాచారం. ఆ కోత ప్రభావం కాషాయ పార్టీ గెలుపు అవకాశాల మీద పడుతుండవచ్చన్న విశ్లేషణలున్నాయి.
ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టి రక్తి కట్టిస్తున్నాయి. బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లు ఐదు ఉండటం కలిసొస్తుందన్న లెక్కలు సైతం ఉన్నాయి. తాము గెలిస్తే.. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని చెబుతున్నారట కాషాయ నేతలు. అందుకే మన ఇందూరు- మన మేయర్ అంటూ కొత్త నినాదాన్ని తెర మీదికి తీసుకువచ్చారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేతలు సైతం మన నిజామాబాద్ మన అభివృద్ది అంటూ ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 28 డివిజన్లు గెలుచుకుని.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ…. తృటిలో మేయర్ పీఠం చేజారింది.13 డివిజన్లలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా… కార్పొరేషన్‌లో పాగా వేయాలన్న లక్ష్యంతో అంతా తానై వ్యవహరిస్తున్నారట బీజేపీ ఎంపీ అర్వింద్. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలంటే.. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలవాల్సిందేనంటూ పార్టీ పెద్దలు కూడా నిజామాబాద్ పై ఫోకస్ పెంచారట. ఇక్కడ చతుర్ముఖ పోటీ జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ -బీజేపీ కత్తులు దూస్తుంటే…. కింగ్ మేకర్ పాత్ర కోసం మజ్లిస్, బీఆర్ఎస్ చూస్తున్నాయి. ఫైనల్‌గా మేయర్ పీఠం గెలిచి.. మున్సిపల్ పరీక్షల్లో పీసీసీ చీఫ్ పాస్ అవుతారా.. ? పార్టీ కీలక నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారు . ?ఉత్తమ్ మంత్రం ఫలిస్తుందా.. బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తారా అన్నది ప్రస్తుతం ఇందూరు పొలిటికల్ హాట్.
