తెలంగాణలో లెఫ్ట్ పార్టీలది చెరోదారేనా? వామపక్ష ఐక్యత అన్నది ఉత్తుత్తిదేనా? ఒకే భావజాలం ఉన్న రెండు పార్టీలు ఇప్పుడు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని డిసైడయ్యాయా? ఉత్తర దక్షిణాలుగా ఉండే రెండు పార్టీల్లో చెరొకరికతో కలిసి నడవాలని ఎర్రన్నలు ఫిక్స్ అయినట్టేనా? ఎర్ర జెండాలు ఎందుకు కలిసి సాగడానికి ఇష్ట పడటం లేదు? తెలంగాణ రాజకీయాల్లో వామపక్ష పార్టీల మధ్య వ్యూహాత్మక భేదాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు సీపీఐ కాంగ్రెస్ కూటమిలో ఉంటూ ప్రభుత్వానికి, అధికార పక్షానికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూనే, మరోవైపు మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజల పక్షాన నిలబడుతున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారాయన.
మరోవైపు సీపీఎం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి దూరంగా ఉంటోంది. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ…. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలుపుతోంది. ముఖ్యంగా వామపక్షాలకు కంచుకోట లాంటి ఖమ్మం, ఇతర కీలక ప్రాంతాల్లో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయడం, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దూరంగా జరగడం చూస్తుంటే.. తెలంగాణ రాజకీయాల్లో వామపక్షాలు చెరోదారి ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక కేరళ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పెరిగిన దూరం, రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోందనేది పొలిటికల్ వాయిస్. ఎర్రన్నలకు పెట్టని కోట లాంటి ఉమ్మడి ఖమ్మం జిల్లానే తీసుకుంటే ఇక్కడ పరిస్థితులు కూడా తేడాగానే కనిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ… కొత్తగూడెం సీటు తీసుకుంది. అక్కడ గెలిచి పట్టు బిగించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని సత్తా చాటగలిగింది. ఇక అదే కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌తో జట్టు కట్టింది మరో లెఫ్ట్ పార్టీ సీపీఎం. కానీ.. ప్రభావం చూపించలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎవ్వరితో పొత్తు లేకుండా సొంతగా పోటీ చేసిన సీపీఎం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అయితే… మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు దగ్గరైనందున ఇక అదే ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ రకంగా వామపక్షాలు రెండూ చెరో దారి ఎంచుకున్నట్టు కనిపించడం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో పార్టీల రాష్ట్ర కమిటీలకు, స్థానిక కమిటీలకు మధ్య కూడా తేడాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగుతుందా లేక ఎన్నికల నాటికి పరిస్థితుల్ని బట్టి మారుతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
