తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పిక్చర్ క్లియర్ అయిందా? వ్యవస్థను సెట్ చేసేందుకు తానేం చేయాలో స్పష్టత వచ్చేసిందా? ఇక తగ్గేదేలే అంటూ యాక్షన్ షురూ చేశారా? ఓ మంత్రి ఓఎస్డీ మీద యాక్షన్ ఆరంభం మాత్రమేనా? లిస్ట్‌లో ఇంకెంతమంది ఉన్నారు? ఇంతకీ సీఎం చేస్తున్న హెచ్చరికలు ఎవరికి? అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తోంది….సెట్ అవడానికి అందరికీ ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. ఇంకా మెతగ్గా ఉంటే… ఇబ్బంది పడతాం… మొదటికే మోసం వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? అందుకే ఇన్నాళ్ళు గోడకు వేలాడదీసిన కొరడాని కిందికి దించారా? ఇక దానికి పని చెప్పాలని డిసైడ్ అయ్యారా..? అన్న చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ సర్కిల్స్‌లో. మరీ ముఖ్యంగా ఈ రెండేళ్ళలో వివాదాలకు కేరాఫ్‌గా మారిన వాళ్ళందరికీ చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. తోకలు కట్ చేసుకుంటూ పోతేగానీ… దారిలోకి రారన్న ఉద్దేశ్యంతో ఆ పని మొదలుపెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అందులో భాగంగానే… ముందుగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించింది ఉండవచ్చని భావిస్తున్నారు. సుమంత్ మీద వచ్చిన రకరకాల ఆరోపణలు ఒక ఎత్తైతే…ఇటీవల మేడారం జాతర టెండర్స్ ఎపిసోడ్‌లో జరిగిన గొడవ వెనకాల, అసలు ఇష్యూని ఫ్లేరప్ చేయడంలో సుమంత్ పాత్ర ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ అందిందట ముఖ్యమంత్రికి. దీంతో మంత్రి ఓఎస్డీగా ఆయన్ని తొలగిస్తూ…ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మేడారం ఇష్యూ నే కాదు.. శాఖలో కూడా సుమంత్ అంతా తానై నడిపిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఇంకా నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ఓఎస్డీనే షాడో మంత్రిగా వ్యవహరించారని, అదే విషయాన్ని ఒకరిద్దరు పార్టీ సీనియర్ నేతలు కూడా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పుకుంటున్నారు. అలా… అన్నీ కలగలిసి వేటు పడేలా చేశాయన్నది ఓ అంచనా. అయితే… దీన్ని కేవలం ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్న అధికారి మీద తీసుకున్న చర్యగానే చూడకూడదని, ఈ చర్యతో చాలామందికి సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేసినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మంత్రులందరి పేషీల్లో ఏం జరుగుతోందో… తనకు తెలుసునన్న ఇండికేషన్ పంపినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇకపై ఎవ్వర్నీ ఉపేక్షించేది లేదని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేసినట్టయిందన్నది ఇంకో వెర్షన్. మంత్రులు తమ పేషీల్లో ఉండే ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టయింది.
ఇది కేవలం మంత్రి కొండా సురేఖ వరకే పరిమితం కాలేదు. జనం తాకిడి ఎక్కువ ఉండే ఓ మంత్రి కార్యాలయంలోని సిబ్బంది మీద కూడా cmoకి ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఛాంబర్‌లోని ఉద్యోగిపై కూడా ఇలాంటి ఫిర్యాదులు వెళ్లాయట. దక్షిణ తెలంగాణకి చెందిన మంత్రుల పేషీల్లో ఉద్యోగులు అంతా తామై నడిపిస్తున్నారన్న సమాచారంతో కొందరు ఉద్యోగుల వ్యవహారం పై ఇంటలిజెన్స్ ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఇలా… రకరకాల కోణాల్లో… మొత్తానికి సీఎం రేవంత్ కొరడా ఝళిపించే పని మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన మంత్రుల ఎపిసోడ్ పై కూడా ఫోకస్ చేశారట సీఎం. ఎందుకులే అని వదిలేస్తుంటే పని జరగడం లేదని, ఇక యాక్షన్ మొదలుపెట్టకపోతే కుదిరేట్టు లేదని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం.
