కొండాస్….పొలిటికల్ కుటుంబ కథాచిత్రానికి శుభం కార్డ్ పడ్డట్టేనా..? ఆ విధంగా వాళ్ళు సెట్ అయ్యారా? లేక పార్టీ పెద్దలు సెట్ చేశారా..!? కథకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి కాబట్టి పలికారా? లేక నిజంగానే వివాదం సమసి పోయిందా? ఇంతకీ ఎలా సెట్ చేశారు..? తెర వెనక ఏం జరిగింది? అసలు సమస్య ఒకటి…జరిగిన రచ్చ ఇంకొకటి. మొదలుపెట్టింది ఒకరు… బద్నాం అయ్యింది మరొకరు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ మీద ప్రభుత్వ చర్యతో మొదలైన వివాదం ఎటెటో తిరిగి మంత్రి కుమార్తె ఎంట్రీతో మరో మలుపు తిరిగి రచ్చ రచ్చ అయింది. ఆ వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో… కొండా సురేఖ దంపతుల భేటీ అయితే జరిగిందిగానీ…..పూర్తి స్థాయిలో మనసులు కలవలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తం నివురుగప్పిన నిప్పులానే ఉందన్నది ఇంటర్నల్ టాక్. కాకుంటే… ఆ ఎపిసోడ్ మొత్తం ప్రతిపక్షాల చేతికి అస్త్రాన్ని అందించినట్టు అయిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకు తగ్గట్టే… రెండు..మూడు రోజులుగా ప్రతిపక్షం.. కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్‌నే ఆయుధంగా వాడుకుంటున్నాయి. OSD సుమంత్ ఎపిసోడ్‌లోకి సుస్మిత అనవసరంగా ఎంటరైపోయి… కెలికి కంపు చేయడమేగాక పార్టీని కూడా డిఫెన్స్‌లో పడేశారన్న ఫీలింగ్‌లో ఉందట నాయకత్వం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఇదే ఫీలింగ్ లో ఉన్నారట. కేవలం బీసీ అనే ఒకే ఒక కారణంతో పార్టీ నాయకత్వం కొండా సురేఖను ఇన్నాళ్ళు ఉపేక్షించిందన్నది ఇంటర్నల్ టాక్. అయితే అదే సమయంలో బీసీ పేరుతో, ఆ ముసుగులో నాయకులు ఏం చేసినా వదిలేయాలా..? అనే చర్చ సైతం లేకపోలేదు.
ఐతే.. కొండా సురేఖ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యాక… PCC చీఫ్ మహేష్ గౌడ్… సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కొండా ఎపిసోడ్‌ని త్వరగా ముగించమని చెప్పడంతో…పీసీసీ అధ్యక్షుడే కొంత రిస్క్ తీసుకున్నట్టు సమాచారం. దీపావళి రోజున… సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్‌కి ఒప్పించి అందర్నీ కలిపే ప్రయత్నం చేశారాయన. రాష్ట్ర పార్టీ బాధ్యుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం సరైంది అయితే.. కావచ్చుగానీ… కాంగ్రెస్, సీఎం రేవంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి సంబంధించి కూడా కొండా కుటుంబం మీద చర్యలు తీసుకుని ఉండాల్సిందన్న వాదన సైతం ఉందట కాంగ్రెస్ వర్గాల్లో. సిమెంట్ కంపెనీల దగ్గర డబ్బులు డిమాండ్ చేశారనే ఫిర్యాదు చేసింది ఒకరు… బాధ్యులపై చర్యలు తీసుకున్నది ఇంకొకరు… సీన్ కట్ చేస్తే.. రచ్చ మొత్తం ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కి అంటగట్టే ప్రయత్నం జరిగిందన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఒక మంత్రి ఓఎస్‌డీ కోసం.. సీన్‌లో లేని వ్యక్తి పేరును లాగి, ఏవేవో సంబంధంలేని ఈక్వేషన్స్‌ని తెర మీదికి తీసుకువచ్చి లేనిపోని రచ్చ చేశారన్న ఫీలింగ్ చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఉందట. ఇప్పటి వరకు ప్రతిపక్షం కూడా చేయని ఆరోపణలు… చేశారు కొండా సుస్మిత.
ఆ మురికిని ఎలా కడుక్కోవాలో అర్ధంగాక పార్టీ నాయకత్వం మొత్తం తలపట్టుకోవాల్సి వచ్చింది. మంత్రులు అయినా, సీనియర్ లీడర్స్ అయినా… ప్రతిపక్షానికైతే కౌంటర్స్ వేసేవారుగానీ… మాట్లాడింది సొంత పార్టీ నేతలు కావడంతో నోరు మెదిపే పరిస్థితి లేదు. దీంతో బాగా ఇరుకున పడింది టీ పీసీసీ. ఇప్పటికైనా… మంత్రులని దారిలో పెట్టకపోతే ప్రభుత్వానికి…పార్టీకి డ్యామేజ్ తప్పదన్న వాదన కాంగ్రెస్ సర్కిల్స్‌లో బలపడుతోంది. మరోవైపు సీఎం రేవంత్‌తో..కొండా దంపతుల భేటీ ఎపిసోడ్ వరంగల్ జిల్లా నేతలకు మింగుడు పడటం లేదట. వాళ్ళు అన్ని రకాలుగా నష్టపరిచినా… ఇటు పార్టీ, అటు ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు వెనకేసుకు వస్తున్నాయో అర్ధంకావడం లేదని జిల్లా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం బీసీ కార్డే కొండా సురేఖకు శ్రీరామ రక్ష అంటూ లోలోన గునుగుతున్నారు నేతలు. ఏదైనా..ఈ టోటల్ ఎపిసోడ్… సెట్ చేసింది పిసిసి చీఫ్ మహేష్ గౌడేనన్నది గాంధీభవన్ టాక్. కానీ క్రమశిక్షణ విషయంలో ఆయన ఎందుకో సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది పార్టీ వర్గాల్లో. ఆ విషయంలో అధ్యక్షుడు కఠినంగా ఉంటేనే అంతా సెట్ అయ్యేదన్నది కాంగ్రెస్ వర్గాల విస్తృతాభిప్రాయం.
