Site icon NTV Telugu

Off The Record : ఓరుగల్లు పోరులో కొండా దంపతులకు మరోసారి చేయి కాలిందా?

Konda Couple

Konda Couple

ఓరుగల్లు పోరులో మంత్రి కొండా సురేఖ దంపతులకు మరోసారి చెయ్యి కాలిందా? లేనిపోని ఇగోలకు పోయి ఉన్న పరువు తీసుకుంటున్నారన్న మాటలు మరోసారి ఎందుకు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోని వాళ్ళతో పాటు ఇతర ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి వేసిన ఎత్తులు చిత్తయ్యాయా? తాజాగా ఏం జరిగింది? కొండా కపుల్‌ మళ్ళీ ఎందుకు చర్చనీయాంశం అయ్యారు? ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజీయాలను శాసించిన కొండా దంపతులకు ఇప్పుడు అక్కడి పరిస్థితులు మింగుడు పడ్డం లేదా అంటే… ఎస్‌ అన్నదే సమాధానం. వాళ్ళు వేస్తున్న ఎత్తులు ఎప్పటికప్పుడు చిత్తయిపోతుండటం లోకల్‌గా చర్చనీయాంశం అవుతోంది. సొంత పార్టీ నేతలపై ఆధిపత్యం సాధించాలన్న ప్రయత్నాలు ఒకవైపు సమస్యలను తెచ్చి పెడుతుంటే.. మరో వైపు వేరే పార్టీల్లోని ప్రత్యర్థులను చిత్తు చేయలన్న వ్యూహాలు కూడా బెడిసికొడుతున్నాయి. తాజాగా వరంగల్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలకవర్గం ఎన్నిక విషయంలో కొండా దంపతులు అనవసరంగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను. 60 కోట్లు ఖర్చు పెట్టానని కొండా మురళి చెప్పిన మాటల ఆధారంగా… రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎన్నికపై అనర్హత వేటేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

దీంతో కొండా కపుల్‌ ఆయన్ని టార్గెట్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ప్రదీప్ రావుకు చుక్కలు చూపించేందుకు పరోక్షంగా స్కెచ్ వేశారన్న టాక్ నడుస్తోంది వరంగల్ జిల్లాలో. బ్యాంకు పాలకవర్గ కాలపరిమితి జులై 30తో ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. అయితే అదే సమయంలో… బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని, సభ్యుల్లో బినామీలు ఉన్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రదీప్‌రావు తిరిగి ఎన్నికవకుండా చేయడం కోసం ఆ విషయంలో కొండా దంపతులే వెనకుండి చక్రం తిప్పారన్న అనుమానాలున్నాయి. మూడు దశాబ్దాల వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్‌ బ్యాంక్ చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఆ రెండు సార్లూ… ఎర్రబెల్లి ప్రదీప్‌రావే చైర్మన్ అయ్యారు. మిగిలిన సందర్భాల్లో కూడా ఆయనే ఏకగ్రీవం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు చెక్‌ పెట్టేందుకు కొండా దంపతులు ప్రయత్నించడంతో… వాతావరణం వేడెక్కింది. ఒక దశలో ఎన్నికలను వాయిదా వేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నించినా వర్కౌట్‌ అవలేదట.

మొత్తం మీద గురువారం నాడు ఎన్నిక జరిగి మళ్లీ ప్రదీప్‌రావు ప్యానలే గెలిచింది. దాదాపు పది రోజుల పాటు సాధారణ ఎన్నికల స్థాయిలో వ్యవహారం నడిచింది. పేరుకు పార్టీల ప్రమేయం లేదుగానీ… ఈ ఎన్నికలో మొత్తం రాజకీయమే నడిచింది. పోలింగ్‌ జరిగిన ఏవీవీ విద్యాసంస్థల పరిసరాల్లోకి వేలాది మంది రావడంతో అక్కడ వాతావరణం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. వందలాది వాహనాలు, అనుచరులు, గుంపులు,గుంపులుగా తమ తమ అభ్యర్ధులను గెలుపించుకునేందుకు రావడం ఎన్నిక తీవ్రతను చాటి చెప్పింది. ఫైనల్‌గా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు 2వేల166 ఓట్ల మెజార్టీతో తిరిగి బ్యాంక్‌ ఛైర్మన్‌ అయ్యారు. అంతే కాదు.. ఆయన ప్యానల్‌ మొత్తం విజయం సాధించింది. ఈ ఫలితం చూశాక వరంగల్‌ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొండా దంపతులు…. ఎవర్నో దెబ్బతీద్దామనుకుని లేనిపోని ఫాల్స్‌ ప్రెస్టీజ్‌కు పోయి ఫుల్‌గా చేతులు కాల్చుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా కాంగ్రెస్‌ పార్టీతో సంబంధాలు ఉండి పోటీలో నిలిచిన వారికి కనీసం డబుల్ డిజిట్ ఓట్లు కూడా రాకపోవడం చర్చనీయాంశం అయింది. మంత్రి కొండా సురేఖ దంపతులు అధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఓరుగల్లులో.

 

Exit mobile version