OTR: స్థానిక ఎన్నికల వేళ తిరువూరు ఎమ్మెల్యే ఎటు వెళ్లారు?

Otr

Otr

స్థానిక సంస్థలు ఎన్నికల వేళ తిరువూరు ఎమ్మెల్యే ఎటు వెళ్ళిపోయారు? ఒకపక్క హోరాహోరీ వార్‌ నడుస్తుంటే….దగ్గరుండి వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సిన శాసనసభ్యుడు ఎందుకు ముఖం చాటేసి హైదరాబాద్‌లో ఉన్నారు? సార్‌కి జ్వరం వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? ఎమ్మెల్యే నిరసన సిరీస్‌లో లేటెస్ట్‌ ఎపిసోడ్‌ ఏంటి? తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారిపోయారట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మొదట్నుంచి ఏదో ఒక వివాదంతో గిల్లి, గిచ్చి అన్నట్టు ఉంటున్న శాసనసభ్యుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల టైంలో… పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. వరుసగా… నాలుగు పర్యాయాల నుంచి టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్న సీట్లో గత ఎన్నికల్లో సైకిల్‌ గుర్తు మీదే గెలిచారు కొలికపూడి. కానీ… ఆ తర్వాత ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయిందని,ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారిపోయారన్నది పొలిటికల్ టాక్‌.

 

అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి… ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేయటంతో పాటు ఎంపీ కేశినేని చిన్నితో విభేదిస్తున్నారాయన. అదే సమయంలో కేశినేని చిన్ని వర్గం వల్ల ఎమ్మెల్యే కూడా ఇబ్బంది పడుతున్నారన్నది ఇంకో వెర్షన్‌. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా పోవడం కొత్త చర్చకు కారణం అవుతోంది. రాష్ట్రం మొత్తం స్థానిక ఎన్నికల మీద ఫోకస్‌ చేసి ఉంటే…. తిరువూరు శాసనసభ్యుడు మాత్రం… గత రెండు రోజుల నుంచి లోకల్‌ లీడర్స్‌, కేడర్‌కు అందుబాటులో లేరట. ఆయనకు జ్వరంగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లారనేది అనుచర వర్గం చెబుతున్న మాట. కానీ….మనస్తాపంతోనే హైదరాబాద్ వెళ్ళారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. తిరువూరు మున్సిపాలిటీలో సీట్ల సర్దుబాటు వ్యవహారంతో పాటు చైర్మన్ ఎంపిక విషయంలో కూడా కొలికపూడి ఫీలయ్యారన్నది లోకల్ టాక్. కూటమి నుంచి తిరువూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా జనసేన తరపున మాధవిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఆమెకు పోటీగా శ్రావణి అనే అభ్యర్థిని సపోర్ట్‌ చేశారు ఎమ్మెల్యే.

దగ్గరుండి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయించడం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేతో చర్చలు జరిపి ఉపసంహరించుకునేలా చేయమని ఆదేశించింది. అందుకు ఆయన అంగీకరిస్తూ తాను సపోర్ట్ చేసిన శ్రావణి నామినేషన్ విత్ డ్రా చేయించారట. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా…22 చోట్ల టిడిపి పోటీ చేస్తోంది. ఆ 22 స్థానాల్లో ఎమ్మెల్యే తన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. బీ ఫామ్స్‌ ఇవ్వడం కోసం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తిరువూరులో ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళారు. కొలికపూడిని కూడా అక్కడికే రమ్మన్నారు. కానీ… తనకు వ్యతిరేకంగా ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఆఫీస్‌కు తాను రానంటూ వెళ్ళిపోయారట ఆయన. దీంతో గద్దె అనురాధ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థులకు బీ ఫామ్స్‌ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ… ఆ 22 కూడా ఎంపీ వర్గీయులకు కేటాయించటంతో ఎమ్మెల్యే మనస్థాపానికి గురయ్యారన్నది లోకల్‌ టాక్‌. అంతకు ముందు ఎమ్మెల్యే మనుషులుగా నామినేషన్‌ వేసిన 22 మందిలో 18 మంది ఉపసంహరించుకున్నారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత కొలికపూడి థాంక్యూ అంటూ సోషల్‌ మీడియాలో మెసేజ్ పెట్టి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారట. స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా ఉండటం ఇప్పుడు కూటమిలో చర్చగా మారింది.