Site icon NTV Telugu

Off The Record : కొలికపూడి వైఖరితో తిరువూరు టీడీపీలో అసహనం?

Kolikapudi

Kolikapudi

తెలుగుదేశం పార్టీకి సొంత ఎమ్మెల్యేనే కొరకరాని కొయ్యలా మారిపోయారా? ఆయన మీద చర్యలకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నా…. నియోజకవర్గ నాయకులు మాత్రం ఇక మావల్ల కాదని చెప్పేస్తున్నారా? మీరు ఏదో ఒకటి చేయకుంటే… అక్కడ మేం తట్టుకోవడం కష్టమంటూ పార్టీ పెద్దల మీద వత్తిడి చేస్తున్నారా? యాక్షన్‌ లేకుంటే జరిగే డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేయడం మావల్ల కాదని అంటున్నారా? ఎవరా ఎమ్మెల్యే? లోకల్‌ లీడర్స్‌ ఎందుకు రివర్స్‌ అవుతున్నారు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కొరకరాని కొయ్యలా మారిపోతున్నారన్న చర్చ సొంత టీడీపీలోనే పెరిగిపోతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన తీరు మాత్రం అధిష్టానానికి మింగుడు పడటం లేదట. సొంత నియోజకవర్గం కాకపోయినా… పిలిచి మరీ…టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈ గోలేంటని పార్టీ శ్రేణుల్లో సైతం అసహనం పెరిగిపోతోందంటున్నారు. గెలిచిన కొత్తల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి సఖ్యతగానే ఉన్నప్పటికీ… క్రమంగా
విభేదాలు పెరిగి రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య చిన్న చిన్న గ్యాప్స్‌ వల్లే ఇదంతా జరుగుతోందని మొదట్లో అనుకున్నా…. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయటంతో ఆయన మొత్తం పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. చివరికి సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాక కూడా ఎమ్మెల్యే తీరు మారకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట.

పలుమార్లు పార్టీ పెద్దలు మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసినా…ఆయన మాత్రం అన్ స్టాపబుల్ అన్నట్టుగా వివాదాల పరంపరలో దూసుకుపోతుండటంతో… ఇలాగే వదిలేస్తే డ్యామేజ్‌ తప్పదన్న చర్చ మొదలైందట టీడీపీలో. ఈ క్రమంలోనే…. తిరువూరు లోకల్ లీడర్స్ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చినట్టు తెలిసింది. తిరువూరు రిజర్వు నియోజకవర్గం అయినందున ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలన్నది పార్టీలోని ఓ వర్గం చేస్తున్న సూచన. ఎమ్మెల్యే ఇప్పటికే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని గుర్తించిన అధిష్టానం ఇప్పటివరకు ఆయన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి తీరు మార్చుకోవాలని పదేపదే చెప్పింది. అయితే… ఆయన కూడా తాను తప్పు చేయటం లేదని, నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ మధ్య ఒకసారి కులం ప్రస్తావన కూడా తీసుకురావడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడారు. అదే సమయంలో ఆయన కూడా తనకు అలాంటి ఉద్దేశ్యాలు లేవని, వివాదం సమసిపోయిందని చెప్పారు. కానీ… నియోజకవర్గంలో మాత్రం తిరిగి తన పాత పంథానే కొనసాగిస్తున్నారన్నది ఇటీవల చేసిన ధర్నాతో తేలిపోయిందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. తిరువూరు నియోజకవర్గంలో చివరికి కుల సంఘాలు వచ్చి మీడియా సమావేశాలు పెట్టే వరకు పరిస్థితి వెళ్ళింది. అయితే… కొలికిపూడి విషయంలో అసలు కులాల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉందట. అందులో భాగంగానే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం.

ఆయన మాత్రం నియోజకవర్గంలో ఏదో ఒక అంశంతో హడావుడి చేస్తూ…. పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని తిరువూరు టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకున్నా… అది ఆయన వర్గంపై ప్రభావం చూపించి పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు. అయితే… ఎన్నాళ్ళని ఇలా భరిస్తాం…. అస్సలు చర్యలేవీ తీసుకోకపోవడం వల్లే ఆయన అలా చెలరేగుతున్నారు, రోజు కొత్త వివాదంతో ఇరుకున పెడుతున్నారంటూ ఫీలవుతున్నారట నియోజకవర్గ పార్టీ నాయకులు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో తిరువూరులో పార్టీ, ప్రభుత్వం రెండూ ఇరుకున పడతాయని హెచ్చరిస్తున్నారు. పూర్తిగా వదిలేయడం వల్ల వివాదం ఎంతోకొంత పెరగడం తప్ప తగ్గదన్నది లోకల్‌ లీడర్స్‌ మాట. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నప్పటికీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్న ధర్నాలు, పెడుతున్న పోస్టులు కచ్చితంగా పార్టీకి డ్యామేజ్ తో పాటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతాయన్న విషయంలో సందేహం లేదని అంటున్నారు పార్టీ నేతలు. చర్యల విషయంలో అధిష్టానం ఆలోచన వేరేగా ఉన్నా… తీసుకోకుండా వదిలేస్తే…. లోకల్‌గా జరిగే డ్యామేజ్‌ ఇంకా పెద్దగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు తిరువూరు తమ్ముళ్లు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నేరుగా చెప్పకపోయినా….ఆ దిశగా తాజా ప్రతిపాదనల్ని పార్టీ అధిష్టానం దగ్గర పెట్టారట నియోజకవర్గ నాయకులు. దీంతో… పార్టీ పెద్దలు ఏం చేస్తారోనని ఉత్కంఠగా చూస్తున్నారు అంతా.

Exit mobile version