చావుకు గొంతుంటే… ఇట్టా ఉంటదా…. అన్నది ఓ హిట్ సినిమా డైలాగ్. అదే డైలాగ్ ఇన్‌స్పిరేషన్‌గా రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారో మాజీ ఎమ్మెల్యే. పాలిటిక్స్‌లో మంచితనం వర్కౌట్ అవదని, ఏదైనా సరే… భయంతోనే జరిగిపోవాలని తాజాగా జ్ఞానోదయం అయిందట ఆయనకు. ఎవరా మాజీ శాసనసభ్యుడు? సడన్‌గా ఎందుకు అంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు? కొంత మంది గట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తారు….మరికొంతమంది కొట్టి చెబుతారు, ఇంకొందరు కొట్టినంత పని చేస్తారు. భయపెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ… మొదట్నుంచి ట్రెండ్‌ని ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయాలన్నట్టుగా రాజకీయం చేస్తున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం… కూల్‌గానే చెప్పాల్సింది చెప్పేస్తున్నారట. ఇప్పుడు చాలామంది చెలరేగుతున్నారు. వాళ్ళందరికీ ఇక రెండేళ్ళే టైం అంటూ హెచ్చరిస్తున్నారట. దీని చుట్టూనే ధర్మవరం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ… హడావిడి చేసిన కేతి రెడ్డి వెంకట్రామిరెడ్డి 2024ఎన్నికల్లో ఓడి పోయారు. తర్వాత చాలా రోజులు సైలెంట్‌గానే ఉన్నారాయన. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తూ…..తన ఓటమితో పాటు ఈవీఎంలపై విమర్శలు చేసే వారు. ఓడిపోయిన తొలి నాళ్ళలో ధర్మవరం రాజకీయాల గురించి అస్సలు మాట్లాడలేదాయన.ఇదే సమయంలో ఇక్కడ మంత్రి సత్యకుమార్‌తో పాటు బీజేపీ నేత హరీష్, ఇంకొందరు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కేతిరెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసి విమర్శంచారు. కొందరు వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టారని, మరి కొందర్ని బెదిరించి తమ పార్టీల్లోకి చేర్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ… వాటి మీద ఇన్ని రోజులు రియాక్ట్ కాలేదు కేతిరెడ్డి. కానీ… తొలిసారి తాజాగా చాలా గట్టి రియాక్షన్ ఇవ్వడం సంచలనమైంది. అదీకూడా… ఆయన వాడిన పదజాలం గురించే మాట్లాడుకుంటున్నారు స్థానికంగా.
గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ప్రజల సమస్యలు తీరిస్తే నిందలు తప్ప ఏమీ మిగలలేదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తోంది. ఏం చేశారో చెప్పమనండి అంటూ నిలదీశారు. కేవలం కబ్జాల కోసమే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టానన్నారు కదా….? ఈ రెండేళ్లలో ఏం నిరూపించారంటూ నిలదీశారు మాజీ ఎమ్మెల్యే. అందుకే మంచితనంతో వచ్చే భక్తి కన్నా.. భయంతో వచ్చేదే కరెక్ట్‌గా, ఎక్కువ కాలం ఉంటుందని అంటున్నారాయన. ఆ భయం అంటే ఏంటో.. కేతిరెడ్డి అంటే ఏంటో 3.0లో చూపిస్తా అని మాస్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులైన కొందరు నాయకుల సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. ఇటీవల ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన కేతిరెడ్డిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఆ సందర్భంలోనే ఇలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశా. ఆ మోజులన్నీ తీరిపోయాయి… ఈసారి ఎమ్మెల్యే అయి కేవలం ఎమ్మెల్యే పనులు మాత్రమే చేస్తానంటున్నారు. మనం సర్దుకుపోతే ఎప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంటామని, గోడ వంగిందని అలాగే వదిలేస్తే మీద పడుతుందని అనడం చుట్టూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గోడను సరిచేసి ప్లాస్టింగ్ చేస్తే పదికాలాలు భద్రంగా ఉంటుందని.. అలాగే పార్టీని, క్యాడర్‌ను భద్రపరిచే బాధ్యత నాది అంటున్నారు వెంకట్రామిరెడ్డి. నేనేం చేస్తానో…. వచ్చే మూడేళ్ళ తర్వాత చూడమంటూ కేడర్‌కు బూస్ట్ ఇస్తున్నారు. మనకంతా జనవరి లెక్కలే. లాస్ట్ జనవరికి ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది… ఇక ఈ రెండేళ్లు మీరేం చేస్తారో చేసుకోండి, ఎన్ని అవాకులు, చెవాకులు పేలతారో పేలండి… ఆ తర్వాత ఇలాంటి దీపావళి కూడా చూడరనడంతో ఒక్కసారిగా ధర్మవరం పాలిటిక్స్‌లో కాక రేగింది. ఎవరిని చూసి విర్రవీగారో వారికి తగిన గుణపాఠం నేర్పుతానని.. రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరుగుతుందని అన్నారాయన. ఇంకోసారి ఎవరైనా మాట్లాడాలన్నా వారికి మామూలుగా ఉండదు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి పాలనలో ఎవరెవరు ఏం మాట్లాడారో.. ఏవిధంగా ఇబ్బంది పెట్టారో అన్నీ డిజిటల్ బుక్‌లో నమోదయ్యాయన్నారు. కేతిరెడ్డి ఇచ్చిన ఈ వార్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
