Site icon NTV Telugu

Off The Record : కవిత శిబిరం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతోందా..?

Kavitha

Kavitha

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారా? అప్పట్లో ఆమె ఏదేదో… ఊహించేసుకుంటే… ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఇంకేదో జరిగిపోతోందా? అట్నుంచి ఇటువైపు దూకుతారనుకుంటే… ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా టాటా బైబై చెప్పేయడం కంగారు పెడుతోందా? చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆమె ఆశల మీద నీళ్ళు చల్లాయా? ప్రస్తుతం కవిత శిబిరం అంచనాలేంటి? కాలం గడిచేకొద్దీ…. కవిత శిబిరంలో కంగారు పెరుగుతున్నట్టు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టిక్కెట్లు రానివాళ్ళు తనవైపునకు దూకేస్తారని, జాగృతిని బలోపేతం చేసుకోవచ్చని ఆశించగా…. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడటం ఆమె శిబిరంలో నిరాశ నింపిందన్న చర్చలు నడుస్తున్నాయి. పైగా… బీఆర్‌ఎస్‌లోని చాలామంది కారు దిగేసి తనవైపు నడుస్తారనుకున్నా… అది జరక్కపోగా…. ఉన్నవాళ్ళు కూడా పునరాలోచనలో పడటం టెన్షన్‌ పెడుతోందట. ఇప్పటికిప్పుడు ఏదో మునిగిపోయిందని ఫీలవకున్నా… ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన మాత్రం ఆమె శిబిరంలో మొదలైనట్టు చెప్పుకుంటున్నారు.

బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై కవిత కేసీఆర్‌కు లేఖ రాయడం, అది బయటికి లీకవడం, ఆమె నోటి నుంచి దేవుళ్ళు, దయ్యాల మాటలు రావడం, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్‌…. ఇలావరుసగా జరిగిన పరిణామాలు అటు కారు పార్టీ కేడర్‌ని కూడా కలవరపరిచాయి. అయితే… ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాక… చాలా మంది గులాబీ లీడర్స్‌ తమ నాయకురాలికి టచ్‌లోకి వచ్చినట్టు లీకులిచ్చారు కవిత అనుచరులు. ఆమె కూడా ఒక సందర్భంలో…. బీఆర్‌ఎస్‌ నాయకులు చాలామంది తనను సపోర్ట్‌ చేస్తున్నారని, అవసరమైన సమయంలో వాళ్లు తనకు మద్దతుగా బయటకు వస్తారని ప్రకటించారు. కానీ… పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యాక ఆమె ఊహించిన విధంగా అయితే ఏదీ జరగలేదు. బీఆర్‌ఎస్‌లో ఉన్న ఏ పెద్ద నాయకుడు కూడా మద్దతు ప్రకటించలేదు. ఆమెకు అండగా నిలబడలేదు. దాంతో… కవిత చెప్పిన ఆ… టైమ్‌ ఇంకా రాలేదా? ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చిన రోజున ఉన్న ఉత్సాహం అందరిలో ఇప్పటికీ ఉందా అన్న చర్చలు నడుస్తున్నాయి.

వాస్తవంగా అధిష్టానం తనను సస్పెండ్‌ చేసిన వెంటనే బీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కనీసం ద్వితీయ శ్రేణి అయినా.. బయటికి వచ్చి మద్దతిస్తారని ఆశించారట కేసీఆర్‌ కుమార్తె. కానీ… అలా జరగలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద గంపెడాశలు పెట్టుకున్నారు. ఆ ఎన్నికలు జరిగితే… బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కని వాళ్ళు తనవైపునకు వస్తారని, అలాంటి వాళ్ళకు జాగృతి మంచి ప్లాట్‌ఫాం అవుతుందని కూడా ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారామె. కానీ… ఆ ఎలక్షన్స్‌ వాయిదా పడటంతో పాటు తిరిగి ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. దీంతో… జాగృతి వైపు చూసే నేతలు తగ్గిపోయారన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అదంతా ఒక ఎత్తయితే… కొత్తగా మొదలైన ఘర్‌వాపసీ…ఆమె వర్గాన్ని మరింత ఆందోళన పెడుతోందట. ఎంతైనా… కేసీఆర్ కుమార్తె అన్న అభిమానమో…. లేక ఆవేశమో… అప్పట్లో కవిత వెనక నడిచిన కొందరు బీసీ నేతలు, మరి కొందరు ఇతర బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఇప్పుడు తిరిగి బీఆర్‌ఎస్ వైపునకు అడుగులేస్తున్నారట. లేఖ ఎపిసోడ్‌లో కవితతో పాటు ఉన్నవాళ్ళు కొందరు తిరిగి తెలంగాణ భవన్‌లో కనిపించడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి జాగృతి తరపున కార్యక్రమాలు నిర్వహిస్తుండగా…. భవిష్యత్‌తో ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

కానీ… పార్టీ రంగు,రుచి వాసన ఎలా ఉంటాయన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మొదలైన రివర్స్‌ వలసలతో పార్టీ పెట్టడంపై అనుమానాలు రేగుతున్నాయట. ఇన్నాళ్ళు సరే… పార్టీ పెట్టినప్పుడు చూద్దామనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియని దగ్గరికెళ్ళి అనవసరంగా డిస్ట్రబ్‌ అవడం ఎందుకని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికైతే బీసీ రిజర్వేషన్లతో పాటు, నిరుద్యోగ సమస్యల మీద పోరాడుతున్న ఎమ్మెల్సీ దగ్గరికి చేరితే… పోరాటాలు తప్ప పదవులు వచ్చే అవకాశం లేదన్నది ఇంకొందరి అంచనాగా తెలుస్తోంది. మరోవైపు ఆమె అనుచరులు మాత్రం భవిష్యత్‌లో కవిత కచ్చితంగా మంచి పాత్ర పోషిస్తారని, కష్టకాలంలో దగ్గరికి వచ్చిన వాళ్లకే తర్వాత గుర్తింపు ఉంటుందని చెబుతున్నారట. ఇలాంటి వాతావరణంలో కవిత తదుపరి అడుగులు ఎలా ఉంటాయో, వాటికి పొలిటికల్‌ రియాక్షన్స్‌ ఎలా ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version