Site icon NTV Telugu

Off The Record : కొత్త పార్టీ విషయంలో కవిత కేసీఆర్ ను ఫాలో అవుతున్నారా?

Kavitha S

Kavitha S

జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీని కాస్త డిఫరెంట్‌గా లాంఛ్‌ చేయబోతున్నారా? ఆ విషయంలో తండ్రి కేసీఆర్‌ ఫార్ములానే అనుసరించబోతున్నారా? పార్టీ ప్రకటనకు ముందే జాయినింగ్స్‌ మీద దృష్టిపెట్టారా? ప్రత్యేకించి వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారా? ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే రూరల్‌ తెలంగాణ తనవైపే ఉంటుందని భావిస్తున్నారా? ఎవరు వాళ్ళు? ఏంటి కవిత ప్లానింగ్‌? తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఖాయమైపోయింది. జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోతున్న పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. అయితే…. అందులో చేరికలు ఎలా ఉంటాయి? ఏ తరహా నేతలకు కవిత ప్రయారిటీ ఇవ్వబోతున్నారన్న ఆసక్తిరకమైన చర్చలు నడుస్తున్నాయి ప్రస్తుతం స్టేట్‌ పాలిటిక్స్‌లో.

ఆ విషయంలో ఆమె తండ్రి కేసీఆర్‌నే అనుసరించబోతున్నారన్న వార్తలు ఇంకా ఆసక్తి రేపుతున్నాయి. ఉద్యమ పార్టీగా పుట్టి, రాష్ట్రం సాధించి పదేళ్లు అధికారంలో ఉన్న BRS నుంచి బయటికి వచ్చారు కవిత. ఆ తర్వాత… ఒకవైపు తన తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారామె. దీంతో… ఇప్పుడు కవిత పార్టీలో చేరబోయే వాళ్లు ఎవరన్నది ఇంట్రస్టింగ్‌ సబ్జెక్ట్‌ అయింది. పార్టీ ప్రకటన వేదిక మీదనే పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్ట్‌లను చేర్చుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో… తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పేరుతో పార్టీ పెట్టినప్పుడు కూడా మొదట్లో ఇదే ఫార్ములాను అనుసరించారు. అప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలను కాకుండా… అడవుల నుంచి జనాల్లోకి వచ్చిన మాజీ మావోయిస్టులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారాయన. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతున్నట్టు చెబుతున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు.

కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలో మొదట్లోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటే…. ఊపు వస్తుందని, అదీకూడా ఇప్పటికే వేరే పార్టీలో ఉండి ఏదో ఒక రాజకీయ ముద్ర వేసుకున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళయితేనే బెటర్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో మాజీ మావోయిస్టులను ఉంటారని సమాచారం. పీడిత ప్రజలు, శ్రామిక వర్గాల కోసం అడవుల బాట పట్టిన అన్నలు ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వాళ్లు తమ కోసం పోరాడిన వాళ్ళుగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయిలో ఆ ఇమేజ్‌ ఉంటుందని, అలాంటి మాజీ మావోయిస్ట్‌లను చేర్చుకుంటే….తమకు బాగా కలిసివస్తుందని కవిత టీమ్‌ ఆలోచిస్తోందట. తెలంగాణ మారుమూల ప్రాంతాలతో పాటు పల్లెల్లో మావోయిస్టుల మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అలాంటివాళ్ళను ఇప్పుడు పార్టీలోకి తీసుకుని అవే ప్రాంతాల్లో నాయకులుగా నిలిపితే కొత్త పార్టీకి బాగా ప్లస్‌ అవుతుందన్నది కవిత లెక్కగా తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో లొంగిపోయిన వాళ్ళతో పాటు గతంలో లొంగిన వాళ్ళను కూడా పార్టీ ప్రకటన టైమ్‌లోనే జాయిన్‌ చేసుకోవాలని భానిస్తున్నారట. తమ పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకుంటామని చెప్తున్న కవిత… మాజీ మావోయిస్టులను తీసుకోవడం ద్వారా తన కల నెరవేరుతుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా.. భవిష్యత్‌ రాజకీయం మాదేనని అంటున్నారు జాగృతి నేతలు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వం గురించి పోరాడే పార్టీ ఏదీ లేదని, అందుకే తెలంగాణ పేరుతో ఏర్పాటయ్యే తమ పార్టీలోకి కొత్త వాళ్లను, ముఖ్యంగా మాజీ మావోయిస్టులను ఆహ్వానిస్తున్నామన్నది జాగృతి నేతల మాట. బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌ వార్‌లోకి దిగాలని ఇప్పటికే ఉత్సాహంగా ఉన్న మాజీ మావోయిస్ట్‌లు కవిత పార్టీకి జై కొడతారా లేదా అన్నది కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అంశం అంటున్నారు తెలంగాణ పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version