OTR : కరీంనగర్ కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.! మంత్రుల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ బలహీనమైందా?

Karimangar

Karimangar

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ గ్రూపులుగా విడిపోయిందా?పార్టీని బలోపేతం చేయటంలో మంత్రుల పాత్ర ఏంటి?ఆధిపత్య పోరులో పార్టీ నష్టపోయినా డోంట్‌ కేర్ అంటున్నారా?వరుసగా మూడుసార్లు మూడో స్థానానికి పరిమితమైనా నేతలు మారకపోవటానికి కారణం ఏంటి?అసలు…గ్రూపు తగాదాలకు ఆజ్యం పోస్తున్నదెవరు? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2004 తర్వాత కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. 2009లో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. వరుసగా మూడు ఎన్నికల్లోనూ మూడో స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల వరకు కరీంనగర్ అసెంబ్లీకి పెద్దదిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. దీంతో ఇక్కడ నాయకత్వ కొరత ఏర్పడిందనే టాక్‌ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకోలేకపోయారు పార్టీ నేతలు. లీడర్ల మధ్య కొట్లాటల వల్లే కార్పొరేషన్‌ను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయట. అయినప్పటికీ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోలేదు.

వాయిస్‌-ఇక…ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలను పరిశీలించాలని కోరుతున్నారట కార్యకర్తలు. కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ గ్రూపులుగా విడిపోయి ఉందని తెలుస్తోంది. ఇక్కడ సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు ఇంచార్జిని ప్రకటించారు. ఎన్నికల్లో తక్కువ సీట్లకు పరిమితం కావడానికి ఇది కూడా ఓ కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇంచార్జిగా రాజేందర్ రావు నియామకాన్ని జిల్లా నేతలు పైకి వ్యతిరేకించకపోయినా లోపల మాత్రం వాళ్లు చేయాల్సింది చేశారని టాక్‌. రాజేందర్ రావు వ్యవహార శైలి కూడా అందర్నీ కలుపుకుపోయేలా లేదని పలుమార్లు సీనియర్లు గొడవ పడ్డారని తెలుస్తోంది. ఎన్నికల ముందు అందరూ కలిసి పని చేయాల్సిన తరుణంలో గ్రూపు వార్ పార్టీకి తీరని నష్టం చేసిందనే అభిప్రాయం ఉంది. ఇతర పార్టీల సాయంతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని మంత్రులు రంగంలోకి దిగినా..సమీకరణాలు అనుకూలించక అభాసుపాలయినంత పనైంది అమాత్యులకు. కరీంనగర్‌లో పార్టీ ఎదగకపోవటానికి…మంత్రుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణంగా మారాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి కాంగ్రెస్ సర్కిల్స్‌లో. మంత్రులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు గ్రూపులను పెంచి పోషిస్తున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

×
×
Ad

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న వెలిచాల రాజేందర్‌రావుతో..మంత్రుల అనుయాయులు టచ్‌ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారని తెలుస్తోంది. నిన్నామొన్నటి వరకు ఉప్పూనిప్పూలా ఉన్న ఇద్దరు మంత్రుల అనుచరులు ఇప్పుడు కలిసిపోవడం ఆసక్తికరంగా మారిందని సమాచారం. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మంత్రులు సూచించిన వారికి కాకుండా వెలిచాల వర్గీయుడికి కట్టబెట్టటం విభేదాలు పెరగటానికి కారణమని తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించడం రుచించడం లేదనే టాక్‌ నడుస్తోంది.

ఇక…ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన విద్యాసంస్థల అధినేత ఆల్పోర్స్ నరేందర్‌రెడ్డి సడన్‌గా స్క్రీన్‌పైకి వచ్చారు. ఆయన పొలిటికల్‌గా యాక్టివ్ కావడం ఆసక్తికర చర్చకు దారితీసింది. నామినేటెడ్ పదవిపై గురిపెట్టిన ఆయన…నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారట. తనకు శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్ ఆథారిటీ చైర్మన్‌గా చాన్స్ ఇవ్వాలని కోరినట్టు పొలిటికల్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి ఇద్దరు మంత్రులతో మంచి సంబంధాలే ఉన్నాయని సమాచారం.

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి గాడ్‌ఫాదర్స్ లేకుండా సాధ్యం కానే కాదనే విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఆ ఇద్దరు మంత్రులు అసమ్మతికి మరింత ఆజ్యం పోస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోందట. కార్పొరేటర్ టికెట్ల విషయంలో వాళ్లు తమకు నచ్చినవారికే ఇవ్వడం వల్ల పది చోట్ల పార్టీ ఓడిపోయిందని కేడర్‌లో అసంతృప్తి ఉంది. మళ్లీ ఇప్పుడు పంతాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ద్వితీయ శ్రేణి నేతలు. మరి…ముఠా కుమ్ములాటలకు పార్టీ పెద్దలు ఎలా చెక్‌ పెడతారు?అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.