ఆ మంత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా? ఏకంగా రెండు నియోజకవర్గాల్లో అగ్గి అంటుకుందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా రగిలిపోతున్న రెండు వర్గాలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పుడు చెలరేగుతున్నాయా? మంత్రి బర్త్ డే అయితే… కూటమి కేడర్ కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టిన రోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కూటమిలో చిచ్చుపెట్టాయట. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం ఉన్న రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో టీడీపీ, జనసేన నేతలు పరస్పరం భగ్గుమంటున్నట్టు చెప్పుకుంటున్నారు. దుర్గేష్ ఎమ్మెల్యేగా…. నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారాయన. మంత్రి కావడంతో రెండు నియోజకవర్గాల్లో ఆయన మాట చెల్లుబాటవుతోంది. అలాగే… ఈ రెండు చోట్ల టీడీపీ, జనసేన మధ్య అస్సలు సఖ్యత ఉండటం లేదట. చాలా రోజుల నుంచే కోల్డ్‌వార్ నడుస్తుండగా… ఇటీవల మంత్రి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అది ఓపెనైపోయింది. ఎంతైనా… మంత్రిగారు కదా… అందుకే, ఆయన అనుచరులు సార్ బర్త్‌డేని ఓ రేంజ్‌లో జరపాలనుకున్నారట. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు… మంత్రి పుట్టిన రోజు పేరుతో… రాజమండ్రి రూరల్, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎక్కడా వగలకుండా ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక్కడా ఇక్కడా అని లేకుండా ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టేశారు. సరే… పవర్ ఉంది కాబట్టి ఆ మాత్రం హంగామా సహజమేలే అనుకున్నా… కొందమంది మంత్రి మనుషులు చేసిన ఓవర్ యాక్షన్ కోల్డ్‌వార్ ఓపెన్ అయ్యేట్టు చేసిందట.
మంత్రి పుట్టిన రోజు కోసం తాము పెడుతున్న ఫ్లెక్సీలకు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో… రాజమండ్రి రూరల్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తీసి పక్కన పడేశారట స్థానిక జనసేన నాయకులు. అక్కడే అగ్గి అంటుకుంది. అడ్డుగా ఉంటే.. జస్ట్ తీసి పక్కన పెట్టాం అంతేనని జనసేన శ్రేణులు చెబుతుంటే… కాదు, కావాలనే చింపేశారు, పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇది చినికి చినికి గాలివానగా మారి రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అయితే… నాయకుల మధ్య అధికారులు చిచ్చు పెడుతున్నారంటూ సాక్షాత్తు నిడదవోలు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మన వెంకటేశ్వరరావు నిరసన వ్యక్తం చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. జనసేన ఫ్లెక్సీలు పెట్టుకుంటే పెట్టుకోమనండి… కానీ, తమ నాయకుల ఫోటోలు ఉన్న వాటిని చింపి కాలువలో పారేయడం ఏంటని అధికారుల్ని ప్రశ్నిస్తోంది టీడీపీ కేడర్. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలో టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫ్లెక్సీలను తొలగించారు. వాటిని తీయడం ఒక ఎత్తయితే… పబ్లిక్ యూరినల్స్ దగ్గర పడేయటంతో బాగా మండిపోయిందట టీడీపీ లీడర్స్‌కు. అది తల్చుకుని తల్చుకుని ఫైరైపోతున్నారట మాజీ మంత్రి అనుచరులు. అలాగే… గోరంట్ల ఫ్లెక్సీలను తొలగించి అదే స్థలంలో కందుల దుర్గేష్ ఉన్నవాటిని పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదాంగా మారుతోంది. కూటమి ప్రభుత్వంలో అగ్ర నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా… కింది స్థాయి నేతల్లో ఇలాంటి వ్యవహారాలు పెరుగుతూ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం రెండు వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే…. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చేజారిపోతాయన్న భయాలు కూడా పెరుగుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో…ఈ సమన్వయలోపం కొంపముంచుతుందన్న భయాలు కూడా ఉన్నాయి రెండు పార్టీల్లో. వెంటనే అగ్రనేతలు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే తర్వాత డ్యామేజ్ కంట్రోల్ సాధ్యం కాదంటున్నాయి తూర్పుగోదావరి రాజకీయ వర్గాలు.
