Site icon NTV Telugu

Off The Record : రాజకీయ పార్టీని ప్రకటించే దిశగా అడుగులు?

Kavitha

Kavitha

ఎమ్మెల్సీ కవిత చేపట్టిన యాత్ర ఎందుకోసం.. జాగృతి జనం బాట పేరుతో చేబట్టబోయే యాత్ర తర్వాత ఏం జరగబోతుంది. బి ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. యాత్ర తర్వాత కవిత ఏమి చేయబోతుంది. పార్టీ ఏర్పాటుకు యాత్ర అంకురార్పణ కాబోతుందా… వాచ్ దిస్ ఇస్ స్టోరీ.. జాగృతి జనం బాట చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రకరకాల డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నాలుగు నెలల పాటు 33 జిల్లాలను చుట్టే విధంగా టూర్‌ ప్లాన్‌ ఉండటంతో… ఆ తర్వాత కవిత తీసుకోబోయే నిర్ణయం ఏంటని మాట్లాడుకుంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకునేందుకే ఈ యాత్ర మొదలుపెట్టబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కవిత. ఇందుకోసం ఇప్పటికే తిరుమల వేంకటేశ్వర స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారామె. ప్రతి జిల్లాలో కనీసం రెండు రోజులుండి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం అవ్వాలన్నది కవిత ప్లాన్‌. అదంతా ఒక ఎత్తయితే… యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారా? ఆ విషయంలో జనం నాడి తెలుసుకునేందుకే ఇప్పుడు ఈ టూర్‌ పెట్టుకున్నారా అన్న అనుమానాలున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్‌, కేసీఆర్‌ ఫోటోలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామె. కానీ…ఈ యాత్రలో కేసీఆర్ ఫోటో పెట్టడం లేదని స్వయంగా కవితే ప్రకటించారు.

ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఒక పార్టీకి అధినేతగా ఉన్న కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సబబు కాదని చెప్తుండటాన్ని బట్టి చూస్తే…. తానో రాజకీయ పార్టీని పెట్టే దిశగా అడుగులేస్తున్నారా అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయట. పైకి జనం కోసం జాగృతి యాత్రగా చెబుతున్నా…. ఇది మాత్రం తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి సన్నాహక యాత్రగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవిత పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే… ఆ ప్రచారాన్ని ఆమె ధృవీకరించలేదు, అలాగని కొట్టిపారేయలేదు. అయితే ఇప్పుడు చేయబోతున్న ఈ యాత్ర మాత్రం పార్టీ ఏర్పాటుకు ముందస్తు సంకేతమేనని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… ఏదో… మఖలో పుట్టి పుబ్బలో పోయేలా కాకుండా…
జనాన్ని ప్రభావితం చేసేలా పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని, క్షేత్ర స్థాయి నుంచి పునాదుల్ని పటిష్టంగా వేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళేకంటే….ముందే సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్స్‌ ద్వారా… అసలు గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎంత పొలిటికల్‌ వ్యాక్యూమ్‌ ఉంది? కొత్త పార్టీ పెడితే… ఎలాంటి స్పందన వస్తుంది లాంటి అంశాలన్నిటినీ బేరీజు వేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

కొత్త పార్టీ జెండా అజెండా ఏ విధంగా ఉండాలన్నది కూడా ఈ యాత్రలో తెలుసుకుంటామని చెబుతున్నాయి కవిత సన్నిహిత వర్గాలు. అదే సమయంలో… ముందుగా జనాల్లోకి వెళ్ళడం వెనక… మరో వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. ముందే జనంలోకి వెళ్ళాను, వాళ్ళు కోరితేనే పార్టీ పెట్టానని చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఏర్పాటే అజెండాగా ఆవిర్భవించింది టీఆర్‌ఎస్‌. కానీ… ఇప్పుడున్న పరిస్థితులు వేరు, జనం ఆశలు, ఆకాంక్షలు వేరు. అందుకే క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి, ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని, ఒక అజెండా ఫిక్స్‌ చేసుకుని పార్టీని ప్రకటించాల్సిన అవసరం ఉందని, కవిత అదే పనిలో ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.
ఇప్పటికే బీసీ అజెండాను భుజానికెత్తుకున్నారు కవిత. దాంతోపాటు నిరుద్యోగం, రైతులు, మహిళల సమస్యలు కూడా కీలకం కాబోతున్నాయి. ఇలా… అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సరైన ఫీడ్‌ బ్యాక్‌తోనే పార్టీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానని గతంలోనే చెప్పిన కవిత… దీన్ని సన్నాహక యాత్రగానే చేస్తున్నారన్నది విస్తృతాభిప్రాయం.

Exit mobile version