తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇక సోలో ఫైట్‌కు డిసైడయ్యారా? చివరికి తండ్రి కేసీఆర్ బొమ్మ కూడా వాడుకోకూడదని డిసైడ్ అయ్యారా? తాను చేయబోతున్న జన యాత్రలో ఎక్కడా కేసీఆర్ ఫోటో ఉండబోదా? ఇన్నాళ్ళు తండ్రి ఫోటో పెట్టుకుంటానని చెప్పిన ఎమ్మెల్సీ…. ఇప్పుడు సడన్‌గా ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు బిజీగా ఉంటే… అదే సమయంలో ఆర్గనైజేషన్‌గా ఉన్న తెలంగాణ జాగృతి కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇన్నాళ్ళు.. బీఆర్‌ఎస్‌లోని మిగతా నేతలతో సంబంధాలు ఎలా ఉన్నా… కేసీఆర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు జాగృతి అధ్యక్షురాలు కవి. పైగా…కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఒక కన్ను అయితే… జాగృతి మరో కన్ను అని చెప్పుకొచ్చేవారు. కానీ… ఇప్పుడు టోన్ మారిపోయింది, తీరు తేడాగా కనిపిస్తోంది. ఫస్ట్ టైం కేసీఆర్ ఫోటో లేకుండా భారీ కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమయ్యారు కవిత. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పార్టీకి రాజీనామా చేశాక నిర్వహించిన రకరకాల కార్యక్రమాల్లో సైతం తెలంగాణ జాగృతి ఫ్లెక్సీల్లో.. ప్రొఫెసర్ జయశంకర్‌తో పాటు కేసీఆర్ ఫోటో కూడా ఉండేది. కానీ… ఇప్పుడు ఆ ఒక్క ఫోటో మిస్ అవడమే హాట్ టాపిక్ అయింది.
రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం త్వరలో తెలంగాణ జనయాత్ర ప్రారంభించబోతున్నారు కవిత. జాగృతి తరపున నిర్వహించబోతున్న తొలి అతిపెద్ద ప్రోగ్రామ్ ఇది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజైంది. తన తండ్రి కేసీఆర్‌కు జాగృతి రెండో కన్ను అని గతంలో చెప్పిన కవిత… ఇప్పుడు ఏకంగా పోస్టర్‌లో ఆయన బొమ్మ లేకుండా చేయడం ఏంటని క్వశ్చన్ మార్క్ పేసులు పెడుతున్నారు చాలామంది. అయితే.. కాస్త లోతుగా ఆలోచిస్తున్న వాళ్ళు మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చాలానే ఉందని అంటున్నారు. కవిత పార్టీ పెడతారన్న ప్రచారం పెద్ద ఎత్తునే జరుగుతోంది. గ్యారంటీగా పెడతారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. దాని గురించి రోజూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడే సమస్య వస్తోందట. కేసీఆర్ ఎంత కవితకు తండ్రి అయినా…. ఆయన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు. అలా… ఒక పార్టీ అధ్యక్షుడి ఫోటోను మరో పార్టీ కార్యక్రమాల్లో పెట్టడం కరెక్ట్ కాదన్న ఉద్దేశ్యంతో….. ఇప్పటి నుంచే జాగ్రత్త వహిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. పైగా… కేసీఆర్ బొమ్మ పెట్టుకుని జనంలోకి వెళ్ళి… తాను ఏం చేసినా, ఎంత చేసినా ఆ షాడో ఉంటుందే తప్ప పర్సనల్ ఎలివేషన్ ఉండదన్న సలహాలతోనే… నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటున్నారు. దానివల్ల అనవసరంగా ట్రోల్ అవుతానన్న ఆలోచన సైతం ఉండి ఉండవచ్చంటున్నారు.
ఇలా రకరకాల కోణాల్లో ఆలోచించే… కవిత తండ్రి బొమ్మ లేకుండా…ఒంటరిగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నాలుగు నెలల పాటు వివిధ జిల్లాల్లో యాత్రలు నిర్వహిస్తూ జనంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారు కవిత. ఇలాంటి సమయంలో కేసీఆర్ ప్రస్తావన లేకుండా తిరిగితే… ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారని, అందుకే… బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఫోటోను తన జాగృతి పోస్టర్స్‌లో తీసేసినట్టు సమాచారం. ఒకవేళ బీఆర్‌ఎస్ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఏదన్నా వ్యతిరేకత ఉన్నా… ఆ ప్రభావం తన మీద పడకుండా తీసుకుంటున్న జాగ్రత్త కూడా అయి ఉండవచ్చన్నది ఇంకొందరి విశ్లేషణ. ఇప్పుడు తాను కేసీఆర్ బొమ్మ పెట్టుకుని యాత్ర చేస్తే…. రేపు తాను పెట్టబోయే కొత్త పార్టీకి వచ్చే మైలేజ్ కన్నా… బీఆర్‌ఎస్‌కే ప్లస్ అవుతుందన్న లెక్కలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. గులాబీ షేడ్ నుంచి బయటపడి తన కాళ్ళ మీద తాను నిలబడి…. సొంత ప్రయాణం ప్రారంభించాలనుకంటున్న క్రమంలోనే… కేసీఆర్ గుర్తు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చన్నది ఇంకొందరి అభిప్రాయం. ఇక్కడే ఇంకో లాజిక్ కూడా చెబుతున్నారామె. తెలంగాణ జాగృతిని ప్రారంభించినప్పుడు అందులో కేసీఆర్ ఫోటో లేదని, తాను బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యాకే వచ్చింది కాబట్టి… ఇప్పుడు ఆ పార్టీతో సంబంధాలు తెగిపోయాక ఆ ఫోటో కూడా అవసరం లేదన్నది ఆమె లాజిక్. ఆమె లాజిక్ సంగతి ఎలా ఉన్నా… కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభావం లేని కవిత ప్రయాణం ఎలా ఉండబోతోంది? రేపు ప్రసంగాల్లో ఆమె గత ప్రభుత్వ తప్పిదాలను సైతం ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి మాత్రం రాజకీయవర్గాల్లో పెరుగుతోంది.
