Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే భారీగా జూబ్లీ హిల్స్ పోల్స్ కి నామినేషన్లు?

Jubilee Hills

Jubilee Hills

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం భారీ స్థాయిలో నామినేషన్స్‌ దాఖలవడం దేనికి సంకేతం? అది ప్రభుత్వం మీద వ్యతిరేకతా? లేక తెర వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా? నామినేషన్స్‌ వేసిన వందల మంది చివరిదాకా ఎన్నికల బరిలో ఉంటారా? ఒకవేళ ఉంటే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. నామినేషన్స్‌ దాఖలుకు చివరి రోజైతే…ఒక చిత్రమైన సీన్‌ కనిపించింది. నామినేషన్‌ వేసేందుకు వెల్లువలా తరలి వచ్చారు అభ్యర్థులు. మంగళవారం సాయంత్రం మూడు గంటల్లోపు నామినేషన్‌ వేయాల్సి ఉండగా… ఆ టైంకు క్యూలో ఉన్న అభ్యర్థులందరి నుంచి అధికారులు పత్రాలు స్వీకరించేసరికి బుధవారం తెల్లవారు ఝాము అయింది. ఆ విధంగా మొత్తం 321 నామినేషన్స్‌ పడటం చూసి అవాక్కవుతున్నారు అంతా.

జూబ్లీహిల్స్‌ లాంటి చోట ఆ స్థాయిలో అభ్యర్థులు అన్నది అసాధారణమని, దీని వెనక ఏదో ఉందన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. తొలి 6 రోజుల్లో 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్క చివరి రోజునే 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్స్‌ వేశారు. ఇదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. ఇక్కడ పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్‌, రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పోటా పోటీగా బరిలో దిగారు. ఇందులో రీజినల్ రింగ్ రోడ్ బాధిత రైతులే 180 మందికి పైగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్‌తో భూములు కోల్పోతున్న రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దిగి నిరసన వ్యక్తం చేస్తుండడం గురించి ఇప్పుడు హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

ఇదే క్రమంలో ఫార్మా సిటీ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు, మాల మహానాడు నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు…. ఇలా చాలా మంది ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు దీన్నో వేదికగా ఎంచుకుంటున్నారట. దీంతో రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్న నిరసనకు ఇది సంకేతమని ప్రతిపక్షాలు వాదిస్తుండగా…. ఇంతమంది బరిలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా లబ్దిపొందేది అధికార పార్టీ అభ్యర్థే కదా అన్నది ఇంకొందరి మాట. ఎవరి వాదనలు ఎలా ఉన్నా… నిరసన తెలపడానికి బాధితులకు ఇదో మంచి అవకాశమన్నది మాత్రం విస్తృతాభిప్రాయం. అయితే… ఇంత భారీ స్థాయిలో దాఖలైన నామినేషన్స్‌లో ఎక్కువ శాతం స్క్రూటినీలో పోతాయన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈనెల 24 వరకు ఉపసంహరణ గడువు ఉండటంతో మరి కొందరు తప్పుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. గతంలో రెండు సందర్భాల్లో ఇలా బల్క్‌ నామినేషన్స్‌ పడ్డాయి. 1995లో నల్గొండ ఎంపీ స్థానానికి రికార్డు స్థాయిలో 537 నామినేషన్లు దాఖలయ్యాయి. ఫ్లోరైడ్ సమస్యను అప్పటి ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా 480 మంది బాధితలు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పసుపు రైతులు179 మంది నామినేషన్లు వేశారు. దాంతో అప్పుడు ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అదే క్రమంలో ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ బాధిత రైతులతో పాటు ఫార్మా సిటీ రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు భారీగా నామినేషన్లు వేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది.

దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. తెల్లవారుఝాముదాకా క్యూలో నిలబడి నామినేషన్‌ వేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్దేశ్యం ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడమే. కాబట్టి అది కాంగ్రెస్‌కే నష్టం అన్నది బీఆర్‌ఎస్‌ వాదన. బరిలో ఉన్నవాళ్లంతా రేపు నియోజకవర్గమంతటా తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే… అంతిమంగా అది తమకే ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారట కారు పార్టీ పెద్దలు. నామినేషన్‌ వేసిన వాళ్ళంతా…తమ వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు తెచ్చుకోలేకపోయినా… వాళ్ళ ప్రచారంతో మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందని, అప్పుడు ప్రత్యామ్నాయంగా మేమే కనిపిస్తామన్నది బీఆర్‌ఎస్‌ నాయకుల లెక్క. అదే సమయంలో అసలు ఈ బల్క్‌ నామినేషన్స్‌ వెనక అదృశ్య శక్తి ఉందని, అది బీఆర్‌ఎస్సే అయి ఉండవచ్చన్న ప్రచారం సైతం జరుగుతోంది. మరోవైపు స్వతంత్ర అభ్యర్ధులను పోటీ నుంచి తప్పించే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే… ఎక్కువ మంది ఏదో వేశామంటే వేశామన్నట్టుగా దరఖాస్తులు సమర్పించారని, సరైన పత్రాలు ఇవ్వకపోవడంతో… ఎక్కువ శాతం నామినేషన్స్‌ని తిరస్కరించే అవకాశం ఉందన్నది ఇంకో వెర్షన్‌. ఇలా… ఎవరి వాదన ఎలా ఉన్నా… ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 321 నామినేషన్స్‌ దాఖలవడం మాత్రం హాట్‌ టాపిక్‌ అయింది.

Exit mobile version