Site icon NTV Telugu

Off The Record : జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై రివర్స్ అటాక్ మొదలెట్టారా?

Jogi Ramesh

Jogi Ramesh

ఆ మాజీ మంత్రి రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టారా? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? అందుకే వాయిస్‌ రెయిజ్‌ చేస్తున్నారా? ఆ విషయంలో గవర్నమెంట్‌ పెద్దలు ఏమనుకుంటున్నారు? ఇంకీ ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో రివర్స్‌ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్‌ సబ్జెక్ట్‌ ఏదన్నా ఉందంటే….అది నకిలీ మద్యమే. దాన్ని బేస్‌ చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ, అసలు అందులో ఉన్నది కూడా మీ వాళ్ళేనంటూ… విపక్షం నోరు మూయించాలని టీడీపీ శత విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ తిరుగుతోంది వ్యవహారం. నకిలీ మద్యం తయారీ కేసులో ఆయన పేరు తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియోలో జోగి పేరును ప్రస్తానవించాడు. జోగి రమేష్ సూచనతోనే… తాను నకిలీ మద్యం తయారు చేశానని చెప్పటంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. వీడియో బయటికి వచ్చి… వారం రోజులు గడిచినా… ఏపీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌గాని, సిట్ గాని మాజీ మంత్రి మీద ఎలాంటి కేసు పెట్టలేదు. కానీ… ఆయన కేంద్రంగా రాజకీయాలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి.

ఊరికే అరాకొరా ఆరోపణలతో సరిపెట్టకుండా… స్వరం పెంచి ఆయన ప్రభుత్వం మీద రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ విడుదల చేసిన వీడియో తప్ప ఇప్పటి వరకు కేసులో జోగి ప్రమేయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అదే సమయంలో నిందితుల లిస్ట్‌లో మాజీ మంత్రి పేరును చేర్చలేదు కూడా. సరిగ్గా ఈ పాయింట్‌నే తనకు అనుకూలంగా మల్చుుకుంటూ… తన వాయిస్‌ వీలైనంత ఎక్కువగా జనంలో వినిపించేలా ప్లాన్‌ చేస్తున్నారట జోగి రమేష్. తాను ఏ తప్పు చేయలేదు, ప్రభుత్వమే వేధిస్తోందని వాయిస్ రెయిజ్‌ చేస్తున్నారాయన. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ కేసులో తనను అక్రమంగా నిందితుడిగా చేర్చేందుకు ప్రయత్నిస్తోందంటూ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు. అదే విషయమై నేరుగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటంతో పాటు బీసీ కార్డ్‌ని కూడా బయటకు తీసి పలు ప్రాంతాల్లో తనకు మద్దతుగా కార్యక్రమాలను కూడా చేయించుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. ఒకవైపున తనకు సంబంధం లేదంటూనే… మద్దతుగా రాష్ట్రమంతటా కార్యక్రమాలను చేయిస్తూ… జోగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు నకిలీ మద్యం తయారీ కేసుని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… జోగి రమేష్ తీరును కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోందట. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసి 25 మంది నిందితులను అరెస్టు చేసిన ఇందులోని సొంత పార్టీ నేతల్ని కూడా ఉపేక్షించలేదు. దీనిద్వారా…ఈ విషయంలో తాము ఎంత సీరియస్‌గా ఉన్నామో చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అందుకే… తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న జోగి రమేష్ ఆరోపణల్ని కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇందులో మాజీ మంత్రి పాత్రకు సంబంధించిన గట్టి ఆధారాలు సేకరించాలని ఇప్పటికే దర్యాప్తు అధికారుల్ని ఆదేశించినట్టు సమాచారం. జోగి చేస్తున్న రివర్స్ ఎటాక్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కచ్చితంగా కీలకమైన ఆధారాలను సేకరించాల్సిందేనని, ఆ తర్వాతనే ఆయన్ని నిందితుడిగా చేర్చమని స్పష్టమైన ఆదేశాలు అందాయట ఎక్సైజ్ శాఖ అధికారులకు. దీంతో కాస్త టైం తీసుకున్నా… కేసును పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారట దర్యాప్తు అధికారులు. అయితే… ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం మీద వీలైనంత ఎక్కువగా రివర్స్‌ అటాక్‌ చేసివత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారట ఎక్స్‌ మినిస్టర్‌. ఈ రసవత్తరమైన ఆటలో చివరికి ఎవరికి పైచేయి అవుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version