పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందినకాడికి కుమ్మేస్తున్నార్రా నాయనో…. అని ఇన్నాళ్లు నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోని ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సడన్‌గా సీరియస్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పినా… వినిపించుకోని సదరు శాసనసభ్యుడు ఇప్పుడు బోధి వృక్షం కింద కూర్చున్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. పైగా తాను మోసపోయానని…. నమ్మిన వాళ్ళే ముంచారంటూ అమాయకపు ఫేస్ ఒకటి. పొలిటికల్ నవరసాలు పండిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనలో మార్పునకు అమరావతి నుంచి వచ్చిన ఆఫరే కారణమా? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నట్టుండి గాఢ నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేచారట. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో తన అనుచరులు చేస్తున్న అరాచకాలన్నీ కలలోనే అనుకుని ఇప్పుడు సడన్‌గా వాళ్ళందర్నీ కంట్రోల్… కంట్రోల్ అంటున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆయన నిద్రపోయారా? లేక నిద్ర నటించారా అన్న సంగతి పక్కనపెడితే… ఈ ఆకస్మిక మార్పు గురించి మాత్రం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఏందబ్బా… ఈ మార్పు, మన ఎమ్మెల్యేకి ఏమైంది. ఎవ్వరూ తప్పు చేయవద్దు, అంతా సుద్దపూసల్లా ఉండాలంటూ అనుచరులకు చెబుతున్నారు. ఈ బుద్ధి ఇన్నాళ్ళు యాడికిబోయిందని ఆరా తీస్తే…. అసలు సిగ్నల్స్ అమరావతిలో ల్యాండ్ అవుతున్నాయట.
థామస్ వైఖరిలో ఆకస్మిక మార్పునకు కారణం ఆ ఒక్క ఆశేనని చెప్పుకుంటున్నారు. ఆ అతిపెద్ద అవకాశాన్ని మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశ్యంతోనే… సాంప్రదాయిని సుప్పిని అన్నట్టుగా ఉంటున్నారన్నది లోకల్ వాయిస్. థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆయన వైఖరి చాలా మారిపోయిందని చెప్పుకుంటున్నారు తమ్ముళ్లు. ఎలక్షన్‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళంతా ఎమ్మెల్యే చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని, ఆయన కూడా వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ రగిలిపోతున్నారు పాత తమ్ముళ్లు. అందుకు తగ్గట్టే….. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారన్నది నియోజకవర్గంలో బహిరంగ రహస్యం. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు, పాత టిడిపి నాయకులు మరో ఇద్దరు కలిసి చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కాదని సొంత పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. పెనుమూరు మార్కెట్ యార్ట్ చైర్మన్ కృష్ణమనాయుడు, మరో ముగ్గురు బాబు నాయుడు, శ్రీధర్ యాదవ్, హరీష్ యాదవ్ కలిసి అడ్డదిడ్డంగా దోచేస్తున్నారంటూ టీడీపీ కేడరే బహిరంగంగా మాట్లాడుకుంటోంది. దీనికి సంబంధించి రెండు నెలల క్రితం ఓ ఆడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది.అది మరవక ముందే ఇల్లీగల్‌గా పాలసముద్రంలో మండలంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన డ్రోన్ విజువల్స్‌ను సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి పంపారట.
అక్కడ కొండల్ని కొల్లగొట్టడంతో పాటు ఎస్ ఆర్ పురం, కార్వేటినగరం ,వెదురుకుప్పం మండలాల్లో గ్రానైట్ అక్రమ రవాణా కూడా యదేచ్చగా సాగుతోంది. వీటన్నిటినీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆ నలుగురే చేస్తున్నారన్నది జీడీ నెల్లూరు టీడీపీ కేడర్ మాట. మీ పేరు చెప్పి నలుగురూ… ఆ స్థాయిలో అరాచకాలు చేస్తున్నారంటూ కొందరు నాయకులు డైరెక్ట్‌గా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా… ఇన్నాళ్ళు పట్టించుకోలేదట ఆయన. పైగా రాజకీయ కక్షతో చేస్తున్నారన్న ట్యాగ్‌లైన్ ఒకటి తగిలించి ఆ నలుగుర్నీ అచ్చేసి వదిలేశారన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో. కానీ… తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు… ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆవలకొండ గ్రామానికి చెందిన కొందరు రైతులకు చెందిన 90 ఎకరాలపైగా భూమిని ఓ సంస్థకు అప్పగించేలా ఈ నలుగురు ప్లాన్ చేసి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తమకు అన్యాయం చేశారంటూ రైతులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేదాకా ఆయనకు విషయం తెలియలేదట. తీరా తెలిసి ఆయన అవాక్కయి నోరెళ్ళబెట్టినట్టు తెలిసింది. ఆ సంగతి ఎమ్మెల్యేకు ముందే తెలుసా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఆ టైంలో మాత్రం మంచి డ్రామా పండిందని చెప్పుకుంటున్నారు. థామస్ సడన్‌గా మేల్కొని అనుచరుల్ని కంట్రోల్ చేయడానికి అదొక కారణం అయితే… అంతకు మించిన అసలు సిసలైన రీజన్ వేరే ఉందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
ఈసారి రాష్ట్ర మంత్రివర్గంలో జరిగే మార్పు చేర్పుల్లో నీ పేరు పరిశీలించవచ్చని, ఎస్సీ కోటా కింద రేస్‌లో ఉన్నావంటూ ఎమ్మెల్యేకు లీక్ వచ్చిందట. అప్పుడు నెగెటివ్ మార్కులు పడకుండా ఉండాలంటే… ఇప్పట్నుంచే నియోజకవర్గంలో నీ కోటరీ చేస్తున్న అక్రమాలను ఆపేయమని లీకులిచ్చిన సదరు శ్రేయోభిలాషులు చెప్పినట్టు సమాచారం. దెబ్బకు అలర్ట్ అయిపోయిన థామస్… కొన్నాళ్ళు మీరంతా ఆగండ్రా బాబూ…. మీవల్ల నా ఛాన్స్ మిస్ అయ్యేట్టు ఉందంటూ దందాలు చేస్తున్న అనుచరుల్ని వారిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దందాల డబ్బుతో ఓ నేత ఖరీదైన కారు కొంటే… హరీష్ యాదవ్ తన పుట్టినరోజు నాడు నియోజవర్గం మొత్తం తానే బాస్ అంటూ బ్యానర్లు వేసుకోవడం కూడా థామస్‌కు కోపం తెప్పించిందని అంటున్నారు. ఇక లాభం లేదనుకుని నలుగురిని పిలిచి తీవ్రస్థాయిలో హెచ్చరించారట. అక్కడితో ఆగకుండా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి రైతులకు న్యాయం చేయాలని, తమ నేతలు తప్పు చేసి ఉంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరినట్టు టాక్ నడుస్తోంది. ఇదంతా చూస్తున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం…మొత్తానికి అమరావతి లీక్స్ గట్టిగానే పని చేస్తున్నట్టున్నాయంటూ చమత్కరించుకుంటున్నారు. మార్పు మంచిదే అంటూ తెగ సంతోషపడిపోతున్నారు. థామస్‌కు రేపు మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది వేరే సంగతిగానీ… దాని కోసం ఆయన అనుచరులకు బ్రేక్స్ వేయడం మాత్రం హ్యాపీగా ఉందని మాట్లాడుకుంటున్నారు లోకల్‌గా.
