పార్టీకి బలం ఉన్నచోట… కేడర్ ఉంటే చాలు లీడర్స్‌తో పనేముందని జనసేన అధిష్టానం భావిస్తోందా? సైనిక బలగం ఎంతున్నా… నడిపే దళపతి ఒకడు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిందా? అందుకే తనకు పట్టున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్‌ల నియామకాన్ని విస్మరించిందా? ఓవైపు లీడర్స్ కొరతతో సతమతం అవుతూ మరోవైపు ఉన్నవాళ్లని వరుసబెట్టి సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉంటే… వాటిలో సగం నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్‌లు లేరు. 2024 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో దూరం అయ్యారు ఆ నాయకులు. కానీ… భర్తీ దిశగా… అధిష్టానం ఏ మాత్రం ఆలోచించడం లేదన్నది కేడర్ అసహనం. అది చాలదన్నట్టు ఉన్న వాళ్ళు కూడా వరుసగా సస్పెండ్ అవుతున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ… ఇప్పటికే రాజమండ్రి, ప్రత్తిపాడు ఇన్ఛార్జ్‌లను పదవుల నుంచి తప్పించింది జనసేన అధిష్టానం. ఇక తాజాగా… కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యనేత టీవీ రామారావుపై వేటు పడింది.
స్థానిక టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా… రాస్తారోకో చేశారు టీవీఆర్. సహకార సంఘాల నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనను అవమానించారన్నది ఆయన కంప్లయింట్. నియోజకవర్గంలో మొత్తం 14 సొసైటీలు ఉండగా… మండలానికి ఒకటి చొప్పున మూడు అధ్యక్ష పదవుల్ని తమకు ఇవ్వాలని అడిగారు జనసేన నాయకులు. కానీ… ఒక్కటి మాత్రమే ఇచ్చి… మిగతా 13 సొసైటీల పాలకమండళ్ళను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీవీ రామారావు…. రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందంటూ తమ పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా తమకు న్యాయం చేయాలంటూ… జన సైనికులతో కలిసి రాస్తారోకో చేశారాయన. వెంటనే రియాక్ట్ అయిన హైకమాండ్… ఆయన్ని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేసింది.
ప్రస్తుతం దీని గురించే… తీవ్రంగా చర్చించుకుంటున్నాయి జిల్లా జనసేన వర్గాలు. మరోవైపు మేలో హరిహర వీరమల్లు థియేటర్స్ బంద్ వివాదం ఏర్పడినప్పుడు రాజమండ్రి సిటీ జనసేన ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణను పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఆ ఎపిసోడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న రాజమండ్రి జనసేన ఇన్చార్జే అంతా చేశారని ప్రకటించారు దిల్‌రాజు. దీంతో… మరో ఆలోచన లేకుండా ఆయన్ని పక్కన పెట్టేసింది పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి సిటీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి సత్యనారాయణను సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయమని, ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఆయన వివరణ కూడా అడగలేదని ఇప్పటికీ విమర్శలున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత జనసేనలో క్రియాశీలకంగా ఉండి చివరికి తన రాజకీయ భవిష్యత్తును కోల్పోయారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తమ్మయ్య బాబు సైతం ముందు నుంచి జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలితో దురుసుగా మాట్లాడినందుకు ఇటీవలే ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు చోట్ల జనసేన శాసనసభ్యులు ఉన్నారు. మిగతా చోట్ల గట్టి నాయకులను ఇన్ఛార్జ్‌లుగా నియమించి పార్టీని పటిష్టం చేసే దిశగా… అధిష్టానం ఆలోచించడం లేదన్నది జనసేన కార్యకర్తల ఆవేదనగా చెప్పుకుంటున్నారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారా? అదే నిజమైతే… అప్పటికప్పుడు బలమైన నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? దెబ్బ తింటాం అన్నది ఉమ్మడి తూర్పుగోదావరి జనసైనికుల ఆవేదన అట.
