OTR : జనసేనలోకి అవంతి ఎంట్రీ? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!

Janasena

Janasena

 

ట్రెండ్‌కి తగ్గట్టు ఎప్పటికప్పుడు పొలిటికల్‌ ప్లేగ్రౌండ్‌ మార్చే ఆ మాజీ మంత్రి ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారా? ఇప్పటి వరకు తాను ఎంట్రీ ఇవ్వని పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారా? ఆ మాజీ మంత్రి రాజకీయ గమ్యస్థానం ఫిక్స్‌ అయింది, ఇక పార్టీ మారే ముహూర్తమే మిగిలి ఉందన్న ప్రచారం నిజమేనా? ఎవరా ఎక్స్‌ మినిస్టర్‌? ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? రాజకీయాల్లో ఎంత ఎక్కువ సహనంతో ఉంటే అంత మంచి పదవులు దక్కుతాయన్నది విస్తృతాభిప్రాయం. అందుకు చాలా ఉదాహరణలు కూడా కనిపిస్తుంటాయి. అదే సమయంలో దుందుడుకు నిర్ణయాలు తీసుకుని దెబ్బతిన్న వాళ్ళకు కూడా కొదవలేదు. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకుని సమయానుకూల నిర్ణయాలు తీసుకునే ఉత్తరాంధ్ర పొలిటికల్‌ లీడర్స్‌లో ఒకరు అవంతి శ్రీనివాస్. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే స్పందించిన అవంతి… రీఛార్జ్‌ మోడ్‌లోకి వచ్చారన్న సంగతి ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్న చర్చలు ఇంకా ఇంట్రస్టింగ్‌గా జరుగుతున్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అలియాస్‌ అవంతి శ్రీనివాస్‌ మూడు సార్లు మూడు వేరువేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికలకు ముందు పోటీ చేసే సీటే కాదు, గెలిచే పార్టీ మీద ఆయన పర్ఫెక్ట్ సర్వేలతో రంగంలోకి దిగుతారనే ప్రచారం ఉంది. మెగాస్టార్‌గా చిరంజీవి ఊపు, కాపు ఫ్యాక్టర్ లెక్కలేసుకుని 2009లో తొలిసారి భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగి గెలిచారు అవంతి. తర్వాత 2014లో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2019లో వైసీపీలో చేరిన శ్రీనివాస్‌… పట్టుబట్టి మరీ భీమిలి అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో మూడు స్థానాలు వైసీపీ గెలుచుకోగా నాలుగు సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. పెందుర్తి, గాజువాక నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం కావడం, కాపు ఈక్వేషన్‌తో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఛాన్స్‌ కొట్టేశారాయన. నాడు మూడేళ్లు జిల్లాలో ఏకైక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఈ సమయంలో టీడీపీ, జనసేనలను విపరీతంగా టార్గెట్ చేసేవారు అంతి. ఆ విషయంలో సొంత సామాజికవర్గంలో వ్యతిరేకత వచ్చినా… పార్టీ లైన్ మాత్రం తప్పలేదనే నమ్మకాన్ని అధినాయకత్వానికి కలిగించగలిగారని అంటారు. దాంతో ఇక కప్పదాట్లు ఉండబోవని, ఫ్యాన్‌ పార్టీకి ఫిక్స్ అయ్యారనే అంతా ఊహించారు.

×
×
Ad

కానీ… 2024 ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కొత్త ఆప్షన్ ఎంచుకున్నారు ఈ మాజీ మంత్రి. వైసీపీ వైఫల్యాలను ఏకరువు పెట్టి మరీ బయటకు వచ్చారు. రాజకీయాల్లో తీరిక లేని కారణంగా ఫ్యామిలీ బిజినెస్ అయిన విద్యా సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయానని సన్నిహితులతో చెబుతూ వచ్చారు. దీంతో ఎన్నికలు సమీపించే వరకు ఆయన అదే స్టాండ్‌లో ఉంటారని అంతా భావించారు. కానీ… అవంతి మాత్రం అంతర్గతంగా కూటమి పార్టీలతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారట. ఆ దిశగా టీడీపీ, బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు చాలాకాలం ప్రచారం జరిగింది. అయితే, తనకు పొలిటికల్ విక్టరీని పరిచయం చేసిన చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న పరిచయాల కారణంగా జనసేన వైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. ఇందుకు రెండు కారణాలను కూడా చెబుతున్నారు కొందరు. ఒకటి నియోజకవర్గ పునర్విభజన కాగా… రెండోది పోటీకి అనువైన స్థానం ఎంపిక. అలాగే… మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తే బాగుండునని కూడా ఆశిస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… భీమిలి రెండు సెగ్మెంట్స్‌ అవుతుందని అంటున్నారు. వాటిలోని ఒక సీటులో తాను పోటీ చేసే ఛాన్స్‌ వస్తుందన్నది అవంతి లెక్క అట. అలాగే అనకాపల్లి జిల్లా పరిధిలో కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలన్నది ఆయన సెకండ్‌ ఆప్షన్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం తాను రాజకీయంగా న్యూట్రల్ అని బయటికి స్టేట్మెంట్ ఇస్తున్నా… లేటెస్ట్‌గా తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర బయటపెడుతున్నారట. దాన్నిబట్టి చూస్తే…జనసేన వైపు అడుగులేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేస్తుందన్న అభిప్రాయమైతే చాలా మందిలో ఉంది. దాంతో గ్లాస్‌ పట్టుకుంటే సేఫ్‌గా ఉంటామని మాజీ మంత్రి అనుకుంటున్నట్టు సమాచారం. అలాగే… జనసేన అధిష్టానానికి కూడా మొదట్లో అవంతి మీద ఉన్న అభిప్రాయం మారినట్టు తెలుస్తోంది. బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. ఇటువంటి తరుణంలో అవంతి ఎంట్రీకి అడ్డంకులు ఉండకపోవచ్చని, చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యే అవకాశాలే ఎక్కువంటూ పార్టీ వర్గాలు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాయి.