Site icon NTV Telugu

Off The Record : ఆ ఎంపీకి ఎమ్మెల్యేలతో విభేదాలు పెరుగుతున్నాయా..?

Tdp

Tdp

మాకేంటంట…. అహ… అసలు మాకేంటంట… అంటూ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తెగ రెచ్చిపోతున్నారట ఆ ఎంపీ మనుషులు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నాకు తెలియాలి… తెలియాలి… తెలియాలి… అంటూ ఎంపీ రీ సౌండ్‌లో డైలాగ్‌ చెబుతుంటే…. ఆయన అనుచరులు మాత్రం ఇసుక, బుసక, సిలికా ఏదైనా సరే… మా వాటా మాకు రావాల్సిందేనని అంటున్నారట. ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉందా పరిస్థితి? ఎవరా ఫస్ట్‌టైం ఎంపీ?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఈ సీటు పరిధిలోకి వస్తాయి. అందుకే బాపట్ల ఎంపీకి రెండు ఉమ్మడి జిల్లాల్లో గుర్తింపు ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున రిటైర్డ్‌ ఐపీఎస్‌ తెన్నేటి కృష్ణప్రసాద్ గెలిచారు. మొదట్లో ఆల్‌ ఈజ్‌ వెల్‌… అబ్బో…. సూపర్‌ అనుకున్నా… రాను రాను కాకరకాయ కీకరకాయ అవుతోందట. ఎంపీ సాబ్‌కు మెల్లిగా తన పరిధిలోని ఎమ్మెల్యేలతో విభేదాలు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందరికంటే ముందుగా… బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మతోనే చెడిందట. నిబంధనలకు విరుద్ధంగా బాపట్లలో రియలెస్టేట్‌ వెంచర్స్‌ వేస్తున్నారన్న విషయం తెలిసి ఎమ్మెల్యే నరేంద్రవర్మ వారికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కొంతమంది రియల్టర్లు డైరెక్ట్‌గా ఎంపీ కృష్ణప్రసాద్ వద్దకు వెళ్లారని, ఆ తర్వాతి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విబేధాలు మొదలయ్యాయన్నది స్థానికంగా చెప్పుకుంటున్న మాట. ఇక నియోజకవర్గంలో బుసక తవ్వకాలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య విబేధాలు మొదలయ్యాయట. ఈ వ్యవహారంలో అధికారులు ఎమ్మెల్యే వర్గీయులకు మద్దతు పలికారంటూ ఎంపీ తీవ్రంగా ఫైరైపోయినట్టు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత లిక్కల్ షాపుల వ్యవహారంలో కూడా రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్టు సమాచారం. బాపట్ల సెగ్మెంట్‌ వరకు పరిస్థితి ఇలా ఉంటే…. పక్కనే ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా ఎంపీ మనుషులకు విబేధాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

అక్కడ సిలికాన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం. తన పార్లమెంట్ సీటు పరిధిలో జరిగే విషయాలన్నీ తనకు తెలియాల్సిందేనంటూ…ఎంపీ హుకుం జారీ చేశారని, అక్కడే అసలు సమస్యలు మొదలవుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో… ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు, ఇదెక్కడి గొడవరా… బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు. అసలు ఎంపీలు ఎప్పుడైనా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకున్నారా.. అంటూ ఎమ్మెల్యే ఒకరు పార్టీ సీనియర్ నేతల దగ్గర వాపోయినట్టు తెలిసింది. సొంత పార్టీకి చెందిన ఎంపీ కావడంతో… ఏం చెయ్యాలో తెలియక సలహా ఇవ్వామని సహచర ఎమ్మెల్యేలను అడుగుతున్నారట ఈ పరిధిలోని శాసనసభ్యులు. అటు ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మరో సీనియర్ ఎమ్మెల్యే అనుచరులు జోరుగా రేషన్ బియ్యం దందా చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వర్గీయులు… అయితే మాకేంటంట అంటూ ఎమ్మెల్యే అనుచరుల దగ్గర పంచాయతీ పెట్టడంతో…. సదరు సీనియర్‌ ఎమ్మెల్యేనే షాక్‌ అయినట్టు తెలిసింది. ఆయన సీనియర్‌ కాబట్టి…. అది మీకు సంబంధంలేని వ్యవహారం, మా వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఎంపీ మనుషులకు వార్నింగ్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పైగా ఎంపీ వర్గీయుల తీరును పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే పార్లమెంట్ పరిధిలోని మరో రెండు నియోజకవర్గాల్లో కూడా ఎంపీ వర్గీయులు వేలు పెట్టాలని చూడ్డంతో… అక్కడున్న సీనియర్ ఎమ్మెల్యేలు స్మూత్‌గా డీల్ చేసి…… మా రింగ్‌లో మీ ఫింగర్‌ పెడితే… మొదటికే మోసం వస్తుంది, మొత్తం ఇరుక్కుపోతుందని చెప్పాల్సిన విషయాన్ని క్లారిటీగా వార్నింగ్‌ రూపంలో చెప్పేశారట.

ఆ దెబ్బకు ఆ సీనియర్స్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు ఎంపీ మనుషులు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇలా… ఎంపీ అనుచరులు నియోజకవర్గాల్లో జరుగుతున్న అనేక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని సొంతపార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికారం ఉంది కాబట్టి నియోజకవర్గాల్లో… మావాళ్ళేదో వాళ్ల తంటాలు వాళ్లు పడుతుంటే… మధ్యలో తగుదునమ్మాఅంటూ…ఎంపీ మనుషులొచ్చి మా సంగతేంటని చేతులు చాపడం కరెక్ట్‌ కాదన్నది శాసనసభ్యుల అభిప్రాయం అట. అసలు ఇప్పటివరకు ఇక్కడ ఎంపీ అనుచరులు వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకున్నారుగానీ… అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు ఈ కొత్త సాంప్రదాయాలు ఏంటని మండిపడుతున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇలా ఉంటే మిగతా నాలుగేళ్లు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు. మొత్తం మీద బాపట్ల ఎంపీ అనుచరుల వ్యవహారశైలిపై.. ఆ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారన్నది లోకల్‌ టాక్‌. తెలుగుదేశం అధిష్టానం దీనికి ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి మరి.

 

Exit mobile version