Site icon NTV Telugu

Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

Tdp

Tdp

తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కమీషన్ల కాక రేగుతోందా? కక్కుర్తిగాళ్ళంతా తోడై నియోజకవర్గ ముఖ్య నేత పేరు చెప్పి అందినకాడికి దోచేస్తున్నారా? చివరికి సొంత పార్టీ వాళ్ళని కూడా వదలకుండా మేం ఫలానా తాలూకా అంటూ ఇబ్బంది పెడుతున్నారా? కమీషన్‌ కొట్టనిదే ఏ పనీ జరగదని చెప్పుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏవి? మేం ఎమ్మెల్యే మనుషులం. ఇక్కడ మేం గీసిందే గీత, రాసిందే రాత. తేడా వస్తే… వెంచర్‌ వేయలేదు, వ్యాపారం చేయలేరు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో బిజినెస్‌ చేయాలనుకున్న వారికి ఇలాంటి వార్నింగ్సే వెళ్తున్నాయట. దీంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారన్న టాక్‌ గట్టిగా నడుస్తోంది. టీడీపీకి ఒకప్పుడు పెట్టని కోట పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడి నుంచి మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదుసార్లు గెలిచి రికార్డ్ సృష్టించారు. కానీ… 2004 నుంచి గడ్డుకాలం మొదలైంది. 2004, 2009 ఎన్నికల్లో సైకిల్‌ అభ్యర్ధులు ఓడిపోయారు. 2014లో తిరిగి ఆ పార్టీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు విజయం సాధించారు. 2024లో సైకిల్‌ గుర్తు మీద గెలిచారు సిట్టింగ్‌ శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు. అంతవరకు బాగానే ఉన్నా… ప్రస్తుతం ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళ వ్యవహారశైలి చర్చనీయాంశం అవుతోంది. గుంటూరు రూరల్ మండలానికి చెందిన ఓ నేత… ఎమ్మెల్యే పేరు చెప్పి గ్రావెల్ దందాకు తెరతీశారట. ఇక్కడ అక్రమ గ్రావెల్‌ వ్యాపారంలో ఆయనదే పైచేయి అన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పేరు చెప్పి మరీ…. అడ్డగోలుగా క్వారీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నేను ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్‌ని, నాకు తెలియకుండా ఆయన లెఫ్ట్‌ లెగ్‌ కూడా కదల్చరని చెప్పుకునే మరో లీడర్‌ నియోజకవర్గంలో కమీషన్ల యాపారం మొదలెట్టేశారట. సెగ్మెంట్‌ పరిధిలో ఎవ్వరు ఏం చేసినా… సార్‌కి సమర్పించుకోవాల్సిందేనని చెప్పుకుంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ రియలెస్టేట్‌ వ్యాపారి ఇటీవల నియోజకవర్గ పరిధిలో వెంచర్ వేశాడు.

నేను ఎమ్మెల్యే తాలూకా అంటూ… వ్యాపారి దగ్గరకు కూడా వెళ్ళిందట సదరు కమీషన్‌ కేరక్టర్‌. ఎకరాకు ఇంత అని డిమాండ్ చేయగా….. అంత ఇచ్చుకోలేను, ఎంతోకొంత అంటూ బేరమాడుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ అంతో ఇంతోకు కూడా ఇష్టంలేక జిల్లా టీడీపీ సీనియర్‌ నేత దగ్గరికి పరుగులు పెట్టారట వ్యాపారి. ఆ సీనియర్‌ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఇక తనకు ఆ వెంచర్‌ నుంచి కమీషన్ రాదని డిసైడై సైలెంట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా…. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో ఓ రియల్ వ్యాపారి ఐదెకరాల పొలానికి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. ఆ భూముల యజమానులైన రైతులు దాన్ని అడ్డుకోబోగా… వాళ్ళ మీద దాడి చేసి పంపేశారు. అది ముదిరి రాస్తారోకో దాకా వెళ్ళింది. ఆ రియల్ వ్యాపారి వెనుక కొంతమంది అధికారపార్టీ నేతలు ఉన్నారని, అందుకే అలా బరితెగించాడన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ కూడా పత్తిపాడు ఎమ్మెల్యే పేరుచెప్పే రైతుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డట్టు చెప్పుకుంటున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 8 డివిజన్లు ఉన్నాయి.

వీటిలో అభివృద్ధి పనుల టెండర్లలో ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి పూర్తిస్థాయిలో జోక్యం చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. మీరు జోక్యం చేసుకోవద్దంటూ…ఆ డివిజన్లకు సంబంధించిన తాజా మాజీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటున్న నేత హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తాము లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి గతంలో కార్పొరేటర్లుగా గెలిస్తే తమ డివిజన్లలో ఎమ్మెల్యే పేరు చెప్పి పెత్తనం చేయడం ఏంటని మండిపడుతున్నారు మాజీ కార్పొరేటర్స్‌. ఇలా నియోజకవర్గంలో ప్రతి వ్యవహారంలోనూ ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు చేస్తున్న దందాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ నాయకులు కూడా ఈ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నారట. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీకి గడ్డుకాలం తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో… తన పేరు చెప్పి ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యేకు సమాచారం లేదా? అయనకేం తెలియడం లేదా? లేక తెలిసినా మనోళ్ళేకదా అని లైట్‌ తీసుకుంటున్నారా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి.అనుచరుల వ్యవహారాల మీద ఎమ్మెల్యే దృష్టిపెట్టకపోతే పార్టీతో పాటు ఆయన కూడా మినిగిపోవడం ఖాయమన్నది పత్తిపాడు టాక్‌.

Exit mobile version