Site icon NTV Telugu

Off The Record : జీవో 49ను అడ్డుపెట్టుకొని జోరుగా రాజీనామా డ్రామాలు

G049

G049

పులి మీదొట్టు… పచ్చి రాజకీయం చేసేస్తాం. రాజీనామా డ్రామాలాడేస్తామని అక్కడి రాజకీయ నేతలంతా అంటున్నారా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఆ ఎపిసోడ్‌లో అందరి ప్రమేయం ఉన్నా… ఎవరికి వారు తూచ్‌… మాకు సంబంధం లేదంటూ పక్క పార్టీ మీదికి నెట్టేస్తున్నారా? ఏంటా ఎపిసోడ్‌? ఎందుకు ఆ స్థాయి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి?

కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్….. పులుల సంరక్షణ కోసం ఈ పేరిట మొన్న మే 30న తెలంగాణ అటవీ శాఖ జీవో నెంబర్ 49 విడుదల చేసింది. ఇదే ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ అస్త్రమై ప్రకంపనలు రేపుతోంది. ఓట్ల రాజకీయంలో ఎవరికి వారు… పైచేయి కోసం ఆ జీవోను అడ్డుపెట్టుకుని రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో. ఈ కన్జర్వేషన్‌ రిజర్వ్ అమలైతే… 339 ఆదివాసి గ్రామాలకు నష్టం జరుగుతుందంటూ… ఉద్యమానికి పిలుపునిచ్చింది తుడుం దెబ్బ. పలు రూపాల్లో ఆందోళన కొనసాగుతున్న క్రమంలో…. ప్రతిపక్ష పార్టీలు దన్నుగా నిలిచారు. ఆదివాసీల పోరాటం ఉధృతం అవుతున్న విషయం గ్రహించి… రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 49 జీవోను అబయెన్స్‌లో పెట్టింది. దీంతో ఆదివాసి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పాలాభిషేకాలు, సంబరాలు సరేసరి. కానీ… ఇక్కడే బీఆర్‌ఎస్‌, బీజేపీ పొలిటికల్‌ వ్యూహానికి పదును పెట్టాయి. కాంగ్రెస్‌కు మార్కులు పడకుండా… గేమ్‌ మొదలుపెట్టాయి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే… జీవో అమలును నిలిపివేయడం కాదు… పూర్తిగా రద్దు చేయమని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతవరకు పోరాటం ఆపేది లేదంటూ క్లారిటీ ఇచ్చేశాయి. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అయితే… ఓ అడుగు ముందుకేసి… రిజర్వ్‌ విషయంలో…కేంద్రం, బీజేపీ పాత్ర ఉంటే మా పార్టీని ఎదిరించడమే కాదు, పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. జీవోని రద్దు చేయకపోతే ఆగస్టు మొదటి వారం నుంచి నిరవధిక దీక్ష చేస్తానని హెచ్చరించారాయన. అటు కాంగ్రెస్‌ మాత్రం దీటుగా కౌంటర్‌ ఇస్తోంది. జీవోని అబయెన్స్‌లో పెట్టినా… కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే… బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు అధికార పార్టీ నాయకులు. వాస్తవానికి జీవో రావడం వెనక కేంద్రం ఒత్తిడి ఉందని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొమరం భీం జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందని దానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందంటూ క్లారిటీ ఇచ్చేశారు కాంగ్రెస్‌ నేతలు.

ఆ జీవో ఇక జీవో ఎట్టి పరిస్థితుల్లో అమలుకాబోదని,…ఒకవేళ అమలైతే మొదట రాజీనామా చేసేది మేమేనని ప్రకటించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్. దీంతో… ఎవరికి వారు రాజకీయ లబ్ది కోసం రాజీనామా డ్రామాలాడుతున్నారన్న చర్చ మొదలైంది ఉమ్మడి జిల్లాలో. అటు 49 జీవోని అబయెన్స్‌లో పెట్టాక కూడా ఆదివాసి సంఘాలు తమ పోరాటం ఆపడం లేదు. తాజాగా కొమురం భీం జిల్లా కలెక్టరేట్ ముందు మహా ధర్నా చేశారు. దీనికి మద్దతు పలికిన బీజేపీ నేతలు ఆ 339 గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడకూడదని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే… అందరూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నట్టే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. వాస్తవంగా కొమురం భీం టైగర్ కారిడార్ కోసం 2015లో నాటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిపాదిస్తే… కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కసరత్తు చేసిందని, అప్పటి నుంచి ఉన్న ఒత్తిడి మేరకు తాము జీఓ నంబర్ 49ని తీసుకొచ్చామన్నది కాంగ్రెస్‌ వివరణ. అలా… ఇందులో అందరి పాత్ర ఉన్నా… ఇప్పుడు ఎవరికి వారు రాజీనామా మాటలు వాడటం రాజకీయం కాక మరేంటన్నది పరిశీలకుల ప్రశ్న. టైగర్ కన్జర్వేషన్ అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తేనే అవుతుంది.అలాంటిది…. అంతా ఫలానా పార్టీనే చేసిందని అవతలి వాళ్ళని నిందించడం ఎంతవరకు కరెక్ట్‌ అన్నది ప్రశ్న. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 49 నెంబర్ జీవోతో చెలరేగిన రాజకీయ మంటలు మాత్రం చల్లారడం లేదు. జీవోను హోల్డ్ లో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా… ఆదివాసీ సంఘాలు పోరాటం చేయడం వెనక కూడా రాజకీయ దురుద్దేశం ఉందన్నది అధికార పార్టీ వాదన. ఇది చివరికి ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.

Exit mobile version