Site icon NTV Telugu

Off The Record : టీడీపీ అధిష్టానికి గంటా మీద నమ్మకం పోయిందా?

Ganta

Ganta

ఆ మాజీ మంత్రికి తత్వం బోథపడిందా? అందలం ఎక్కించిన పార్టీనే అధికారంలో లేనప్పుడు లైట్‌ తీసుకున్నదానికి ఫలితం అనుభవిస్తున్నారా? అందుకే…. పొలిటికల్‌ చాణక్యం తెలిసిన సదరు లీడర్‌ ఇప్పుడు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారా? అందుకే ఇప్పుడు పార్టీ పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతూ రండి… రండి… రండి… దయచేయండని స్వాగతాలు పలుకుతున్నారా? ఎవరా ఎక్స్‌ మినిస్టర్‌? ఏంటా కథ? గంటా శ్రీనివాసరావు….భీమిలి ఎమ్మెల్యే. మాజీమంత్రి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత. ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి, ఒక విడత ఎంపీ. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి అంటే ఎరుగని గంటా….ఎలక్షన్ వ్యూహాలు డిఫరెంట్ గా వుంటాయి. గెలిచిన చోట తిరిగి పోటీ చేయకపోవడం ఆయన ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా 2024లో భీమిలి నుంచి రెండోసారి పోటీ చేసి రాష్ట్రంలోనే సెకండ్ హయ్యస్ట్ మెజారిటీతో గెలిచారు గంటా. ఆ జోష్‌లో మరోసారి మంత్రి పదవి ఆశించారాయన. కానీ వివిధ సమీకరణల కారణంగా… ఆ ఛాన్స్ దక్కలేదు. పైగా.. పేరుకి అధికారపార్టీలోనే వున్నా ఒంటరిగా మిగిలిపోయారా…?. అనే స్ధాయికి చేరుకున్నాయి పరిణామాలు. అందుకు కారణం మాత్రం గంటా శ్రీనివాస్ స్వయంకృతమేనన్నది ఆయన ప్రత్యర్థుల మాట.

టీడీపీ అధిష్టానం ఆయనకు నో కాన్ఫిడెన్స్ బోర్డు పెట్టేసిందని, ఇప్పట్లో దాన్ని మార్చే పరిస్ధితులు కూడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గ ట్టుగానే సీనియర్ ఎమ్మెల్యేలు ఈ మాజీ మంత్రితో మర్యాద పూర్వక కలయికలు తప్ప కీలక వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ ఎంపీ శ్రీభరత్, గంటా మధ్య దూరం బహిరంగ రహస్యం. ఇటీవల భీమిలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇద్దరు కార్పొరేటర్స్‌ గళం విప్పితే…. మందలించాల్సిన జిల్లా నాయకత్వం దానికి విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు హైకమాండ్ వరకు మోసిందట. అంతకు ముందు విశాఖకు విమాన సర్వీసులు నడపడంపై గంటా చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ పార్టీలో తీవ్ర చర్చకు కారణం అయింది. విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కుదించడంపై స్పందిస్తూ… ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అనే పోస్టింగ్ మీద హైకమాండ్ అసహనం ప్రదర్శించినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటివన్నీ కలిపి పార్టీ పెద్దలతో గంటాకు గ్యాప్‌ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, బ్యాక్‌గ్రౌండ్‌ కూడా గట్టిగానే ఉందంటున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్లో HRD మంత్రిగా పనిచేశారు గంటా. అప్పట్లో పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో వర్గ పోరు నడిచింది.

ఒకరు చేరదీసిన వాళ్ళని మరొకరు దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఈ క్రమంలో విశాఖ భూకుంభ కోణం సహా అనేక అంశాలపై అయ్యన్న, గంటాల మధ్య వార్ పీక్స్ లో నడిచింది. అధినాయకత్వంతో విభేదించడం, అలకపూనడం వంటి చర్యలు గంటా మీద చంద్రబాబుకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి కారణం అయ్యాయంటున్నారు. ఇక 2019లో టీడీపీ ఓడిపోయినా… విశాఖ జిల్లాలో మాత్రం నాలుగు సీట్లు గెలుచుకుంది. వీటిలో గంటా విజయం సాధించిన విశాఖ నార్త్ ఒకటి. అప్పట్లో ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్‌ టీడీపీని లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది పెద్దల్లో. అందుకు తగ్గట్టే… అధినేత కార్యక్రమాలకు దూరంగా ఉండేవారాయన. హైకమాండ్ ఫోన్లకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గ బాధ్యతలు ఇన్చార్జ్ చేతుల్లో పెట్టేయడం వంటివి టీడీపీ పెద్దల దృష్టిలో ఆయన పలుచన కావడానికి కారణం అయ్యాయి. అదే సమయంలో గంటా వైసీపీకి దగ్గరవుతున్నారని, ముహూర్తం కూడా పెట్టేసుకున్నారంటూ అప్పట్లో ఒకటికి రెండు సార్లు ప్రచారం జరిగింది. ఆ లీకులను గంటా ఎంజాయ్ చేశారే తప్ప ఖండించకపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది. దాంతో పాటు రుషికొండ వివాదంపై స్పందన.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు…చాలా వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది ఆయనకు. దీంతో పొలిటికల్‌ ప్లాన్స్‌ వేయడంలో దిట్ట అయిన గంటా… ఇప్పుడు స్టైల్‌ మార్చారట. తొందరగానే తత్వాన్ని గ్రహించి…. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డిసైడై పద్ధతి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో పార్టీ పెద్దలు జిల్లాకు వచ్చినప్పటికీ అంటీముట్టనట్టుగా వుండే పరిస్ధితి నుంచి బయటపడి… ఇప్పుడు ఎదురెళ్ళి స్వాగతం పలికే వరకు వచ్చిందట వ్యవహారం. ఇటీవల లోకేష్‌ తరచూ విశాఖ వస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళడం, ఆహ్వానించడం రొటీన్ కానీ… గంటా శ్రీనివాస్‍ గతానికి భిన్నంగా ఎయిర్‍ పోర్టుకు వెళ్ళి మరీ…రండి…రండి…దయచేయండని వినమ్రంగా స్వాగతించడం చూసి….ఇదేదో కొత్తగా వుందే అని గుసగుసలాడేసుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆ మధ్య బహిరంగ వేదికపై చంద్రబాబు ఓ రేజ్‌లో ఆకాశానికెత్తేశారు గంటా. ఇప్పుడు లోకేష్‌ను ప్రసన్నం చేసుకునేందుకు డబుల్‌ ట్రయల్స్‌లో ఉన్నారాయన.

తాజాగా రెండు రోజుల పర్యటన కోసం విశాఖకు వచ్చిన విద్యాశాఖ మంత్రితో కలిసి ఒకే డయాస్ పంచుకోవడం, భీమిలి నియోజకవర్గం స్కూల్స్‌లో ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభించడం కొంత సానుకూలతగా భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమమే అయినప్పటికీ… లోకేష్‌తో గంటాకు గ్యాప్ తగ్గిందా….? అన్న భావన కలిగించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇక ఒకే పార్టీలో ఉన్నా… ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా కనిపించిన అయ్యన్న, గంటాలు ఇటీవల యాధ్రుచ్చికంగా కలిశారు. ఓ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్ తో మర్యాదపూర్వక కరచాలనం చేశారు గంటా. ఇవన్నీ ఒక్కొ క్కటిగా పేర్చుకుని చూసుకుంటే… మాజీ మంత్రికి ఆలస్యంగా తత్వం బోధపడినట్టే కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ స్ధాయిలో ‘బెల్’ బాటమ్ లైన్ టచ్ చేయడం వెనుక మరో కీలక అంశం కూడా ఉండవచ్చంటున్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి పరిస్ధితులను ఇప్పుడే అంచనా వేయడం కష్టం. మరోసారి పోటీ చేయాలన్న ఆసక్తి కూడా మాజీ మంత్రికి లేదని తెలుస్తోంది. అందుకే కుమారుడు రవితేజ కోసం ఇప్పటి నుంచే ప్లాట్ ఫామ్ రెడీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే భీమిలి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు సన్నాఫ్‌ గంటా. అలా… మెల్లిగా రవితేజను లోకేష్‌ టీమ్‌లో చేర్చగలిగితే…. ఇక సమస్య ఉండబోదన్నది భీమిలి ఎమ్మెల్యే వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా… ఆయనలో వచ్చిన ఈ మార్పు గురించి మాత్రం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Exit mobile version