ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా? లేక కొత్త కొత్త ట్విస్ట్‌లకు అవకాశాలున్నాయా? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తెలంగాణ సభాపతి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్‌పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ వాళ్ళకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్స్‌ను డిస్పోజ్ చేశారు. దాంతో… మిగతా ఐదుగురి సంగతేంటన్న చర్చ మొదలైంది. అందులో కూడా….పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్స్ మీద విచారణ ముగిసింది. ఇక జడ్జిమెంట్ మిగిలిఉంది. అలాగే… ఇంకో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ సంగతేంటి? ఆ పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకరించిన నోటీసులకు ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వాటి ఆధారంగానే ఐదుగురికి లైన్ క్లియర్ అయిపోయింది.
మిగతా ఐదుగురిలో బాగా క్రిటికల్ అనుకుంటున్న ఇద్దరి విషయంలో స్పీకర్ ఏం చేస్తారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. ఆ ఇద్దరిలో ఒకరు కడియం శ్రీహరి కాగా…ఆయన కూడా ఇప్పటికే వివరణ ఇచ్చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని, ఇప్పటికీ తన జీతం నుంచి నెలనెలా కొంత మొత్తం బీఆర్‌ఎస్ ఎల్పీ ఖాతాలో జమ అవుతోందన్న వివరాలను కూడా సమర్పించారు శ్రీహరి. అయితే… పొలిటికల్‌గా బీఆర్‌ఎస్ దాన్ని కౌంటర్ చేస్తూ సోషల్ మీడియా యుద్ధం చేస్తోంది అది వేరే సంగతి. ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే….స్పీకర్ నోటీస్‌కు ఇప్పటిదాకా వివరణే ఇవ్వలేదు. అసలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే…టెక్నికల్‌గా అందరికంటే ఎక్కువగా ఇరుక్కుపోయింది ఆయనే అన్నది విస్తృతాభిప్రాయం. బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన దానం రాజీనామా చేయకుండానే… లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడే అసలు సిసలు సంకటం మొదలైంది. నాగేందర్ విషయంలో ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సివస్తే…ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది. పార్టీ మారలేదని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ మిగతా ఎమ్మెల్యేలు చెప్పిన వివరణను పరిగణలోకి తీసుకున్న స్పీకర్… దానం నాగేందర్ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉత్కరంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరపున బరిలో దిగ కూడదు. ఇక్కడే దానం ఇరకాటంలో పడ్డారన్నది అందరి అభిప్రాయం. మరి దాంట్లో కూడా ఇంకేవైనా చట్టపరమైన వెసులుబాట్లు ఉన్నాయా? లేక ఆయన విషయంలో యాక్షన్ తప్పదా అన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే… వోవరాల్‌గా ఈ ఫిరాయింపులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. జనవరిలో విచారణ ఉన్న క్రమంలో అప్పటి వరకు వేచి చూస్తారా..? లేదంటే అంతకంటే ముందే స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి తోడు… అసెంబ్లీ కార్యదర్శి నరసింహచార్యులును కౌన్సిల్‌కు బదిలీ చేశారు. దాంతో.. కొత్త కార్యదర్శి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు..? ప్రస్తుతానికి ఉన్న అనర్హత పిటిషన్స్ అన్నిటిని.. నరసింహచార్యులే పూర్తి చేస్తారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నందున అటు పిటిషన్లు…ఇటు సభ నిర్వహణ లాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే… అనర్హత పిటిషన్స్‌ని క్లియర్ చేయడానికి ముందు రోజే పిటిషనర్స్‌కు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే అలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. దాంతో మిగతా ఐదురుగురి విషయంలో స్పీకర్ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
