OTR : కాంగ్రెస్ లో జుక్కల్ ఎమ్మెల్యే వర్సెస్ జహీరాబాద్ ఎంపీ

Con

Con

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు అక్కడ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా ఇరుకున పెడుతోందా? ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే అసెంబ్లీ సెగ్మెంట్‌ మొత్తాన్ని ఎంపీ చుట్టేస్తున్నారా? ఎంపీ నిధులతో చేపట్టే పనుల శంకుస్థాపనలకు కూడా శాసనసభ్యుడికి ఆగ్వానం ఉండటం లేదా? ఇద్దరి మధ్య పార్టీ కేడర్‌ కూడా నలిగిపోతోందా? ఉప్పు నిప్పులా మారిపోయిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళకు ఎక్కడ చెడింది? కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పాలిటిక్స్.. కాంగ్రెస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నటి వరకు పోలీసులు- ఎమ్మెల్యే మధ్య వచ్చిన గ్యాప్ రాష్ట్ర స్దాయిలో చర్చకు దారితీయగా.. తాజాగా ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య ఆధిపత్య పోరు గాంధీభవన్‌ను తాకిందట. లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరి మధ్య గ్యాప్ రాగా.. ఇప్పుడది చినికి చినికి గాలివానలా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు, ఎంపీ సురేష్ షెట్కర్ కు మధ్య మాటల్లేవట. ఎమ్మెల్యేకి సమాచారం లేకుండానే ఎంపీ జుక్కల్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టొస్తున్నారు. సమావేశాలు కూడా పెడుతున్నారట. ఎమ్మెల్యే దూరం పెట్టిన వాళ్లని దగ్గరకు తీసుకుని వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారులు తన మాటే వినాలని ఎంపీ వత్తిడి చేస్తున్నారట. ఇలా… ఒకరు అవునంటే మరొకరు కాదంటూ ఒకే పార్టీలో రెండు గ్రూపులు నడిపిస్తున్నారన్నది కేడర్‌ మాట. ఇటు ఎమ్మెల్యే సైతం అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించరట. ఆ రకంగా…ఇద్దరి మధ్య అస్సలు పొసగడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా మారిపోవడం కేడర్‌ని సైతం ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. తన నియోజకవర్గంలో అనవసరంగా వేలు పెడుతున్నారంటూ ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యే మనుషులు గుర్రుగా ఉన్నారట.

పార్టీకి నష్టం చేస్తున్నారనే ఉద్దేశంతో కొంత మందిని పక్కన పెడితే, ఎంపీ సురేష్ షెట్కర్ పనికట్టుకుని వాళ్ళని చేరదీయడం పట్ల ఎమ్మెల్యే రుసరుసలాడుతున్నారట. అలాగే… ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు వీరి మధ్య అంతరాన్ని మరింత పెంచినట్టు తెలిసింది. బిచ్కుందలో మున్నూరు కాపు సంఘం భవన శంకుస్థాపన ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా జరిగిపోయింది.దానికి నిధులు ఎంపీ ఇచ్చినా… శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవటం రచ్చకు కారణం అయింది. నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సైతం ఎంపీ షెట్కర్ నిధులు ఇచ్చినా…, ఆయన అనుచరులకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టడం, పనుల్లో పురోగతి లేకపోవటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా ప్రతి విషయంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా మారింది వ్యవహారం. ఇది ఇలాగే పెరిగితే….ఇద్దరి మధ్య దూరం మరింత ఎక్కువై పార్టీకి నష్టం జరగడం ఖాయం అంటోంది కేడర్‌. దీనిపై ఇప్పటికే పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం ఎటువైపుకు దారితీస్తుందోనని ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. హస్తం పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్యే లక్ష్మికాంత రావు, ఎంపీ సురేష్ షెట్కర్ ల మధ్య సయోధ్య కుదుర్చి.. గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పాత క్యాడర్ కోరుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతల చేతులు కలుస్తాయా.. కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అన్నది వేచి చూడాలి.

×
×
Ad