Site icon NTV Telugu

Off The Record : వైఎస్ జగన్ దృష్టికి చిత్తూరు జిల్లా పార్టీ పరిణామాలు

Chittoor

Chittoor

పొలిటికల్‌ పగలందు చిత్తూరు పగలు వేరయా అన్నట్టుగా ఉందట వ్యవహారం. బయటి ప్రపంచానికి ఇచ్చే కలర్‌ వేరు, లోలోపల ఉండే వ్యవహారం వేరన్నట్టుదా ఉందట. పేరుకు అందరిదీ ఒకే పార్టీ. ఒకటే నాయకత్వం. కానీ… ఎవరికి వారు కసితో రగిలిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? ఎందుకు వాళ్ళలో వాళ్ళని అంత కసి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరని అంటారు. అది ఎక్కడైనా ఏమోగానీ…. మా దగ్గర మాత్రం కాదని అంటున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు. మాకు మేమే, మీకు మీరే… అంటూనే పైకి మాత్రం యమా కవరింగ్‌ ఇచ్చుకుంటూ…. భాస్కర్‌ అవార్డ్‌ల కోసం పోటీలు పడుతున్నారు. 2019లో ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది వైసిపి. కానీ… 2024కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. 12 సీట్లలో ఓడిపోయి కేవలం రెండిటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక చిత్తూరు వైసీపీ అనగానే…..పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అత్యంత సన్నిహితులని చెప్పుకునే నేతలే ఎక్కువగా కనిపిస్తారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా , నారాయణ స్వామి… ఇలా చాలామంది సీనియర్స్‌ ఉన్నారు. పైకి చూడ్డానికి అమ్మో… ఒక్క జిల్లాలో ఇంతమంది సీనియర్సా అన్నట్టుగా ఉంటుందిగాని…. వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం ఎవరికి వారేనన్నది కేడర్‌ వాయిస్‌. 2019 ఎన్నికల తర్వాత పదవుల కోసం కొందరు, ఆధిపత్యం కోసం మరికొందరు విడిపోయి పరస్పరం పగతో రగిలిపోతున్నట్టు బహిరంగంగానే చెప్తున్నారు పార్టీ కార్యకర్తలు. అప్పట్లో చాలామంది నేతలు పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని సహించలేకపోయారట. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా ,భూమన కరుణాకర్‌రెడ్డి పైకి బాగానే ఉన్నా… లోలోపల మాత్రం వేరే స్టోరీలు నడిచేవన్న మాటలు గట్డిగానే వినపడేవి. జిల్లాలో టికెట్లు కేటాయింపు నుండి ఏదైనా సరే ..పెద్దిరెడ్డి కను సన్నల్లోనే నడిచేది‌. ఇతర నేతలు దాన్ని సహించలేక పోయేవారు. రోజా అయితే డైరెక్ట్ గానే పెద్దిరెడ్డి మీద పలుమార్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి పైకి చెప్పలేకపోయినా తన వ్యూహంతో ముందుకెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ సీనియర్ నేతలు అందరి మీద ఒక్కొక్కరిగా కేసులు నమోదవడంతో పాటు అరెస్టులు కూడా అవుతున్నారు.

ముఖ్యంగా లిక్కర్ స్కాంలో జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలిగా అరెస్టయ్యారు. తర్వాత ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే…ప్రస్తుతం మిగిలిన నేతలు వీరికి కనీస మద్దతు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మీడియా ముందు మాట్లాడుతున్నవన్నీ పైపై మాటలేనని, వాస్తవంగా అరెస్ట్ అయిన వాళ్ళ మీద జిల్లాలోని మిగతా వైసీపీ నేతలకు మనస్ఫూర్తిగా సానుభూతి లేదని చెప్పుకుంటున్నారు. అందుకే జైల్లో ఉన్న వాళ్ళని కనీసం ములాకత్‌లో కలవడానికి కూడా ఎవరూ వెళ్లలేదని రీజనింగ్‌ ఇస్తున్నారు కొందరు. దీన్నిబట్టే… వీళ్ళ పగలు, ప్రతీకారాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇప్పుడు జిల్లా వైసీపీలో ఇదే హాట్ టాపిక్. తన అన్నయ్య అంటూ ఒకప్పుడు ఎంపీ మిధున్ రెడ్డికి రాఖీ కట్టి మరీ శుభాకాంక్షలు చెప్పిన రోజా… ఇప్పుడు జైల్లో ఉన్న అన్న పరామర్శకు ఎందుకు వెళ్ళలేని ప్రశ్నిస్తున్నవాళ్ళు సైతం ఉన్నారు జిల్లా పార్టీలో. గతంలో తనను ఓడించడానికి పెద్దిరెడ్డి కుటుంబం కుట్రలు చేయడమే కాకుండా తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేశారంటూ అంతకు ముందు రోజా చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట ఆ వర్గం నాయకులు. అందుకే ఆమె కనీస మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని అంచనా వేస్తున్నారు. అటు భూమన కరుణాకర్‌రెడ్డి, నారాయణస్వామి సహా ఇతర నేతలు ఎవరూ.. మిథున్‌రెడ్డి ఉన్న రాజమండ్రి జైలు వైపు చూడకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఇక మిధున్ అరెస్టును వ్యతిరేకిస్తూ… జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగానే నిరసనలు జరిగాయన్నది లోకల్‌ టాక్‌. దీన్నిబట్టే అప్పట్లో పెద్దిరెడ్డి అండ్‌కో ఇతర నాయకుల్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో అర్ధం చేసుకోవచ్చని అంటోంది ఆయన వ్యతిరేక వర్గం. ఇక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టై చాలా రోజులు గడుస్తున్నా జిల్లా నేతల మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

జైలు దాకా వెళ్ళలేదు సరేగానీ… కనీసం మద్దతు ప్రకటన కూడా ఎందుకు ఇవ్వలేదన్నది చర్చనీయాంశం అయింది. దీనికంతటికీ కారణం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరేనన్నది వ్యతిరేక వర్గం మాట. అయితే అటు ఈ ఇద్దరు నేతల అనుచరులు మాత్రం ఇప్పుడు మా వంతు వచ్చింది, రేపు మీ వంతు వస్తే… అప్పుడు తెలుస్తుంది నొప్పేంటో అని అంటున్నారట. ఆడుదాం ఆంధ్ర సహా ఇతర వ్యవహారాల్లో రోజాపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని, భూమన విషయంలో కూడా వివిధ అక్రమాలకు సంబంధించి విచారణ సాగుతోందని‌.. ఇప్పుడు మాదాకా వచ్చిన అరెస్టులు రేపు మీ దాకా రాకపోవా? అప్పుడు మీకు ఎవరు మద్దతిస్తారో మేమూ చూడకపోతామా అంటూ, మిథున్‌, చెవిరెడ్డి అనుతరులు సోషల్‌ మీడియాలో సొంత పార్టీ నేతల్నే దుమ్మెత్తి పోస్తున్నారట. ఈ పరిణామాలన్నీ ఆందోళన కలిగిస్తున్నాయంటూ… కొందరు సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.పార్టీ అధినేత జగన్ దగ్గర కూడా కొందరు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. అయినా సరే…. మా రూటే సపరేటు అన్నట్టుగా చిత్తూరు వైసీపీ నేతలు ఉండటం పార్టీ కేడర్‌ను కలవరపెడుతోందంటున్నారు పరిశీలకులు.

 

Exit mobile version