టైం బ్యాడ్ అయితే….. అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుందని అంటారు. ఇప్పుడా ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉందా? శాసనసభ్యుడిగా రచ్చ గెలిచిన ఆ లీడర్…. ఇంట గెలిచేందుకు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందా? సొంత పార్టీ నేతల తీరుతో విసిగిపోయి నడిరోడ్డు మీద నానా రచ్చ చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అంత జరిగినా ఆయన మాట చెల్లుతుందన్న గ్యారంటీ ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి పోలవరం. ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే… ఇక్కడి గ్లాస్ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రత్యర్ధులపై విసరాల్సిన పంచ్‌లన్నీ సొంత పార్టీ నేతలకే పడుతున్నాయంటున్నారు కార్యకర్తలు. పోలవరం జనసేనలో ఇన్నాళ్ళు జరిగిన వర్గపోరు ఒక ఎత్తయితే… ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే భార్య కూడా సీన్‌లోకి రావడం ఇంకా ఆసక్తిగా మారింది. తన భర్తను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప… తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం కడుపుకోవాలనిచూస్తే ఊరుకునేది లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారామె.
ప్రస్తుతం బాలరాజుతో కలిసి పని చేసేందుకు స్థానిక జనసేన నేతలు,,,.. ఇంకా చెప్పాలంటే ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఏ మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే… ఆయన మీద పూటకో ప్రచారం జరుగుతోందట. రెండేళ్ల నుంచి పరిస్థితి ఎలా ఉన్నా…. ఇప్పుడు ఉన్నఫళంగా అనుచరగణంతో బలనిరూపణ చేసిమరీ… ఎమ్మెల్యే నడిరోడ్డు మీద పూనకాలు లోడింగ్ అన్నట్టు పంచ్‌లు పేల్చారు. దీంతో… పోలవరంలో ఏం జరుగుతోంది.. MLA పరిస్థితి ఏంటనే చర్చలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. నేను రెండేళ్ల నుంచి అనుభవిస్తున్నా…… చిన్నదానికి, పెద్దదానికి.. చీటికి..మాటికి నా మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని నడిరోడ్డుపై గుడ్డలూడదీసి కొడతానంటూ బాలరాజు చేసిన వ్యాఖ్యలు జనసేనలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో నేను నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోకుంటే బాలరాజునే కాదంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో పోలవరం జనసేన లో వర్గ రాజకీయాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే ఇంతలా ఎందుకు రెచ్చిపోయారు? పూనకం వచ్చినట్టు ఊగిపోవడానికి అసలు కారణమేంటని ఆరా తీస్తే…. కొత్త సంగతులు బయటికి వస్తున్నాయి.నియోజకవర్గంలో MLAకి కనీస సమాచారం ఇవ్వకుండా “పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారట. కుల పెద్దలుగా చెప్పుకునే కొంతమంది శాసన సభ్యుడికి సమాచారం ఇవ్వకుండా ఏలూరు పార్లమెంట్ జనసేన పరిశీలకుడిగా ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను తీసుకువచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఫైర్ అవ్వడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. మా ఎమ్మెల్యే 100 కోట్లు దోచేశాడంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడిన DCCB మాజీ చైర్మన్ కరాటం రాంబాబు కుమారుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టు సమాచారం. ఈ పరిస్థతుల్లో…ఎస్టీ అయిన తనని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని భావించిన చిర్రి బాలరాజు చిర్రెత్తి పోయారట.
సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం.. అది కూడా పార్లమెంట్ అబ్జర్వర్ అటెండ్ అయిన ప్రోగ్రామ్‌కు తనను పిలవకపోవడాన్ని చూస్తుంటే… పెత్తందార్లు ఎవరో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఎమ్మెల్యే. అవకాశం మేమే ఇప్పించాం.. మా అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలని పెద్దలుగా చెప్పుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే బాలరాజు నడిరోడ్డు మీద చెప్పడం పోలవరం నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతోంది. దీనికితోడు ఎమ్మెల్యేకి, ఆయన భార్యకు మధ్య ఉన్న విభేదాల గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ శునకానందం పొందుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీని గురించే ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే మా ఇంట్లో ఉన్నాయి…. నా భర్తని రాజకీయంగా ఎదుర్కోండి తప్ప వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించడాన్ని బట్టి చూస్తుంటే…పోలవరం పాలిటిక్స్ ఎంత దిగజారిపోయాయో అర్ధమవుతోందని అంటున్నారు కొందరు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే… లోకల్‌గా జనసేన ముక్కలు చెక్కలుగా విడిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు టీడీపీలోనూ అసంతృప్తి రాగం గట్టిగా వినిపిస్తున్న క్రమంలో… లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌ని కూటమికి ఎలా ఎదుర్కుంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం జనసేన అధినేత పవన్… ఎమ్మెల్యే బాలరాజును పిలిపించి పరిస్థితులు చక్క పెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో పెరుగుతున్న వర్గ విభేదాలు ఎమ్మెల్యేకి అనుకూలంగా మారతాయా లేక పెత్తందారులుగా ఆయన భావించే వర్గానికి అనుకూలం అవుతాయా అన్నది తేలాల్సి ఉంది.

